11, ఆగస్టు 2020, మంగళవారం

ద్రుతవిలంబితం

ద్రుతవిలంబితం.
ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
నచటి భోగము లెప్పుడు గోరినా
నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
నచట నుండెద నంతియ జాలదే

ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గురులఘుక్రమం  IIIUIIUIIUIU. అంటే గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఉత్పలమాలా, చంపకమాలలకు ద్రుతవిలంబితం చాలా దగ్గరి చుట్టమేను  ఉత్పలమాలకు భ-ర-న-భ-భ-ర-వ అని కదా గణవిభజన. ఇందులో ద్రుతవిలంబితం తాలూకు గణక్రమం  న-భ-భ-ర నేరుగా కనిపిస్తూనే ఉందిగా. ఉత్పలమాలా చంపకమాలల చుట్టరికం వేరే చెప్పాలా? ఇవి కాక, ఇంకా వ్యాకోశకోశలం, సూరసూచకం అనే వృత్తాల్లో ఈ ద్రితవిలంబితం ఇమిడి కనిపిస్తూ ఉంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తపాదానికి ముందు ఒక ర-గణం చేర్చితే అది నూతనం అనే వృత్తం అవుతుంది. రెండు ద్రుతవిలంబితపాదాలను ఒక జతచేస్తే అది శంబరం‌ అనే వృత్తం అవుతుంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.
కాబట్టి రెండు స్థలాలలోనూ యతిమైత్రి పాటించి వ్రాయవలసి ఉంటుంది చిత్రకవిత్వం ఇలా వ్రాసే‌ పక్షంలో.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU         న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                    

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.   ఇలా తేటగీతిలో ద్రుతవిలంబితం గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం‌ బాలకాండము ఇష్టిఖండములోని ద్రుతవిలంబితం

    మది సుమంత్రుడు మంత్రులమాట కొ
    ప్పుదల పూనునొ పూనఁడొ యన్నటుల్
    వదన మింతగ వంచి యనంతరం
    బిదియ మీదగు నిష్టమ యైనచో

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.

1 కామెంట్‌: