7, ఆగస్టు 2020, శుక్రవారం

సుకేసర / ప్రభద్రక

సుకేసర.
విశదయశోనిధాను డగు వెన్ను డీధరన్
దశరథ సూనుడై వెలసి ధర్మవీరుడై
దశముఖ రాక్షసాధముని తాను జంపగా
దిశలను రేగి మ్రోగినవి దేవదుందుభుల్


ఈ సుకేసర వృత్తానికి పాదానికి 15 అక్షరాలు. దీని గణాలు న - జ  - భ  - జ  - ర.
చప్పున చంపకమాల గుర్తువస్తున్నదా? సంతోషం. రావలసిందేగా మరి!
చంపకమాలకు  గణాలు  న - జ - భ - జ - జ  - జ - ర  అనేవి. సుకేసరకేమో  న - జ  - భ  - జ  - ర.
అంటే  చంపకమాల పాదంలోనుండి చివరి రెందు జ-గణాలనీ తీసివేస్తే సుకేసర వృత్తం వస్తుంది.
యతిస్థానం  11వ అక్షరం. అంటే చంపకమాల లాగానే‌ అన్నమాట.

వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పనిసరి.

ఈ సుకేశర వృత్తానికే ప్రభద్రకం అని మరొక పేరు కూడా ఉన్నది.

నా కైతే యతివిషయంలో కొంత ఆసంతృప్తి ఉన్నది ఈ వృత్తం‌ నదకను చంపకమాలలాగా చూడకూడదు. అందుచేత  యతిస్థానం 11వ అక్షరం అని చంపకమాలకు లాగా వేయటం సబబు కాదు.  ఈ వృత్తానిది వేరే నడక.

నడక ప్రకారం దీని గణ విభజన (నల) - (ర) - (న - హ) - (ర).  అందుచేత ఈ వృత్తానికి నిజంగా శోభించే యతిస్థానం 8వ అక్షరం అవుతోంది ఈ‌నడకకు.

నేను చూపిన నడక ప్రకారం చూస్తే  పై సుకేసర వృత్తం ఇలా ఉంటుంది.

    విశదయ - శోనిధా - నుడగు వెన్ను  - డీధరన్
    దశరథ  - సూనుడై  - వెలసి  ధర్మ - వీరుడై
    దశముఖ -  రాక్షసా  - ధముని  తాను -  జంపగా
    దిశలను - రేగిమ్రో  - గినవి దేవ - దుందుభుల్

ఈ సుకేసర వృత్తం నా దృష్టిలో ఐతే చాలా అందమైన వృత్తం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి