7, ఆగస్టు 2020, శుక్రవారం

తోటకము

తోటకము.
జనకాత్మజయున్ రఘుపుంగవుడున్
జననీజనకుల్ మన కందరకున్
మనసారగ వారిని వేడినచో
మన కోరిక లన్నియు తీరు గదా 
 
తోటకము.
కలిమాయలు నా కనుగప్పెనురా
పలుగాకి పనుల్ పచరించితిరా
కలుషాత్ముని నన్ కరుణించుమురా
కలుషాంతక రాఘవ ప్రాణవిభో
 
తోటకము.
నిను దెల్పెడి విద్యల నేర్చితినా
నిను గూర్చి తపంబున నిల్చితినా
నిను నమ్మితి నంతియె నిక్కముగా
నను గావుమయా రఘునాయకుడా


తోటకం.  చిన్న వృత్తం. పాదానికి 12 అక్షరాలు.
 
దీనికి గణవిభజన మహాసులువు. పాదానికి వరసగా నాలుగంటే నాలుగే 'స' గణాలు. అంతే. 'స' గణం అంటే తెలుసునుగా రెండు లఘువులపైన ఒక గురువు (I I U).  వృత్తం కాబట్టి ప్రాసనియమం పాటించాలి. తొమ్మిదవ అక్షరం యతిస్థానం. నేనైతే యతిస్థానం అనేది ఇంత చిన్న పద్యంలో  అవసరం కాదనుకుంటాను. నా వాదన కొంచెం ముందుకు వెళ్ళాక వివరిస్తాను.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం అందరికీ తెలిసినదే అందులో 'కమలాకుచ చూచుక కుంకుమతో'  నుండి వరసగా బోలెడు తోటకవృత్తాలున్నాయి. ఒకసారి  ఇక్కడ వేంకటేశ్వరస్తోత్రంలో  చదివి చూసుకోండి.

     కమలా కుచ చూచుక కుంకుమతో
     నియతారుణితాతుల నీలతనో
     కమలాయతలోచన లోకపతే
     విజయీ భవ వేంకటశైలపతే

ఈ శ్లోకంలో మొదటి రెండు పాదాలకు ఒక అంత్యప్రాసనూ, చివరి రెండు పాదాలకూ మరొక అంత్యప్రాసనూ గమనించండి.

తెలుగులో ఐతే తోటకం వాడకం తక్కువే అని చెప్పాలి.  శ్రీమదాంద్రభాగవతంలో పోతనగారు ఒక తోటకం వ్రాసారు.

     కరుణాకర! శ్రీకర !కంబుకరా!
     శరణాగతసంగతజాడ్యహరా!
     పరిరక్షితశిక్షితభక్తమురా!
     కరిరాజశుభప్రద! కాంతిధరా!

ఈ పద్యంలో పోతనగారు లక్షణ గ్రంథాల్లో చెప్పినట్లే 9వ అక్షరం యతిస్థానంగా పాటించారు.

పారిజాతాపహరణంలో‌ నందితిమ్మన్నగారు చతుర్థాశ్వాసం చివర వ్రాసినది ఒక తోటకం ఉంది.

      త్వరి తాధరి తానిలవాజి నట
      త్ఖుర జోరు రజోభర గూఢ రవి
      స్ఫురణా కరణాధిక సూత్కృతి మ
      ద్విరదాకర దారణ వీరబలా

ఈ ప్రరమప్రౌఢతోటకవృత్తం నిజానికి సంస్కృత శ్లోకం క్రిందికే వస్తుంది - తెలుగుముక్క ఎక్కడా లేదు మరి. ఐతే తెలుగుపద్యసంప్రదాయం ప్రకారం ఈ తోటకంలో 9అక్షరం దగ్గర యతిమైత్రి మాత్రం యథావిధిగా కూర్చటం కారణంగానూ, తెలుగు కావ్యంలో ఉండటం కారణంగానూ, సంస్కృతశ్లోకాల్లో ఒప్పుదలకాని పాదోల్లంఘనం ఉండటం (అదీ అన్నిపాదాలకూ) కారణంగానూ కచ్చితంగా ఇది తెలుగుపద్యమే అంటే‌ అప్పీలు లేదు మరి.

రంగనాథుడనే కవి మొదట శ్రీవైష్ణవుడుగా ఉండి శివవిముఖత్వం వలన కన్నులు పోగొట్టుకొని బుధ్ధితెచ్చుకొని శివదీక్షాస్వీకారంచేసి ఆ పైన చాలా శైవసాహిత్యం చేసినట్లూ,  ఆ  రంగనాథుఁడు నూఱు తోటక వృత్తములను గూడ రచించినట్లు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో చెప్పారు. ఆ విషయకమైన వేటూరి వారి వ్యాసం వెబ్‌లో లబ్యంగా ఉంది:  రంగనాథుణ్ణి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వ్యాసం పరిశీలించండి.

వాసుదాసబిరుదాంకితులు శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు తమ ఆంద్రవాల్మీకంలో భగీరధుడి వృత్తాంతంలో చెప్పిన ఒక తోటకం చూడండి.

     జగదీశ్వర నాకు బ్రసన్నుఁడవే
     నొగినాతపమున్ ఫలయుక్తమయే
     న్సగరాత్మజులందరు నావలనన్
     వగదీరఁగఁ గాంత్రు నివాపములన్


ఈ తోటకవృత్తం నిడివి చిన్నది. పాదానికి పన్నెండు అక్షరాలే. ఐతే ఇంత చిన్న పద్యం యొక్క యతిస్థానం విషయంలో నాకు కొంత సందేహం ఉంది.

ఈ పద్యం నిడివి చాలా చిన్నది కాబట్టి యతిస్థానం అవసరం లేదు అనుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆధునికులకు చిన్నవృత్తాలను వ్రాయటం గురించి మనం ప్రోత్సహించాలి అనుకుంటే అవకాశం ఉన్న చోట యతిమైత్రి కోసం పట్టుబట్టకుండా ఉండటం మంచిది.

లేదూ మనకు  సాంప్రదాయికపద్యలక్షణం ప్రకారం పోవటమే సమ్మతం అనే పక్షంలో హాయిగా పుస్తకాల్లో లక్షణం చెప్పిన విధంగా 9వ అక్షరం యతి స్థానంగా వాడుకోవచ్చును. ఇందాక చూపిన పోతన గారి పద్యం ఇలా ఉంది యతివిషయకంగా. దీని నడకలో విరుపును కూడా చూపుతున్నాను - గుర్తుతో.

     కరు-ణాకర-శ్రీకర  కంబు-కరా
     శర-ణాగత-సంగత  జాడ్య-హరా
     పరి-రక్షిత-శిక్షిత   భక్త-మురా
     కరి-రాజశు-భప్రద  కాంతి-ధరా

ఈ పోతన్నగారి పద్యంలో అంత్యప్రాసను గమనించండి. కొంచెం అందం పెరిగింది దానివలన అనిపిస్తుంది కదూ?

ఈ తోటకం ఒక సౌష్టవం కల పద్యం.  అంటే ఈ పద్యపాదాన్ని నడిమికి విరచి రెండుగా చేస్తే కుడి ఎడమల్లో ఒకే విధమైన గణవిభజన వస్తుంది. "స-స  స-స" అని. అందుచేత 7వ అక్షరం యతిస్థానంగా ఉండవచ్చునన్న పక్షాంతరం ఒకటి నేను ఇక్కడ సూచిస్తున్నాను. ఈమాట పత్రికలోని ఒక వ్యాసంలో బెజ్జాల కృష్ణమోహన రావుగారు కూడా ఈ విషయంలో "తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 – IIU IIU IIU IIU స-స-స-స 9 సంస్కృతములో యతి లేదు. తెలుగులో తొమ్మిదవ అక్షరము, నాకేమో చతుర్మాత్రల అందము పూర్తిగా తెలియాలంటే ఏడవ అక్షరమును యతిగా నుంచాలి, వేదం వేంకటరాయశాస్త్రిగారు కూడ దీనినే ప్రతిపాదించారు." అని వ్రాసారు.

     కలిమాయలు నా కనుగప్పెనురా
     పలుగాకిపనుల్ పచరించితిరా
          కలుషాత్ముని నన్ కరుణించుమురా
          కలుషాంతక రాఘవ ప్రాణవిభో
 
ధర్మదండ కావ్యంలో - ఆనందగిరి 'తోటకునిగా' నామధేయం సాధించే సందర్భంలోని తోటకములను 9 వ స్థానంలోనే యతినుంచి ప్రయోగించానని చెబుతూ డా. విష్ణు నందన్ గారి ఆ పద్యాలను అందించారు.
 
  గురువర్య! సదా నినుఁ గొల్చినచో
  మరి పామరుఁడే బుధమాన్యుడగున్
  జరితార్థము నాదగు జన్మమికన్
  వర దేశిక ! నీకివె వందనముల్ !
 
  కరుణా జలధీ! నినుఁ గాంచినచో
  పరువెత్తవె సంచిత పాపతతుల్
  తరమా నిను నెంచఁగఁ దత్వనిధీ
  వర దేశిక! నీకివె వందనముల్!
 
  గురుఁడే యజుఁడై చెలఁగున్ గురుడే
  హరియౌను గనన్ హరుఁడౌను గురుం
  డెరుఁగం బరమాత్మ! యిదే నిజమౌ!
  వరదేశిక! నీకివె వందనముల్!
 
  స్ఫురితాఖిల శాస్త్ర విశుద్ధమతీ!
  కరుణాకృతి! నీ పదకంజములే
  స్మరియింతు సదా మనసా వచసా
  వరదేశిక! నీకివె వందనముల్!
 
  అరుసమ్మునఁ గొల్చెద నాదృతితో
  శరణంబనెదన్; భవసాగరమున్
  దరియింపఁగఁ జేయుముదారమతిన్
  వరదేశిక! నీకివె వందనముల్!

ఈ తోటకవృత్తానికి ఎలా యతి ఉంటే బాగుంటుందో ఖచ్చితంగా నిర్ణయించటం కష్టం. తొమ్మిదవ అక్షరం పైన ఐనా, ఏడవ అక్షరం‌పైన ఐనా బాగానే ఉటుంది. సంప్రదాయకంగా ఐతే‌ తొమ్మిదవ అక్షరం పైననే.  అసలు ఈ చిన్న పద్యాన్ని యతిమైత్రి గోల వదిలిపెట్టి వ్రాయటం బాగుంటుం దనిపించ వచ్చు కొందరికి. అందుకే నేను పైన ఇచ్చిన ఒక  పద్యంలో యతిమైత్రిని పాటించలేదు. ఈ ప్రయోగం బాగుందో లేదో చదువరులు చెప్పాల్సిందే.

1 కామెంట్‌: