అతిశక్వరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అతిశక్వరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2020, సోమవారం

మంజులయాన

మంజులయాన.
కనులార భవదీయ కమనీయ రూపమున్
కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
తనివార నిను జూడ తగనందువా ప్రభూ
మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా



ఈ మంజులయాన వృత్తంలో‌ పాదానికి 15 అక్షరాలుంటాయి. దీని  గురులఘుక్రమం IIUIIIUIIIUIUIU అని. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం. ఇది నడక ప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ 'మంజులయాన' వృత్తం  నేను సృష్టించినది. మొదట్లో  దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా. ఆ సందర్భంగా ముందుగా ఈపద్యం లక్షణాన్ని ఒకపాదంగా  ఇవ్వటం‌ జరిగింది. అదెలా అంటే

పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

అని!

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
    అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు, అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా
     
మోహన రావు గారు పరిశీలించి చెప్పినట్లుగా ఇది పూర్తిగా కొత్త గురులఘుక్రమం కలిగిన వృత్తం. తెలిసిన వృత్తాలు దేనిలోనూ ఇది అంతర్భాగం‌ కాదు.

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

యతిమైత్రి స్థానం వద్ద విరుపు ఇవ్వాలి. అంటే అక్కడ కొత్తపదం‌తో‌ మొదలవ్వాలి వీలైనంత వరకు. అప్పుడు వినటానికి చాలా బాగుంటుంది నడక. ముఖ్యంగా పంచమాత్రా విభజనతో నడుస్తున్నది కాబట్టి ఐదేసి మాత్రలకు కొత్తపదాలు పడటం‌ మరింత శోభిస్తుంది. 

7, ఆగస్టు 2020, శుక్రవారం

సుకేసర / ప్రభద్రక

సుకేసర.
విశదయశోనిధాను డగు వెన్ను డీధరన్
దశరథ సూనుడై వెలసి ధర్మవీరుడై
దశముఖ రాక్షసాధముని తాను జంపగా
దిశలను రేగి మ్రోగినవి దేవదుందుభుల్


ఈ సుకేసర వృత్తానికి పాదానికి 15 అక్షరాలు. దీని గణాలు న - జ  - భ  - జ  - ర.
చప్పున చంపకమాల గుర్తువస్తున్నదా? సంతోషం. రావలసిందేగా మరి!
చంపకమాలకు  గణాలు  న - జ - భ - జ - జ  - జ - ర  అనేవి. సుకేసరకేమో  న - జ  - భ  - జ  - ర.
అంటే  చంపకమాల పాదంలోనుండి చివరి రెందు జ-గణాలనీ తీసివేస్తే సుకేసర వృత్తం వస్తుంది.
యతిస్థానం  11వ అక్షరం. అంటే చంపకమాల లాగానే‌ అన్నమాట.

వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పనిసరి.

ఈ సుకేశర వృత్తానికే ప్రభద్రకం అని మరొక పేరు కూడా ఉన్నది.

నా కైతే యతివిషయంలో కొంత ఆసంతృప్తి ఉన్నది ఈ వృత్తం‌ నదకను చంపకమాలలాగా చూడకూడదు. అందుచేత  యతిస్థానం 11వ అక్షరం అని చంపకమాలకు లాగా వేయటం సబబు కాదు.  ఈ వృత్తానిది వేరే నడక.

నడక ప్రకారం దీని గణ విభజన (నల) - (ర) - (న - హ) - (ర).  అందుచేత ఈ వృత్తానికి నిజంగా శోభించే యతిస్థానం 8వ అక్షరం అవుతోంది ఈ‌నడకకు.

నేను చూపిన నడక ప్రకారం చూస్తే  పై సుకేసర వృత్తం ఇలా ఉంటుంది.

    విశదయ - శోనిధా - నుడగు వెన్ను  - డీధరన్
    దశరథ  - సూనుడై  - వెలసి  ధర్మ - వీరుడై
    దశముఖ -  రాక్షసా  - ధముని  తాను -  జంపగా
    దిశలను - రేగిమ్రో  - గినవి దేవ - దుందుభుల్

ఈ సుకేసర వృత్తం నా దృష్టిలో ఐతే చాలా అందమైన వృత్తం.

 

5, ఆగస్టు 2020, బుధవారం

మాలిని

మాలిని.
ధనము బడయ వచ్చున్
    ధారుణిం‌ బొంద వచ్చున్
వనిత నరయ వచ్చున్
    వంశముం‌ బెంచ వచ్చున్
తనివిని గొనవచ్చున్
    దానిచే నేమి వచ్చున్
వినుము కొనుము ముక్తిన్
    వేడుకన్ రామభక్తిన్

 

సంప్రదాయం ప్రకారం దీని గణవిభజన న - న - మ  - య  - య. పాదానికి 15 అక్షరాలు. ఈ వృత్తానికి యతిమైత్రి స్థానం 9వ అక్షరం.


కాని ఈవృత్తం నడక చూస్తే న-న-గగ  ర-ర-గ అన్న ట్లుంటుంది. 

భాసుని కాలమునుంచీ మాలినీవృత్తము వాడకంలో ఉంది.

పాదం ఎనిమిది అక్షరాలు పూర్తి కాగానే విరుగుతుంది. అంటే‌ యతిమైత్రి స్థానానికి ముందు పూర్వార్ధంగానూ అక్కడి నుండి ఉత్తరార్ధంగానూ చెప్పాలి.  మాలినికి సామాన్యముగా అర్ధపాదములకు అంత్యప్రాస ఉంచుతారు. అంటే ఏ‌ పాదాన్నైనా యతిస్థానం దగ్గర రెండు ముక్కలుగా చేస్తే ఆ రెండు భాగాలకూ అంత్యప్రాస ఉండాలన్న మాట. ఆన్ని పాదాలకూ ఒకే అంత్యప్రాస అవసరం కాదు. ఏ పాదానికి అ పాదంలోని భాగాల మధ్యనే అంత్య ప్రాస కూర్చవచ్చును. నేను ఇక్కడ చెప్పిన పద్యంలో నాలుగవ పాదానికి అంత్యప్రాస వేరేగా ఉంది చూడండి.


శివమానసపూజ, శివాపరాధక్షమాపణ స్తోత్రము, శివానందలహరి, త్రిపురసుందరీమానసపూజా స్తోత్రములలో మాలిని మనకు కనబడుతుంది.

శివమానసపూజ నుండి ఒక ఉదాహరణ చూదాం.

   కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 
   శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
   విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
   శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభోః

బమ్మెర పోతన్నగారి శ్రీమదాంధ్రమహాబాగవతం నుండి మరొకటి చూదాం:

  ధరణిదుహితృరంతా ధర్మమార్గానుగంతా
  నిరుపమనయవంతా నిర్జరారాతిహంతా
  గురుబుధసుఖకర్తా కోసలక్షోణిభర్తా
  సురభయపరిహర్తా సూరిచేతోవిహర్తా

ఇలా మెత్తం ప్రతిస్కందాంతంలోనూ ఒక్కొక్క మాలిని ఉంది తెలుగుభాగవతంలో.

ఈ మాలినీవృత్తానికి ఉన్న అనుప్రాసనియమం కారణంగా, ఒక చిక్కు ఉంది. అదేమిటంటే ఏదైనా కథను నడిపించటానికి అనుప్రాసలతో కూడిన ఇలాంటిపద్యాలను వ్రాస్తూ కూర్చోవటం‌ కష్టం. గమ్మున కథాకథనానికి సందర్భోచితం కూడా ఐన మాటలను అనుప్రాసలతో ఉన్నవి పట్టుకొని వాటితో ఇలాంటి పద్యం అల్లటం కించిత్తు శ్రమతో కూడినదే. ఏదైనా వర్ణనలు వగైరా అవసరం ఐన చోట వాడటానికి ఉపయోగించవచ్చును. కాని మనకవులు ఈ పద్యాన్ని అశ్వాసాంతంలో వాడే పద్యాల లిష్టులో వేసేసారు.

అందుకే దీన్ని ప్రత్యేకంగా వ్రాయటమే కాని కావ్యంలో విస్తారంగా వాడటం ఉండదు.

స్వర్గీయ పండిత నేమాని సన్యాసిరావుగారి పద్యం  శంకరాభరణం బ్లాగు టపాలో

    జయము జయము రామా! సర్వలోకాభిరామా!
    జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
    జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
    జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా! 

ఇక్కడ నేమాని వారు అంత్యప్రాసలను ఏపాదానికి ఆపాదానికే‌ పరిమితం చేసారు గమనించారా?