త్రిష్టుప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
త్రిష్టుప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2020, ఆదివారం

రథోధ్ధతము

రథోధ్ధతము.
పంతగించి కలి బాధపెట్టినన్
చింతయన్న దెటు చెంత జేరు నా
యంతరంగవిభు డైన రాముడే
సంతతంబు సుఖశాంతులీయగన్


ఈ రథోధ్ధత వృత్తానికి పాదానికి 11 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIUIU. అంటే గణవిభజన  ర-న-ర-వ యతిమైత్రి స్థానం 7వ అక్షరం. ప్రాసనియమం పాటించాలి.

ఈ‌రధోధ్ధత వృత్తపాదానికి ముందొక గురువును చేర్చితే అది లలితావృత్తం అవుతుంది. ఆ గురువు బదులు రెండు లఘువులను ఉంచితే అది మంజుభాషిణీవృత్తం. ఏకంగా నాలుగు గురువులను ఉంచితే అది ప్రభద్రకం. ఈ ప్రభద్రకం పాదం చివర ఒక గురువును ఉంచితే అది వాణినీ వృత్తం, ర-గణం ఉంచితే అది నందనం అనే వృత్తం.  రథోధ్ధత పాదం‌ ముందు హ-గణం ఉంచితే అది మంజుమాలతి.

విశ్వనాథవారి రామయణకల్పవృక్షం బాలకాండ ఇష్టిఖండము నుండి

    ఱేని సంతస మెఱింగి సూతుఁడున్
    దోన వాజులను దూఁకజేయఁగన్
    బూనికన్ ఖదను పోవఁగా రథా
    స్థాని రాజు మెయిసాగ నూగుచున్ 

ఆధునికులు శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆథ్యాత్మ రామాయణం నుండి ఒక రథోధ్ధతం.

     వారిజాతహితవంశవర్థనా
     వారిజాక్ష శ్రితపారిజాతమా
     వారిజాతభవవందితా నమ
     స్కారమో వరద సద్గుణాకరా

ఈ రథోధ్ధత వృత్తం‌ నడక గురించి ఆలోచిద్దాం. ఈ వృత్తం పాదంలో గురులఘుక్రమం UIUIIIUIUIU అంటే మొత్తం‌16 మాత్రలున్నాయి. పాదం అర్ధభాగంలో అంటే మొదటి అరు అక్షరాలలో 8 మాత్రలూ, ద్వితీయార్ధంలో  8 మాత్రలూ ఉన్నాయి.

ఒక విధంగా చూస్తే, ఈ‌ భాగాలు రెండూ‌ కూడా 3 + 5 మాత్రల ఖండాలుగా విరుగుతాయి. యతిమైత్రి స్థానం చక్కగా రెండవ భాగం మొదటి అక్షరం‌పైన పడింది.

ఱేని - సంతస మె - ఱింగి - సూతుఁడున్
దోన - వాజులను - దూఁక - జేయఁగన్
బూని - కన్ ఖదను - పోవఁ - గా రథా
స్థాని - రాజు మెయి - సాగ -నూగుచున్

మరొక విధంగా చూస్తే పూర్వార్థంలో హ-హ-లల  ఐతే ఉత్తరార్థంలో హ-హ-గ కదా కాబట్టి ఇలా చదువ వచ్చును.
ఱేని  సంత - స మె - ఱింగి - సూతుఁ - డున్
దోన వాజు  - లను - దూఁక - జేయఁ - గన్
బూని కన్ ఖ  - దను - పోవఁ - గా ర - థా
స్థాని  రాజు - మెయి - సాగ -నూగు - చున్

ఈ విధంగా ఉదాహరణకు ఇచ్చిన పద్యం
పంత గించి - కలి  - బాధ పెట్టి  -నన్
చింత యన్న - దెటు  - చెంత జేరు - నా
యంత రంగ - విభు  - డైన రాము  - డే
సంత తంబు - సుఖ  - శాంతు లీయ - గన్

భ్రమరవిలసితము

భ్రమరవిలసితము
ఏమయ్యా యెప్పు డినకులపతీ
నామోక్షం బన్న నగుదు విటులన్
రామా నీవాడ రయము నను నా
స్వామీ కాపాడ వలయును గదా


ఈ భ్రమరవిలసిత వృత్తానికి పాదంలో 11 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUUIIIIIIU. అంటే గణవిభజన   మ-భ-న-వ అని. యతిమైత్రి స్థానం 6వ స్థానం. ఐతే ఇక్కడ ఆ యతిమైత్రి స్థానం ఒక గణం చివరి అక్షరం అవుతున్న దని గమనించాలి మనం. విరామస్థానం అలా ఉంది కదా అని అలా క్తమం విడదిస్తే  UUU UI - III IIU అని పరికించవచ్చును. ఎందుకనో నాకు ఆరవ అక్షరం యతిమైత్రి స్థానంగా తగదేమో అనిపిస్తున్నది. ఆలోచించాలి.

ఈ‌ భ్రమరవిలసిత వృత్తపాదం చివర మరి రెండు గురువులను చేర్చితే అది ప్రజ్ఞామూలం అవుతుంది. రెండు బదులు మూడు గురువులను అంటే మ-గణం ఉంచితే అది చూడాపీడం అవుతుంది. ఆ ప్రజ్ఞామూలం పాదం ముందొక గురువును ఉంచితే అది అసంబాధ అవుతుంది. భ్రమరవిలసిత చివర రెండు ర-గణాలను ఉంచితే అది హరిణీవృత్తం అవుతుంది. ఆ హరిణికి మరొక గురువునూ చివర చేర్చితే అది చంద్రలేఖ అవుతుంది. మరి కొద్ది వృత్తాల్లో కూడా ఈ‌ భ్రరమరవిలసిత సంతకం కనిపిస్తుంది.

ఈ‌ భ్రమరవిలసితం నడక చతురస్రగతిలో ఉంటుంది. అద్యంతాల లోని గురువులను ఒక్కొక్క కాలఖంండగా చూడాలి. మధ్యభాగం సులువుగానే చతుర్మాత్రా ప్రమాణంగా విడిపోతుంది. కానీ‌ ఇలా చేస్తే 6వ అక్షరం యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరదు. అలా చూస్తే న్యాయంగా 8వ అక్షరం యతిమైత్రి స్థానంగా ఉండాలి.  

ఏ - మయ్యా - యెప్పు డి - నకులప - తీ
నా - మోక్షం - బన్న న - గుదు విటు - లన్
రా  - మా నీ - వాడ ర - యము నను - నా
స్వా - మీ కా - పాడ వ - లయును గ - దా


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండము లోని  భమరవిలసిత పద్యం.

మాకందోద్యత్సుమమధుఝురిణీ
సేకంబై త్రావి సివము లెసగన్
సాకూతం బొప్ప సరససరఘా
నీకంబుల్ ఝుమ్మని రొద లురలెన్

ఈ‌ పద్యాన్ని ఎలా చదవాలీ, పై విధంగా కుదురుతుందా అంటే, భేషుగ్గా కుదురుతుంది చూడండి.

మా - కందో -ద్యత్సుమ - మధుఝురి - ణీ
సే - కంబై - త్రావి సి - వము లెస - గన్
సా - కూతం - బొప్ప స - రససర - ఘా
నీ - కంబుల్ -ఝుమ్మని -రొద లుర - లెన్

ఈ‌భ్రమరవిలసితం లయను చతుర్మాత్రాత్మికంగా మరొక విధంగా కూడా చూడ వచ్చును. దీని గురులఘుక్రమం UUUUIIIIIIU. దీన్ని UUUUIIIIIIU అని విడదీయ వచ్చును.UU - UU - IIII - IIU అని ఇలా చతుర్మాత్రల క్రమం వస్తుంది. ఉదాహరణ పద్యాన్ని ఇలా చూడవచ్చును. కానీ‌ ఇలా చేసినా యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరక పోవటం అటుంచి సరైన లయ కనిపించటం లేదు.

ఏమ - య్యా యె - ప్పు డినకు - లపతీ
నామో - క్షం బ - న్న నగుదు - విటులన్
రామా - నీవా - డ రయము - నను నా
స్వామీ - కాపా - డ వలయు - ను గదా

భ్రమరవిలసితానికి గౌరీభట్ల బాలముకుందశర్మగారి పద్యం

గౌరీపుత్రాక్ష గజవదన సాం
బారుద్ధ్యుద్ధే నవ గుణ భసిత
ప్రారంభే పూజ్య లవకరుణయా
ధీరాధానంత్వతిశయ జయ భో

 

9, ఆగస్టు 2020, ఆదివారం

పాదపము

పాదపము.
వారినిధిల్ పొడిబారెడు దాకన్
తారలు నింగికి తప్పెడు దాకన్
వారిజమిత్రుని పంచత దాకన్
ధారుణి రామకథామృత ముండున్


ఈ పాదపం అనేది మరొక పొట్టి వృత్తం. పాదానికి 11 అక్షరాలు. దీనికి గణాలు భ - భ - భ - గగ అనేవి. యతిస్థానం 7వ అక్షరం.
ప్రబంధసాహిత్యంలో పింగళిసూరనగారి కళాపూర్ణోదయం నాలుగవ ఆశ్వాసం చివరి ఆశ్వాసాంత పద్యం చూడండి.

      మాన సుయోధన మంగళ నిత్యా
      నూన యశోధన యుజ్వల కృత్యా
      దాన సుబోధన ధర్మద కృత్యా
      దీన మహాధన దీపిత సత్యా

ఎమెస్కోవారిప్రతిలో పై పద్యాన్ని పొరపాటున తోటకము అని పేర్కొనటం జరిగింది. కాని పాదపవృత్తానికీ తోటకమనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

ఈ‌ పాదపవృత్తానికి  దోదక, తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక అనే నామాలు కూడా ఉన్నాయట! ఒక్క వృత్తానికి ఎన్ని పేర్లో, అందులోనూ తోటక వంటి వేరే లక్షణాలు కల వృత్తాలపేర్లూ కలుపుకోవటం. అంతా నానా కంగాళీగా ఉంది వృత్త నామాల పరిస్థితి చూస్తే.

ఆధునికులు శ్రీ నేమాని సన్యాసి రావు గారి పాదపవృత్తం శంకరాభరణం బ్లాగు ప్రత్యేకవృత్తాలు-3  టపా నుండి క్రింద చూపుతున్నాను.

      శ్రీరఘునందన! చిన్మయ! రామా!
      మారుతి సేవిత! మంగళధామా!
      వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
      క్ష్మారమణా! పర గర్వ విరామా!

ఈ పాదపవృత్తంలో వ్రాసిన పై పద్యాలలో అంత్యానుప్రాసను కూర్చటం గమనించండి.

నేను ఇక్కడ వ్రాసిన పద్యాన్ని పోలిన పద్యం ప్రాచీనమైనది ఒకటి ఉంది.

     యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
     యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
     యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
     తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో

కొంచెం పలుగురాళ్ళ పాకంలో ఉన్న ఈ పద్యం హనుమంతులవారు వ్రాసారని ప్రతీతి కల హనుమద్రామాయణం లోనిదట. ఆసక్తి కలవారు అర్థతాత్పర్యాలతో సహా ఈ పద్యం గురించి  శంకరాభరణం - చమత్కార పద్యాలు - 144 టపా ద్వారా తెలుసుకోవచ్చును.

సరే ప్రస్తుతం‌ ఈ‌ పాదపం‌ నడక దగ్గరకు వద్దాం. దీని నడక గణానువర్తిగా కనిపిస్తోంది. యతిస్థానం దగ్గర విరామం. ఇతరత్రా గణాంతాల్లో కించిల్లఘువిరామంగా చతురస్రగతిలో దీని నడక పొడచూపుతున్నది.

        వారిని - ధుల్పొడి - బారెడు - దాకన్
        తారలు -  నింగికి - తప్పెడు - దాకన్
        వారిజ - మిత్రుని - పంచత - దాకన్
        ధారుణి - రామక - థామృత - ముండున్

ఆసక్తి కలవారు ఈ‌ పాదపాలను కూడ సులభంగా సాధించవచ్చును. వీలైతే ప్రయత్నించండి.

8, ఆగస్టు 2020, శనివారం

స్వాగతం

స్వాగతం.
ధీవరుండు నిజ తేజ మెసంగన్     
దేవదుందుభుల దిక్కులు మ్రోయన్
దేవసంఘములు తీయగ పాడన్
రావణాసురుని రాము డడంచెన్

 
ఈ స్వాగతం అనే వృత్తానికి పాదానికి నాలుగే గణాలు. అవి ర - న - భ - గగ.  గురులఘుక్రమం UIUIIIUIIUU యత్తిస్థానం 7వ అక్షరం. పాదానికి కేవలం 11 అక్షరాలతో ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తం అన్నమాట.

ఈ స్వాగతవృత్తానికి ముందు మరొక గురువును చేర్చితే అది నీరాంతికం (U - UIUIIIUIIUU)  అవుతుంది. గురువుకు బదులుగా రెండు లఘువులను చేర్చితే అది కలహంస (II - UIUIIIUIIUU) అవుతుంది. సౌలభ్యం కోసం విడదీసి చూపాను.

రథోధ్దత వృత్తానికీ‌ ఈ‌ స్వాగతవృత్తానికి చాలా దగ్గరి చుట్టరికం. స్వాగతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIIUU ఐతే రథోధ్ధతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIUIU. చుట్టరికం చూడండి. స్వాగతంలో చివరన ఉన్న UU ను IU అని మార్చితే అది రథోధ్ధతం అవుతున్నది. 

ఈ వృత్తానికి పాదాంతంలో అనుప్రాసను కూర్చటం కూడా మనం చూడవచ్చును.

పింగళి సూరనగారి కళాపూర్ణోదయం ప్రబంధంలో తృతీయాశ్వాసం చివరన ఒక స్వాగతం ఇలా ఉంది:

      నిర్విరామ ధరణీ భర ణాంకా
      గర్వితారి జయకర్మ విశాంకా
      సర్వదిక్చర విశంకట కీర్తీ
      శర్వరీ రమణ సన్నిభ మూర్తీ

ఇక్కడి అంత్యానుప్రాసలను గమనించండి.

శ్రీ నేమాని సన్యాసిరావుగారి స్వాగత వృత్తం చూడండి:

     మౌనివర్య! జనమాన్య చరిత్రా!
     జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
     మాననీయ గుణ! మంగళదాతా!
     పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!

ఈ వృత్తంలో అంత్యానుప్రాసను పాటించలేదు నేమానివారు.

ఈ పద్యాన్ని ఉదాహరణగా స్వాగతవృత్తానికి ఇస్తూ‌ నేమాని వారు, ఇందులో మూడవపాదం చూడండి. ఇక్కడ మాననీయ గుణ! మంగళదాతా! అని ఉంది కదా దీనిని మాననీయ గుణ! మంగళాన్వితా అని మారిస్తే అది రథోధ్ధతం అవుతుంది అని అన్నారు.

ఇక ఈ‌స్వాగత వృత్తం‌ నడకను చూస్తే అది ఇలా ఉంటుంది.
 
ధీవ - రుండు - నిజ    -     తేజ మె - సంగన్    
దేవ - దుందు - భుల   -    దిక్కులు - మ్రోయన్
దేవ - సంఘ - ములు   -    తీయగ - పాడన్
రావ - ణాసు - రుని   -    రాము డ - డంచెన్

అంటే పద్యం‌ పూర్వార్ధ పరార్ధాలుగా యతిస్థానం దగ్గర సరిగ్గా మధ్యకు విరిగి, ఒక్కొక్కటీ ఎనిమిదేసి మాత్రల ప్రమాణంతో వస్తుం దన్నమాట. ఐతే పూర్వార్ధం 3+3+2 మాత్రలుగానూ 4 + 4 మాత్రలు గానూ నడకను చూపుతుంది. ఈ పద్యంలో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం ప్రారంభం కావటం‌ మంచిది. యతిస్థానం పదం‌ మధ్యలో పడితే అంత రక్తి కట్టక పోవచ్చును. కొంచెం‌ గమనికతో ఉండాలి.