17, జనవరి 2020, శుక్రవారం

మున్నుడి

తెలుగుభాషా ఛందస్సులలో సంస్కృతం నుండి దిగుమతి చేసుకున్న మార్గి ఛందస్సులనీ తెలుగుభాషకు అచ్చమైన దేశి ఛందస్సులనీ రెండు రకాలున్నాయి.

మార్గి ఛందస్సులలో వందలూ వేలుగా రకరకాల వృత్తాలున్నా నిజానికి ఎక్కువగా వాడుకలో ఉన్నవి మాత్రం‌ నాలుగంటే‌ నాలుగే. అవి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం అనేవి. ఆ నాలుగింటిలోనూ ఉత్పలమాలా శార్దూలాలలోని తొలి గురువును ఇరులఘువువులుగా మారిస్తే వచ్చేవే చంపకమాలా మత్తేభాలు. అంటే అసలు ఉన్నవి రెండే నన్న మాట.

ఈ నాలుగింటి తరువాత, తెలుగు కవులు ఎక్కువగా ప్రయోగించినది దేశీయమైన కందం అనే ఛందస్సు.

ఇవి కాక తెలుగు కవులు ఎక్కువగా ఆదరించినవి గీతులు (తేటగీతి, ఆటవెలది) సీసమూ అన్న రెండు దేశి ఛందో విశేషాలు.

ఇంకా మత్తకోకిలా కవిరాజవిరాజితమూ వంటివీ అతి అరుదుగా స్రగ్ధరా లయగ్రాహి వంటివీ కనిపిస్తాయి మన తెలుగు కవిత్వంలో.

ఐతే తమ ప్రతిభానిరూపణ కోసమనో లేక నవ్యతాప్రియత్వం కారణంగానో కాని అనేకమంది తెలుగు కవులు వెదికి పట్టుకొని మారుమూలన ఉన్న వృత్తాలను వాడారు అక్కడక్కడ. కొన్ని సందర్భాల్లో కొత్తకొత్త వృత్తాలను తామే సృజించుకొని మరీ వాడుక చేసారు.

ఈ‌బ్లాగులో నేను ఇలా మూలన పడియున్న వృత్తాలను శ్రీరామ పరంగా ఉదాహరిస్తూ వివరించాలని ప్రయత్నిస్తున్నాను.

ముఖ్యంగా ఇక్కడ లఘువృత్తాలను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాను.

ఈ‌ప్రయత్నం ఇప్పటికే లోగడ స్వయంగా శ్యామలీయం బ్లాగులో కొంత చేసాను. ఇది ఆప్రయత్నాన్ని ఒక పూర్తి కార్యక్రమంగా మలచే ప్రయత్నం మాత్రమే.