జగతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జగతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2020, బుధవారం

పదమాలి

పదమాలి.
దయగల తండ్రి కృతాంతదండనా
భయమును ద్రోసి యనన్యభక్తిమై
జయజయరామ యటంచు జక్కగా
ప్రియముగ పాడు బుధాళి వేడుకన్


పదమాలి వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. పాదంలో గురులఘుక్రమం IIIIUIIUIUIU. అంటే దీనికి గణవిభజన న - జ - జ - ర అని. యతిస్థానం 10వ అక్షరం.
 

ఈ పదమాలికి మాలతి అని మరొక పేరుంది. ఈ‌ పదమాలి పాదం చివర మరొక గురువును జోడిస్తే అది మృగేంద్రముఖం అనే వృత్తం అవుతుంది.  కల్పలతాపతాకినీ వృత్తపాదంలో ఈ పదమాలి చివరి పన్నెండు స్థానాలుగా ఉంది. ఈ పదమాలి మొదటి రెండులఘువులనూ తొలగిస్తే అది సహజావృత్తం అవుతుంది. వా బదులు ఒక గురువును ఉంచితే అది ఉత్పలమాలలో అంతర్భాగంగా కనిపిస్తుంది.

దీని నడక మిశ్రగతిలో వస్తుంది. మిశ్రగతి అంటే 3-4 మాత్రల గణాలు వరుసగా వస్తూ ఉండటం.

ఈ మిశ్రగతిలో పై పద్యం నడక ఇలా ఉంటుంది.


దయగల - తండ్రి - కృతాంత - దండ - నా
భయమును - ద్రోసి - యనన్య - భక్తి - మై
జయజయ - రామ - యటంచు - చక్క - గా
ప్రియముగ - పాడు - బుధాళి - వేడు - కన్


ఇక్కడ నడక 4 - 3 - 4 - 3 - 2 మాత్రలుగా కనిపిస్తోంది కదా అంటే పాదాంతంలో గురువును మనకు కావలసి వస్తే మరో రెండు మాత్రల కాలానికి పొడిగించుకోవచ్చును. అప్పుడు 4 - 3 - 4 - 3 - 4 మాత్రలుగా అవుతున్నది.  ఇలా ఉంది కాబట్టి మిశ్రగతి అన్నమాట. మిశ్రగతికి నప్పే తాళం త్రిపుటతాళం. ఇక్కడ మనకు సానుకూలాంశం యతిస్థానం తాళం మధ్యలో రావటం లేదు.  అందుచేత ఈ నడక సహజంగానే నప్పుతుందని నా విశ్వాసం.

11, ఆగస్టు 2020, మంగళవారం

ఇంద్రవంశం / ఇందువంశం

ఇంద్రవంశం.
శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే  
యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే  
నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్



ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తంలో‌ పాదానికి 12 అక్షరాలు. దీని గురులఘుక్రమం UUIUUIIUIUIU. అంటే గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ ఇంద్రవంశానికి ఇందువంశం అని మరొక పేరు కూడా ఉంది.

ఇంద్రవంశపాదానికి ముందు ఒక లఘువును అదనంగా చేర్చితే  అది కరపల్లవోద్గత అనే వృత్తం అవుతుంది. ఇంద్రవంశం పాదారంభం లోని గురువును లఘువుగా మార్చితే అది వంశస్థవృత్తం అవుతుంది. ఆగురువునే రెండు లఘువులుగా మార్చితే అది అంబుదావళీవృత్తం. ఈ‌ ఇంద్రవంశం పాదారంభంలోని గురువును వ-గణం అంటే UI అని మార్చితే అది స్వార్ధపదావృత్తం అవుతుంది. ఇంద్రవంశం చివరి గణం ర-గణంలోని లఘువును తీసివేసి గగ అని మారిస్తే అది ఇంద్రవజ్రవృత్తం అవుతుంది.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగు టపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యం కూడా అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌ కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన మరొక పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి పారేసాం . పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే చచ్చినట్లుగా అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే లెండి అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయవచ్చును.

చంద్రవర్త్మ

చంద్రవర్త్మ.
రాము డల్పుడని రావణు డనియెన్
రామబాణమున ప్రాణము వదిలెన్
కాముకుండు నరకంబున కరిగెన్
భామతోడ రఘువల్లభు డరిగెన్



ఈ చంద్రవర్త్మ వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIIIIU .దీని గణవిభజన ర - న - భ - స.  యతిమైత్రి స్థానం 7వ అక్షరం.అంటే యతిమైత్రి స్థానం వద్ద పాదం సమద్విఖండితం అవుతుం దన్నమాట. ప్రాసనియమం తప్పదు.

ఇది స్వాగతవృత్తానికి సోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట. స్వాగతంలోని న-గణాన్ని లగ అని మార్చితే అన్నే మాత్రలతో, అదే‌ స్వాగతం నడకతో‌ మాధురీవృత్తం అవుతుంది. అలాగే స్వాగతంలోని భ-గణాన్ని గగ అని మార్చితే ఇంచుమించిగా అదే స్వాగతం నడకతో శ్రేయావృత్తం అవుతుంది. స్వాగతంలో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే అదే స్వగతపు మాత్రలూ‌ నడకలతో అది ద్రుతపదవృత్తం అవుతుంది. ఇవన్నీ ఒక చిన్న గుంపు అనుకోవచ్చును.

ఈ చంద్రవర్త్మ యొక్క గురులఘుక్రమం, విషగ్వితానం అనే వృత్తంలో అంతర్భాగంగా ఉంటుంది.

ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అంటే విశ్వనాథవారు వాడారు. వారి సాహిత్యం నుండి ఉదాహరణను సేకరించవలసి ఉంది.

ఈ చంద్రవర్త్మ నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.

    రాము  - డల్పు - డని  - రావణు - డనియెన్
    రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
    కాము - కుండు - నర - కంబున కరిగెన్
    భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్
   

ద్రుతవిలంబితం

ద్రుతవిలంబితం.
ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
నచటి భోగము లెప్పుడు గోరినా
నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
నచట నుండెద నంతియ జాలదే

ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గురులఘుక్రమం  IIIUIIUIIUIU. అంటే గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఉత్పలమాలా, చంపకమాలలకు ద్రుతవిలంబితం చాలా దగ్గరి చుట్టమేను  ఉత్పలమాలకు భ-ర-న-భ-భ-ర-వ అని కదా గణవిభజన. ఇందులో ద్రుతవిలంబితం తాలూకు గణక్రమం  న-భ-భ-ర నేరుగా కనిపిస్తూనే ఉందిగా. ఉత్పలమాలా చంపకమాలల చుట్టరికం వేరే చెప్పాలా? ఇవి కాక, ఇంకా వ్యాకోశకోశలం, సూరసూచకం అనే వృత్తాల్లో ఈ ద్రితవిలంబితం ఇమిడి కనిపిస్తూ ఉంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తపాదానికి ముందు ఒక ర-గణం చేర్చితే అది నూతనం అనే వృత్తం అవుతుంది. రెండు ద్రుతవిలంబితపాదాలను ఒక జతచేస్తే అది శంబరం‌ అనే వృత్తం అవుతుంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.
కాబట్టి రెండు స్థలాలలోనూ యతిమైత్రి పాటించి వ్రాయవలసి ఉంటుంది చిత్రకవిత్వం ఇలా వ్రాసే‌ పక్షంలో.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU         న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                    

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.   ఇలా తేటగీతిలో ద్రుతవిలంబితం గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం‌ బాలకాండము ఇష్టిఖండములోని ద్రుతవిలంబితం

    మది సుమంత్రుడు మంత్రులమాట కొ
    ప్పుదల పూనునొ పూనఁడొ యన్నటుల్
    వదన మింతగ వంచి యనంతరం
    బిదియ మీదగు నిష్టమ యైనచో

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.

నవమాలిని / నయమాలిని

నవమాలిని.
ఇనకుల నాయకా యితరు లేలా
నను నిను కన్నుగానకను తిట్టన్
దనుజుల పైన నాదరము ధర్మం
బన నగు నట్టి వీ రసురు లేమో

     

ఈ నవమాలినీ వృత్తానికి పాదానికి 12 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం IIIIUIUIIIUU.  గణవిభజన న - జ - భ - య.  యతిస్థానం 8వ అక్షరం. వృత్తం‌ కదా, ప్రాసనియమం ఉంటుంది తప్పదు.

ఈ నవమాలినీ వృత్తానికి నయమాలినీ అన్న మరొక పేరు కూడా ఉంది.

ఈ నవమాలినీ‌ వృత్తపాదానికి ముందు ఒక గురువును చేర్చితే అది మయూఖసరణి అనే మరొక వృత్తంగా మారుతుంది. అలాగే ఈ నవమాలినీ వృత్తపాదం నుండి ఆదిలఘువును తొలగిస్తే అది మదనమాల అనే మరొక వృత్తంగా మారుతుంది. ఈ నవమాలిని తొలిలఘువును IU గా మార్చితే అది రుచివర్ణ అనే వృత్తం అవుతుంది.

ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.

పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

దీని నడక చూస్తే ఇల్లా ఉంది:

      ఇనకుల - నాయకా - యితరు - లేలా
      నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
      దనుజుల - పైన నా - దరము - ధర్మం
      బన నగు - నట్టి వీ - రసురు -లేమో

 వేరే‌ నడకలతో ఈ వృత్తంలో‌ పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.

7, ఆగస్టు 2020, శుక్రవారం

లలిత

లలిత.
శ్రీరామచంద్రునకు చిత్త మంకితం
శ్రీరామనామమున జిహ్వ పావనం
శ్రీరామ చింతనము క్షేమదం శుభం
శ్రీరామచంద్రునకు సేవ మోక్షదం

       
ఈ‌ లలిత వృత్తం పాదంలో 12 అక్షరాలుంటాయి. ఇది  ఒక పొట్టి వృత్తం. పాదానికి నాలుగు గణాలు త - భ - జ - ర అనేవి. యతిస్థానం 8వ అక్షరం. ప్రాసనియమం ఉంది వృత్తం కాబట్టి. ఈ పద్యలక్షణం‌ లక్షణసారసంగ్రహం అనే గ్రంథంలో చెప్పబడింది.

ఇంతకు ముందు ఈ‌లలిత వృత్త ఛందస్సులో కవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. 

ఈ వృత్తానికి త-భ-జ-ర అని మూడేసి అక్షరాల కొక గణంగా చెప్పటం వలన నడగ తెలియదు. ఇది ముఖ్యంగా ఐదేసి మాత్రల ప్రమాణంతో‌ నడుస్తున్నది. అందుచేత దీని గురులఘుక్రమం UUI-UII-IUI-UIU అని కాక UUI-UIII-UIU-IU అని చూడాలి. పద్యపఠనం అలవాటున్న వారికి తెలుస్తుంది చివర ఉన్న త్రిమాత్రాప్రమాణమైన  అన్నదానిని పంచమాత్రాప్రమాణదైర్ఘ్యానికి తేవచ్చును అని. అంటే పద్యపఠనంలో ఇది UUI-UIII-UIU-IUU అన్నట్లు వస్తుందన్నమాట. చివరన అదనపు గురువును చేర్చే సౌలభ్యం ఉండాలి అంటే కవి కూడా దీని లయను గ్రహించి వ్రాయటం‌ అన్నది ముఖ్యం. అంటే వీలైతే పాదాంత విరామం వచ్చేలా చూడమని చెప్పటం అన్నమాట. పాతకాలం ప్రవాహధోరణిలో వ్రాస్తే ఈపద్యం అందం చెడే ప్రమాదం పుష్కలంగా ఉంది.

     శ్రీరామ - చంద్రునకు - చిత్త మం - కితం
     శ్రీరామ - నామమున - జిహ్వ పా -వనం
     శ్రీరామ - చింతనము - క్షేమదం - శుభం
     శ్రీరామ - చంద్రునకు - సేవ మో - క్షదం  

ఇటువంటి చిన్నిచిన్న వృత్తాలు మీరు కూడా ప్రయత్నించండి. బాగుంటాయి.
 

తోటకము

తోటకము.
జనకాత్మజయున్ రఘుపుంగవుడున్
జననీజనకుల్ మన కందరకున్
మనసారగ వారిని వేడినచో
మన కోరిక లన్నియు తీరు గదా 
 
తోటకము.
కలిమాయలు నా కనుగప్పెనురా
పలుగాకి పనుల్ పచరించితిరా
కలుషాత్ముని నన్ కరుణించుమురా
కలుషాంతక రాఘవ ప్రాణవిభో
 
తోటకము.
నిను దెల్పెడి విద్యల నేర్చితినా
నిను గూర్చి తపంబున నిల్చితినా
నిను నమ్మితి నంతియె నిక్కముగా
నను గావుమయా రఘునాయకుడా


తోటకం.  చిన్న వృత్తం. పాదానికి 12 అక్షరాలు.
 
దీనికి గణవిభజన మహాసులువు. పాదానికి వరసగా నాలుగంటే నాలుగే 'స' గణాలు. అంతే. 'స' గణం అంటే తెలుసునుగా రెండు లఘువులపైన ఒక గురువు (I I U).  వృత్తం కాబట్టి ప్రాసనియమం పాటించాలి. తొమ్మిదవ అక్షరం యతిస్థానం. నేనైతే యతిస్థానం అనేది ఇంత చిన్న పద్యంలో  అవసరం కాదనుకుంటాను. నా వాదన కొంచెం ముందుకు వెళ్ళాక వివరిస్తాను.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం అందరికీ తెలిసినదే అందులో 'కమలాకుచ చూచుక కుంకుమతో'  నుండి వరసగా బోలెడు తోటకవృత్తాలున్నాయి. ఒకసారి  ఇక్కడ వేంకటేశ్వరస్తోత్రంలో  చదివి చూసుకోండి.

     కమలా కుచ చూచుక కుంకుమతో
     నియతారుణితాతుల నీలతనో
     కమలాయతలోచన లోకపతే
     విజయీ భవ వేంకటశైలపతే

ఈ శ్లోకంలో మొదటి రెండు పాదాలకు ఒక అంత్యప్రాసనూ, చివరి రెండు పాదాలకూ మరొక అంత్యప్రాసనూ గమనించండి.

తెలుగులో ఐతే తోటకం వాడకం తక్కువే అని చెప్పాలి.  శ్రీమదాంద్రభాగవతంలో పోతనగారు ఒక తోటకం వ్రాసారు.

     కరుణాకర! శ్రీకర !కంబుకరా!
     శరణాగతసంగతజాడ్యహరా!
     పరిరక్షితశిక్షితభక్తమురా!
     కరిరాజశుభప్రద! కాంతిధరా!

ఈ పద్యంలో పోతనగారు లక్షణ గ్రంథాల్లో చెప్పినట్లే 9వ అక్షరం యతిస్థానంగా పాటించారు.

పారిజాతాపహరణంలో‌ నందితిమ్మన్నగారు చతుర్థాశ్వాసం చివర వ్రాసినది ఒక తోటకం ఉంది.

      త్వరి తాధరి తానిలవాజి నట
      త్ఖుర జోరు రజోభర గూఢ రవి
      స్ఫురణా కరణాధిక సూత్కృతి మ
      ద్విరదాకర దారణ వీరబలా

ఈ ప్రరమప్రౌఢతోటకవృత్తం నిజానికి సంస్కృత శ్లోకం క్రిందికే వస్తుంది - తెలుగుముక్క ఎక్కడా లేదు మరి. ఐతే తెలుగుపద్యసంప్రదాయం ప్రకారం ఈ తోటకంలో 9అక్షరం దగ్గర యతిమైత్రి మాత్రం యథావిధిగా కూర్చటం కారణంగానూ, తెలుగు కావ్యంలో ఉండటం కారణంగానూ, సంస్కృతశ్లోకాల్లో ఒప్పుదలకాని పాదోల్లంఘనం ఉండటం (అదీ అన్నిపాదాలకూ) కారణంగానూ కచ్చితంగా ఇది తెలుగుపద్యమే అంటే‌ అప్పీలు లేదు మరి.

రంగనాథుడనే కవి మొదట శ్రీవైష్ణవుడుగా ఉండి శివవిముఖత్వం వలన కన్నులు పోగొట్టుకొని బుధ్ధితెచ్చుకొని శివదీక్షాస్వీకారంచేసి ఆ పైన చాలా శైవసాహిత్యం చేసినట్లూ,  ఆ  రంగనాథుఁడు నూఱు తోటక వృత్తములను గూడ రచించినట్లు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో చెప్పారు. ఆ విషయకమైన వేటూరి వారి వ్యాసం వెబ్‌లో లబ్యంగా ఉంది:  రంగనాథుణ్ణి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వ్యాసం పరిశీలించండి.

వాసుదాసబిరుదాంకితులు శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు తమ ఆంద్రవాల్మీకంలో భగీరధుడి వృత్తాంతంలో చెప్పిన ఒక తోటకం చూడండి.

     జగదీశ్వర నాకు బ్రసన్నుఁడవే
     నొగినాతపమున్ ఫలయుక్తమయే
     న్సగరాత్మజులందరు నావలనన్
     వగదీరఁగఁ గాంత్రు నివాపములన్


ఈ తోటకవృత్తం నిడివి చిన్నది. పాదానికి పన్నెండు అక్షరాలే. ఐతే ఇంత చిన్న పద్యం యొక్క యతిస్థానం విషయంలో నాకు కొంత సందేహం ఉంది.

ఈ పద్యం నిడివి చాలా చిన్నది కాబట్టి యతిస్థానం అవసరం లేదు అనుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆధునికులకు చిన్నవృత్తాలను వ్రాయటం గురించి మనం ప్రోత్సహించాలి అనుకుంటే అవకాశం ఉన్న చోట యతిమైత్రి కోసం పట్టుబట్టకుండా ఉండటం మంచిది.

లేదూ మనకు  సాంప్రదాయికపద్యలక్షణం ప్రకారం పోవటమే సమ్మతం అనే పక్షంలో హాయిగా పుస్తకాల్లో లక్షణం చెప్పిన విధంగా 9వ అక్షరం యతి స్థానంగా వాడుకోవచ్చును. ఇందాక చూపిన పోతన గారి పద్యం ఇలా ఉంది యతివిషయకంగా. దీని నడకలో విరుపును కూడా చూపుతున్నాను - గుర్తుతో.

     కరు-ణాకర-శ్రీకర  కంబు-కరా
     శర-ణాగత-సంగత  జాడ్య-హరా
     పరి-రక్షిత-శిక్షిత   భక్త-మురా
     కరి-రాజశు-భప్రద  కాంతి-ధరా

ఈ పోతన్నగారి పద్యంలో అంత్యప్రాసను గమనించండి. కొంచెం అందం పెరిగింది దానివలన అనిపిస్తుంది కదూ?

ఈ తోటకం ఒక సౌష్టవం కల పద్యం.  అంటే ఈ పద్యపాదాన్ని నడిమికి విరచి రెండుగా చేస్తే కుడి ఎడమల్లో ఒకే విధమైన గణవిభజన వస్తుంది. "స-స  స-స" అని. అందుచేత 7వ అక్షరం యతిస్థానంగా ఉండవచ్చునన్న పక్షాంతరం ఒకటి నేను ఇక్కడ సూచిస్తున్నాను. ఈమాట పత్రికలోని ఒక వ్యాసంలో బెజ్జాల కృష్ణమోహన రావుగారు కూడా ఈ విషయంలో "తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 – IIU IIU IIU IIU స-స-స-స 9 సంస్కృతములో యతి లేదు. తెలుగులో తొమ్మిదవ అక్షరము, నాకేమో చతుర్మాత్రల అందము పూర్తిగా తెలియాలంటే ఏడవ అక్షరమును యతిగా నుంచాలి, వేదం వేంకటరాయశాస్త్రిగారు కూడ దీనినే ప్రతిపాదించారు." అని వ్రాసారు.

     కలిమాయలు నా కనుగప్పెనురా
     పలుగాకిపనుల్ పచరించితిరా
          కలుషాత్ముని నన్ కరుణించుమురా
          కలుషాంతక రాఘవ ప్రాణవిభో
 
ధర్మదండ కావ్యంలో - ఆనందగిరి 'తోటకునిగా' నామధేయం సాధించే సందర్భంలోని తోటకములను 9 వ స్థానంలోనే యతినుంచి ప్రయోగించానని చెబుతూ డా. విష్ణు నందన్ గారి ఆ పద్యాలను అందించారు.
 
  గురువర్య! సదా నినుఁ గొల్చినచో
  మరి పామరుఁడే బుధమాన్యుడగున్
  జరితార్థము నాదగు జన్మమికన్
  వర దేశిక ! నీకివె వందనముల్ !
 
  కరుణా జలధీ! నినుఁ గాంచినచో
  పరువెత్తవె సంచిత పాపతతుల్
  తరమా నిను నెంచఁగఁ దత్వనిధీ
  వర దేశిక! నీకివె వందనముల్!
 
  గురుఁడే యజుఁడై చెలఁగున్ గురుడే
  హరియౌను గనన్ హరుఁడౌను గురుం
  డెరుఁగం బరమాత్మ! యిదే నిజమౌ!
  వరదేశిక! నీకివె వందనముల్!
 
  స్ఫురితాఖిల శాస్త్ర విశుద్ధమతీ!
  కరుణాకృతి! నీ పదకంజములే
  స్మరియింతు సదా మనసా వచసా
  వరదేశిక! నీకివె వందనముల్!
 
  అరుసమ్మునఁ గొల్చెద నాదృతితో
  శరణంబనెదన్; భవసాగరమున్
  దరియింపఁగఁ జేయుముదారమతిన్
  వరదేశిక! నీకివె వందనముల్!

ఈ తోటకవృత్తానికి ఎలా యతి ఉంటే బాగుంటుందో ఖచ్చితంగా నిర్ణయించటం కష్టం. తొమ్మిదవ అక్షరం పైన ఐనా, ఏడవ అక్షరం‌పైన ఐనా బాగానే ఉటుంది. సంప్రదాయకంగా ఐతే‌ తొమ్మిదవ అక్షరం పైననే.  అసలు ఈ చిన్న పద్యాన్ని యతిమైత్రి గోల వదిలిపెట్టి వ్రాయటం బాగుంటుం దనిపించ వచ్చు కొందరికి. అందుకే నేను పైన ఇచ్చిన ఒక  పద్యంలో యతిమైత్రిని పాటించలేదు. ఈ ప్రయోగం బాగుందో లేదో చదువరులు చెప్పాల్సిందే.

స్రగ్విణి

స్రగ్విణి.
నీదు నామంబునే నెప్పుడుం బల్కుగన్
నీదు రూపంబు నే నెప్పుడుం జూడగన్
నీదు తత్త్వంబు నే నెప్పుడుం గొల్వగన్
నీ దయన్ రామ రానీయవే నాపయిన్

 

ఈ స్రగ్విణీవృత్తం పాదానికి 12 అక్షరాలతో,  ఒక పొట్టి వృత్తం. పాదానికి నాలుగు ర-గణాలు. రెండు రగణాల తరువాత అంటే 7వ అక్షరం యతిస్థానం. ఇది వృత్తం కదా, ప్రాసనియమం ఉంది. ఈ వృత్తంలో మంచి లయ ఉంది. పాడుకుందుకు భలేగా ఉంటుంది. ప్రసిధ్ధమైన అచ్యుతాష్టకం నిండా స్రగ్విణీ వృత్తాలే. ఉదాహరణకు ఒకటి:


   అచ్యుతం కేశవం రామ నారాయణం
   కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
   శ్రీధరం మాధవం గోపికావల్లభం
   జానకీనాయకం రామచంద్రం భజే 

సంస్కృతంలో అక్షరసామ్యయతి లేదు. కేవలం యతిస్థానం దగ్గర మాట విరగాలన్న నియమం మాత్రం ఉంటుంది. అందుకే పైన మీరు తెలుగులాగా యతిమైత్రి కోసం చూడక్కర్లేదు. అలాగే సంస్కృతంలో మరొక హాయి ఏమిటంటే ప్రాసనియమం  కూడా లేదు.

అన్నట్లు వికీపీడియాలో అచ్యుతాష్టకం ఇక్కడ చదువుకోవచ్చును.

వంశస్థము

వంశస్థం.
ధరాపతుల్ కోరి ధరింపరాని విల్
బిరాన తానెత్తె విశేష మేమయా
పురారివిల్లెత్త మురారికే తగున్
నరావతారంబున నున్నదాతడే 


ఈ వంశస్థవృత్తానికి గణాలు జ - త  జ - ర అనేవి. 7వ అక్షరం‌ యతిస్థానం.  పాదానికి మొత్తం 12 అక్షరాలు మాత్రమే ఉండే పొట్టి వృత్తం. చిట్టిపొట్టి భావాన్ని సూటిగా చెప్పటానికి చాలా బాగుంటుంది.


సంస్కృత కవుల్లో భారవి మహాకవికి వంశస్థం చాలా యిష్టమైన వృత్తం అంటారు.  ఆయన కిరాతార్జునీయంలోని ఒక శ్లోకం చూదాం.

కిరాతార్జునీయంలోని పదిహేనవసర్గ చిత్రకవిత్వం పుట్ట! దానిపైన ప్రత్యేకం వ్రాయాల్సిందే.  ఆ పదిహేనవసర్గ అంతా కిరాతరూపంలో ఉన్న శంకరుడికీ పాండవమధ్యముడైన అర్జునుడికీ మధ్య జరిగిన అతిచిత్ర విచితమైన యుధ్ధం. అందుకే‌ మరి భారవి ఆ సర్గనంతా చిత్రకవిత్వమయం చేసాడు.  అందులోని ఒక వంశస్థం చూపుతాను.

    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః
    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః

మీరేమీ పొరబడటం లేదు.  మొదటి చరణమే,మిగిలిన మూడు చరణాలూను. దీన్ని మహాయమకం అంటారు. ఊరికే సరదాగా అలా భారవి రాసెయ్యలేదండి. ఈ శ్లోకానికి అర్థం భేషుగ్గా ఉంది. అదంతా ఇక్కడ ప్రస్తుతం‌ కాదు.