5, ఆగస్టు 2020, బుధవారం

త్వరితగతి / పాలాశదళం

త్వరితగతి.
హరియనుచు తనసుతుని
    యత డెఱుగ కోహో
నరవిభుడు దశరథుడు
    నరవరుని దామో
దరుని నిను గనుచు
    సతతమును కడు ప్రేమన్
మురిసెనట యతని
    సుఖమునకు మితి యున్నే


ఈ వృత్తానికి పాదానికి 15లఘువులూ చివరన 2 గురువులూ ఉంటాయి. అంటే పాదం నిడివి 17 అక్షరాలు. ఈ త్వరితగతి వృత్తానికి  సాంప్రదాయికంగా చేసే మూడేసి అక్షరాల గణాల విభజన అంతగా నప్పదు.  అందుచేత 7 నగణాల మీద 2 గురువులు అని చెప్పరాదు.  అలా చెప్పినపుడు పద్యం నడక తెలియదు. నడకను సూచించేలా, దీని గణవిభజనని ఇలా చెప్పటం బాగుంటుంది:

  I  I  I  I  I  -  I  I  I  I  I  -  I  I  I  I  I  -  U  U 

ఇలా ఐతే ఈ పద్యం నడకని తెలుసుకోవటం సులభం. సరిగా నడిపిస్తే ఇది  తకిట-తక, తకిట-తక, తకిట-తక, తైతై అన్నట్లుగా నడుస్తుంది. లేదా తక-తకిట తక-తకిట తక-తకిట తైతై అన్నట్లు నడుస్తుంది.

వీలైనంతవరకు పద్యం అంతా అన్నిపాదాల్లోనూ పై రెండింటిలో ఒకే విధమైన నడకను చూపితే బాగుంటుంది. కనీసం పాదం ఒక ప్రమాణంగా ఒకే‌ నడకతో‌ ఉండటం మంచిది.

వీలైనంతవరకు ఏఖండానికి ఆఖండంగా పదాలు విరిగితే ఈవృత్తానికి నడక బాగా వస్తుంది. ఐతే అలా పద్యం అంతటా సాధ్యపడవచ్చును పడకపోవచ్చును. సాధ్యపడితే చాలా బాగుంటుంది.

యతిస్థానం 11వ అక్షరం.  అంటే మూడవఖండం యతిమైత్రితో‌ ప్రారంభం కావాలి అన్నమాట.

వృత్తం కదా,  ప్రాసనియమం తప్పదు.

అన్నట్లు, ఈ త్వరితగతి వృత్తానికి 'పాలాశదళం' అన్న మరొకపేరు కూడా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి