28, ఆగస్టు 2020, శుక్రవారం

పంచశిఖ

పంచశిఖ.
ధరణీతనయాకామా
పురుషోత్తమ నిష్కామా
పరమాత్మ పరంధామా
పరిపాలయమాం రామా


పంచశిఖ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో 28వది. దీని గురులఘుక్రమం IIUIIUUU. అంటే గణవిభజన స-స-గగ అన్నమాట. ఈ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో పాదానికి 8 అక్షరాలుంటాయి. ఈ వృత్త పాదంలోని 8 అక్షరాలకు 12 మాత్రలున్నాయి.

ఈ పంచశిఖ వృత్తాన్ని వ్రాయటం  కొంచెం కష్టం‌ కావచ్చును.

ఏదైనా వృత్తం యొక్క పాదం మొదట్లో ఉన్న గురువును రెండులఘువులుగా కాని, రెండులఘువులను ఒక గురువుగా కాని మార్చటం ద్వారా వేరే సోదరవృత్తం రావచ్చును. ఇక్కడ ఈ పంచశిఖ వృత్తానికి అలా ఏర్పడుతున్న సోదరవృత్తం పేరు వేధ(త-య-గ).

పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో కలిగి యున్న వృత్తాలు కొన్నున్నాయి. అవి  ఆరభటి(భ-భ-న-జ-య-గ), ఇంద్ర(జ-జ-య-గ), ఉదరశ్రీ(స-స-మ), కృతమాల(త-జ-య-భ-గగ), క్రీడాయతన(స-స-స-త-వ), క్రీడితకటక(భ-స-స-మ-మ), క్రోశితకుశల(భ-స-స-గగ), చార్వటక(మ-భ-భ-మ-మ), ధవలకరీ(న-న-భ-మ), భాస్కర(భ-న-జ-య-భ-న-న-స-గ), భూరిశిఖ(స-స-మ-త-వ), వార్తాహరి(న-జ-య-గగ), వాసవిలాసవతి(భ-భ-భ-మ-గ), విలంబితమధ్య(మ-స-స-గగ), విష్టంభ(స-స-స-గగ), వేల్లితవేల(భ-భ-భ-మ-స-న-న-స), శృంఖలవలయిత(భ-న-న-భ-మ-న-న-జ-వ), సరమాసరణి(స-స-త-త-గగ) వృత్తాలు.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంలో అరజస్క(జ-య), కరభిత్తు(స-స-గ), క్రీడ(య-గ), తిలక(స-స), దోల(స-గ), పంక్తి(భ-గగ), ప్రగుణ(స-గగ), వల(భ-గ), శిల(జ-వ), సింధురయ(భ-మ) వృత్తాలు అంతర్భాగంగా కనిపిస్తున్నాయి.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంతో‌ మంచి పోలిక కలిగిన వృత్తాలు అఖని(న-జ-వ), అధీర(భ-మ-గ), అరాళి(జ-జ-వ), అర్ధకల(స-స-స), ఇంద్రఫల(భ-మ-గగ), ఉదిత(స-స-స-గ), కరశయ(న-భ-ర), కరాలి(స-స-వ), కలహ(స-భ-మ), కాండముఖి(జ-భ-భ-గ), కేర(ర-భ-భ-గ), ఖేలాఢ్య(మ-స-మ), గహన(భ-న-భ-గ), చంపకమాల(భ-మ-స-గ), చతురీహ(జ-భ-గగ), చిత్రపద(భ-భ-గగ), జర(జ-జ-జ-గ), ద్వారవహ(ర-త-య-గ), ధృతహాల(మ-భ-మ), పరిచారవతి(త-భ-భ-గ), ప్రసర(మ-స-స-గ), ఫలధర(న-న-భ-గ), మణిమధ్య(భ-మ-స), మదనోద్ధుర(భ-భ-ర), మధ్యాధార(మ-భ-మ-గ), మనోల(య-స-గగ), మౌరలిక(భ-భ-గ), రంజక(భ-స-స), వంశారోపి(య-భ-మ-గ), వర్హాతుర(త-భ-త-గ), వారవతి(స-భ-భ-గ), విద్య(త-జ-వ), విరాజికర(జ-య-గగ), విశదచ్ఛాయ(స-త-య-గ), విశ్వముఖి(భ-భ-భ-గ), వృతుముఖి(న-భ-గగ), వేధ(త-య-గ), శరగీతి(ర-స-గ), శరత్(న-భ-భ-గ), శరలీఢ(న-జ-య), సహజ(స-స-జ-గ), సురయానవతి(స-స-భ-గ), సుషమ(త-య-భ-గ), స్వనకరి(న-భ-గ).

పంచశిఖ వృత్తం పాదం మొదట హ-గణం చేరితే అది ఇంద్ర(జ-జ-య-గ) వృత్తం , మొదట స-గణం చేరితే అది విష్టంభ(స-స-స-గగ) వృత్తం , మొదట భ-గణం చేరితే అది క్రోశితకుశల(భ-స-స-గగ) వృత్తం , మొదట మ-గణం చేరితే అది విలంబితమధ్య(మ-స-స-గగ) వృత్తం , చివర గురువు చేరితే అది ఉదరశ్రీ(స-స-మ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 2వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది మనోల(య-స-గగ) వృత్తం , 3వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది రుద్రాళి(న-స-గగ) వృత్తం , 4వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది పరిధార(స-ర-గగ) వృత్తం , 5వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది యుగధారి(స-య-గగ) వృత్తం , 7వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది కరాలి(స-స-వ) వృత్తం , 2వ స్థానం వద్ద గురులఘువులను  వ-గణంగా మార్చితే అది భారాంగి(జ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు చొప్పిస్తే అది కలహ(స-భ-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  గ-గ చొప్పిస్తే అది విశదచ్ఛాయ(స-త-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  భ-గణం చొప్పిస్తే అది ఉపహితచండి(స-భ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది సురి(న-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  లఘువు తొలగిస్తే అది రసధారి(స-య-గ) వృత్తం , 6వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది కరభిత్తు(స-స-గ) వృత్తం , 1వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది సింధురయ(భ-మ) వృత్తం , 2వ స్థానం వద్ద  హ-గణం తొలగిస్తే అది గుణవతి(న-మ) వృత్తం , 4వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది అభిఖ్య(స-మ) వృత్తం

ఈ‌ పంచశిఖ నడకను చూస్తే ఇది ఆరు మాత్రల తరువాత చిన్న విరుపుతో‌కనిపిస్తున్నది. 

ధరణీతన  -  యాకామా
పురుషోత్తమ  -  నిష్కామా
పరమాత్మ ప  -  రంధామా
పరిపాలయ  -  మాం రామా 

సులభంగా చతుర్మాత్రాత్మికమైన గతితో ఇలా కూడా చాలా చక్కగా ఉన్నది.

ధరణీ  -  తనయా  -  కామా
పురుషో  -  త్తమ ని  -  ష్కామా
పరమా  -  త్మ పరం  -  ధామా
పరిపా  -  లయమాం  -  రామా

ఇలా చిన్న చిన్న వృత్తాలను అంత్యప్రాసలతో చెప్పటం వలన వాటికి మరింత శోభ వస్తుంది.

పంచశిఖా వృత్తానికి పూర్వకవి ప్రయోగా లున్నట్లు కనరాదు.

 


వేధ

వేధ.
నీ వాడనురా రామా
గోవింద సదానందా
రావయ్య మహారాజా
సేవింతునురా  నిన్నే


వేధ ఉష్ణిక్కు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో 13వది. దీని గురులఘుక్రమం UUIIUUU. అంటే గణవిభజన త-య-గ అన్నమాట. ఈ ఉష్ణిక్కు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో పాదానికి 7 అక్షరాలుంటాయి. ఈ వృత్త పాదంలోని 7 అక్షరాలకు 12 మాత్రలున్నాయి.

ఈ వేధ వృత్తాన్ని వ్రాయటం  కొంచెం కష్టం‌ కావచ్చును.

ఏదైనా వృత్తం యొక్క పాదం మొదట్లో ఉన్న గురువును రెండులఘువులుగా కాని, రెండులఘువులను ఒక గురువుగా కాని మార్చటం ద్వారా వేరే సోదరవృత్తం రావచ్చును. ఇక్కడ ఈ వేధ వృత్తానికి అలా ఏర్పడుతున్న సోదరవృత్తం పేరు పంచశిఖ(స-స-గగ).

వేధ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో కలిగి యున్న వృత్తాలు కొన్నున్నాయి. అవి  అంతర్వనిత(మ-స-మ-గగ), అలోల(మ-స-మ-భ-గగ), కందవినోద(భ-మ-స-గగ), కలహ(స-భ-మ), ఖేలాఢ్య(మ-స-మ), గ్రావాస్తరణ(మ-భ-స-భ-మ-భ-గ), జననిధివేల(న-య-స-మ-స), తనుకిలకించిత(మ-మ-మ-న-జ-న-త-య-గగ), ద్వారవహ(ర-త-య-గ), ధీరధ్వాన(మ-మ-మ-స-గగ), ధృతహాల(మ-భ-మ), నాసాభరణ(త-య-భ-త-వ), నిష్కలకంఠి(భ-మ-స-త-య-స-భ-గ), పరిధానీయ(న-న-భ-త-జ-య-స-గగ), ప్రపన్నపానీయ(త-య-త-ర-గగ), బహులాభ్ర(స-భ-స-భ-మ), భాజనశీల(త-య-ర-ర-గ), మంజీర(మ-మ-భ-మ-స-మ), మణిమాల(త-య-త-య), మత్తాళి(మ-త-య-మ), మధ్యాధార(మ-భ-మ-గ), మనోల(య-స-గగ), మేఘధ్వనిపూర(త-య-మ-గగ), రతిరేఖ(త-య-భ-భ-గగ), లీలారత్న(మ-మ-స-మ), వంశారోపి(య-భ-మ-గ), వంశోత్తంస(త-య-స-మ-గగ), వజ్రాళి(త-య-మ-మ-మ), వాణీవాణి(మ-భ-స-భ-త-య-గగ), వాసకలీల(భ-మ-స-త-య-భ-మ-గ), విధురవిరహిత(స-త-య-భ-న-వ), విభ(న-య-త-య-గ), విశదచ్ఛాయ(స-త-య-గ), శంభు(స-త-య-భ-మ-మ-గ), శీర్షవిరహిత(త-య-భ-భ-స), సంసృతశోభాసార(స-త-య-గగ), సుషమా(త-య-భ-గ) వృత్తాలు.వీటిలో వేధ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో ఒకసారి కన్న ఎక్కువగా కలిగి యున్న వృత్తాలు  వాసకలీల(భ-మ-స-త-య-భ-మ-గ).

ఈ వేధ వృత్తం యొక్క గురులఘుక్రమంలో కణిక(త-వ), క్రీడ(య-గ), తనుమధ్య(త-య), దోల(స-గ), పంక్తి(భ-గగ), ప్రగుణ(స-గగ), వల(భ-గ), సింధురయ(భ-మ) వృత్తాలు అంతర్భాగంగా కనిపిస్తున్నాయి.

ఈ వేధ వృత్తం యొక్క గురులఘుక్రమంతో‌ మంచి పోలిక కలిగిన వృత్తాలు అతిమోహ(స-భ-గగ), అధికార(స-భ-గ), అధీర(భ-మ-గ), అభిఖ్య(స-మ), అరజస్క(జ-య), ఇంద్రఫల(భ-మ-గగ), కరభిత్తు(స-స-గ), కల్పముఖి(భ-త-గ), కిణప(భ-య-గ), కేశవతి(య-భ-గ), కౌచమార(స-త-గగ), గుణవతి(న-మ), గోపావేది(న-మ-గగ), చతురీహ(జ-భ-గగ), చిత్రపద(భ-భ-గగ), నిస్క(మ-స), పంచశిఖ(స-స-గగ), పాంచాలాంఘ్రి(న-య-గగ), పూర్ణ(త-జ-గ), ప్రతిసీర(మ-భ-గగ), భారాంగి(జ-స-గగ), మదలేఖ(మ-స-గ), మశగ(య-స), మహనీయ(య-స-గ), మాణవక(భ-త-వ), మాణ్డవక(న-త-వ), మాయావిని(స-త-గ), రుద్రాళి(న-స-గగ), వర్కరిత(మ-భ-గ), వాత్య(భ-య-గగ), విద్య(త-జ-వ), విరాజికర(జ-య-గగ), వృతుముఖి(న-భ-గగ), శంబూక(స-మ-గ), శరగీతి(ర-స-గ), సరఘ(స-త-వ), సారావనద(త-జ-గగ), సురి(న-య-గ), సౌరకాంత(ర-భ-గ), హోల(న-మ-గ).

వేధ వృత్తం పాదం మొదట లఘువు చేరితే అది మనోల(య-స-గగ) వృత్తం , మొదట ల-ల చేరితే అది కలహ(స-భ-మ) వృత్తం , మొదట గ-గ చేరితే అది ధృతహాల(మ-భ-మ) వృత్తం , మొదట స-గణం చేరితే అది విశదచ్ఛాయ(స-త-య-గ) వృత్తం , మొదట ర-గణం చేరితే అది ద్వారవహ(ర-త-య-గ) వృత్తం , చివర స-గణం చేరితే అది సుషమా(త-య-భ-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 2వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది కిణప(భ-య-గ) వృత్తం , 3వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది ఇభభ్రాంత(మ-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది నినాశయ(త-మ-గ) వృత్తం , 5వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది స్థూల(త-స-గ) వృత్తం , 6వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది పూర్ణ(త-జ-గ) వృత్తం , 1వ స్థానం వద్ద గురులఘువులను  ల-లగా మార్చితే అది సురి(న-య-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 6వ స్థానం వద్ద  లఘువు చొప్పిస్తే అది సారావనద(త-జ-గగ) వృత్తం , 3వ స్థానం వద్ద  ల-ల చొప్పిస్తే అది రంభ(త-న-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  వ-గణం చొప్పిస్తే అది అయనపతాక(మ-న-మ) వృత్తం , 5వ స్థానం వద్ద  హ-గణం చొప్పిస్తే అది వైసారు(త-స-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  భ-గణం చొప్పిస్తే అది హీరాంగి(మ-న-య-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 1వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది సింధురయ(భ-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  లఘువు తొలగిస్తే అది వభ్రు(త-మ) వృత్తం , 5వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది తనుమధ్య(త-య) వృత్తం , 1వ స్థానం వద్ద  గ-గ తొలగిస్తే అది ప్రగుణ(స-గగ) వృత్తం , 2వ స్థానం వద్ద  వ-గణం తొలగిస్తే అది సూరిణి(ర-గగ) వృత్తం , 4వ స్థానం వద్ద  హ-గణం తొలగిస్తే అది లోల(త-గగ) వృత్తం.

ఈవృత్తం నడక చూద్దాం. ఆరేసి మాత్రల రెండు భాగాలుగా నడుస్తుంది.

నీ వాడను  -  రా రామా
గోవింద స  -  దానందా
రావయ్య మ  -  హారాజా
సేవింతును  -  రా  నిన్నే

ఐతే ఈ వృత్తం నడకను చతుర్మాత్రాత్మికంగ చూడటం‌ మరింతగా బాగుంటుంది. పాదంలోని మొత్తం 12 మాత్రలూ మూడు చతుర్మాత్రాగణాలుగా చక్కగా 

వేధ.
నీ వా  -  డనురా  -  రామా
గోవిం - ద సదా  -  నందా
రావ - య్య మహా  -  రాజా
సేవిం  -  తునురా  -  నిన్నే


వేధావృత్తానికి పూర్వకవి ప్రయోగా లున్నట్లు కనరాదు.


19, ఆగస్టు 2020, బుధవారం

కుమారలలితము

కుమారలలితము.    
సురేశహితకామా
సురారిగణభీమా  
పురారినుతనామా  
పరాకు రఘురామా


ఈ కుమారలలిత వృత్తంలో‌ పాదానికి 7 అక్షరాలే. చిట్టి వృత్తం. దీని గురులఘుక్రమం IUIIIUU. అనగా గణవిభజన జ-స-గ అని. యతిమైత్రి అవసరం లేదు కాని వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం పాటించాలి.

కావ్యాలంకారచూడామణి కుమారలలితవృత్తం అని పేర్కొన్నది వేరే లక్షణం కలది ఉన్నది. ఇలాగు లక్షణ గ్రంథాలలో తరచుగా ఒకే వృత్తానికి  ఒకో గ్రంథంలో ఒకో పేరుండటమూ,  ఒకే‌ పేరుతో వివిధ గ్రంథాలలో వేరులక్షణాలతో వృత్తా లుండటమూ‌ మామూలే.

ఈ కుమారలలితానికి తగినంత బంధుగణం ఉంది. కుమారలలితం పాదం‌ చివర గురువును చేర్చిటే అది భార్గీ, రెండుగురువులను చేర్చితే అది నిర్వింధ్య, మూడు గురువులను చేర్చితే వీరాంత, నాలుగు గురువులను చేర్చితే ప్రఫుల్లకదళి,  ఉపస్థితం, గళితనాళ, విపన్నకదనం, మత్తేభమూ, శార్దూలమూ, శార్దూలలలితమూ, సంలక్ష్యలీల, వ్యాకోశకోశలం వృత్త పాదాల్లో కుమారలలిత సంతకం కనిపిస్తుంది.  మరికొన్ని లంబాక్షీ, నయమాలినీ, శలభలోల, కుబేరకటిక, మయూఖసరణి, పంకజధారిణి, రుచివర్ణ, ఇంద్రవదన  వృత్త పాదాలు ఈ కుమారలలితం సంతకంతో ముగుస్తాయి. సితస్తవక వృత్త పాదంలో  రెండు కుమారలలిత పాదాలు ఉంటాయి.

ఈ‌వృత్త‌ం‌ నడకను చూస్తే జ-సగ అన్నట్లు జ-గణం తరువాత చిన్న విరుపుతో‌ కనిపిస్తుంది. మరికొంచెం చిన్న విరుపు ఉత్తరార్ధం‌ సగంలో వస్తున్నది. ఉదాహరణ పద్యం‌ ఇలా చదువ వచ్చును. 

సురేశ - హిత - కామా
సురారి - గణ - భీమా  
పురారి - నుత - నామా  
పరాకు - రఘు - రామా


ఇలాంటి చిన్నిచిన్ని వృత్తాలకు అంత్యానుప్రాసలు బాగుంటాయి.  అన్ని పాదాలకు ఒకే విధంగా కాని, మొదటి రెండింటికీ ఒకరకంగా చివరి రెండింటికి మరొక విధంగా కాని, పాదం విడచి పాదానికి నప్పే విధంగా కాని ఎలాగైనా అంత్యానుప్రాసను కూర్చవచ్చును.

ఈ కుమారలలిత వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నవో‌ లేవో తెలియదు.


17, ఆగస్టు 2020, సోమవారం

హేమరూపము.

హేమరూపము.
ప్రేమతో పల్కుచుందువే
కామితం బిచ్చుచుందువే
రామ యీ మౌన మేలరా
స్వామి నా కేది దారిరా


 

ఈ‌హేమరూపవృత్తానికి పాదానికి 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UIUUIUIU. గణ విభజన ర-ర-వ అవుతుంది. చాదస్తులు కాని వారు ఈ‌ గురులఘుక్రమాన్ని ర-వ-ర అని  కూడా చూడవచ్చును. ఇదికొంచెం వికటకవి లాంటిది అనిపిస్తోది కదా. కావలస్తే హ-గణంతో మొదలు పెట్టి హ-త-ర అనీ చూడవచ్చును. ఇన్ని రకాలుగా చూడటం ఎందుకూ? అంత అవసరమా అనవచ్చును కొందరు. ఈ దృష్టికోణం అన్నది పద్యం‌ లయను పట్టుకొనే‌క్రమంలొ అవసరం కావచ్చును. ఈ వృత్తానికే అని కాదు. ఇతర వృత్తాలకూ ఈ దృక్కోణం నుండి ఆలోచించటం‌ చక్కగా ఉపకరిస్తుంది. నిజానికి పద్యం‌ యొక్క లయను గురులఘువుల అమరికను గుంపులుగా విడదీయటం ద్వారా చూస్తున్నాం అన్నప్పుడు గణాలుగా చూడవలసిన అవసరమే లేదు.

ఇప్పుడు ఉదాహరణకు ఇచ్చిన పద్యాన్ని చూదాం. 

ప్రేమ - తో పల్కు - చుందువే
కామి - తం బిచ్చు - చుందువే
రామ - యీ మౌన - మేలరా
స్వామి - నా కేది - దారిరా


ఇదే‌ ఉదాహరణను ఇలాగు చూసినా బాగానే ఉంటుంది. 

ప్రేమతో- పల్కు - చుందువే
కామితం - బిచ్చు - చుందువే
రామ యీ -  మౌన -మేలరా
స్వామి నా  - కేది -దారిరా

ఈ‌రెండు రకాల నడకల్లో‌ పోలిక ఉన్నా తగినంత భేదమూ‌ ఉందని గమనించ వచ్చును.

ఐతే ఈ‌పద్యాన్ని  సంప్రదాయికమైన గణవిభజనను తీసుకొని ఆ ర-ర-వ ఆధారంగా గతిని చూడగలమా చూదాం.
ప్రేమతో -పల్కుచుం - దువే
కామితం -బిచ్చుచుం - దువే
రామ యీ - మౌన మే - లరా
స్వామి నా  - కేది దా - రిరా

ఇక్కడ నడక సరిగా కుదిరినట్లు అనిపించటం‌ లేదు నాకు. కా

అందుచేత గణవిభజన అన్నది మరీ‌ అంత ముఖ్యమైన సంగతి కాదు. ముఖ్యమైనది గురులఘుక్రమం. అది నోటికి అనువు కాదు కాబట్టి గణవిభజన ద్వారా గుర్తుపెట్టుకోవటం. అంతే‌ కాని ఆ గణవిభజన పద్యం‌ లయను  చూపాలన్న నియమం లేదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.

ఈ హేమరూపానికి చుట్టాల సంగతి. దీనికి ఒక డజను సంఖ్యలో‌ఉందది. ఈ పద్యపాద‌ం ముందు హ-గణం చేరితే అది కర్ణపాలిక, ర-గణం చేరితే అది గహ్వరం, న-గణం చేరితే‌ కనకమంజరి, భ-గణం చేరితే అది వారయాత్రికం.  ఇంకా కొన్ని చుట్టరికాలున్నాయి కాని ఇవి చాలు.

పూర్వకవులు ఎవరన్నా ఈ‌ హేమరూపవృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

కరాళి / కేతుమాల

కరాళి.
జయ దీనజనావనా
జయ సత్యపరాక్రమా
జయ నిత్యయశోధనా
జయ రామ జనార్దనా

ఈ‌ కరాళీవృత్తానికి కేతుమాల అని కూడా పేరుంది. దీని పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం IIUIIUIU. గణవిభజన స-స-వ అని.

ఈ కరాళీ వృత్తం చుట్టాలను పలకరిద్దాం. ఒక యాభై వృత్తాలున్నాయి బంధుగణం! దీని పాదం ముందొక లఘువును చేర్చితే అది కరశయావృత్తమూ‌ అలా కాదని గురువును చేర్చితే అది మదనోధ్ధురా వృత్తం. దీని పాదం‌ ముందు వ-గం చేర్చితే అది జరా వృత్తమూ ఆ వ_గణం చివర ఉంచితే అది  సహజా వృత్తం. కరాళి పాదం చివర జ-గణం చేరితే అది జవనశాలిని, మ-గణం చేరితే అలితాగమనం, య-గణం చేరితే అది విమ.  ఈ‌కరాళి పాదం ముందు న-గణం చేరితే అది సమ్మదమాలిక, స-గణం చేరితే అది ఉపచిత్రం. ఇంకా బోలెడు చోట్ల ఈ‌కరాళీ సంతకం‌ కనిపిస్తుంది.

ఈ‌ వృత్తం‌ నడకను చూదాం. పాదంలో ఉన్నవి ఎనిమిది అక్షరాలు.  పాదం‌ మధ్యలో విరుపు కనిపిస్తోంది. ఉత్తరార్ధంలో ఆరు మాత్రలున్నాయి. పుర్వార్ధంలో ఐదే కాని కొంచెం సాగదీసి ఆరుగా పలకవచ్చును. జయ దీ..న అన్నట్లుగా. అప్పుడు మరింత కర్ణపేయంగా ఉంటుంది.

జయ దీన - జనావనా
జయ సత్య - పరాక్రమా
జయ నిత్య - యశోధనా
జయ రామ - జనార్దనా

వాంతభార

వాంతభార.
జయము భూపాలకేంద్రా
జయము కారుణ్యసాంద్రా
జయము త్రైలోక్యవంద్యా
జయము శ్రీరామచంద్రా

వాంతభార.
అభయదం రామనామం
విభవదం రామనామం
శుభకరం రామనామం
ఉభయదం రామనామం


ఈ‌వాంతభార వృత్తంలో పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం IIIUUIUU. అంటే గణవిభజన న-త-గగ అని. ప్రాసనియమం పాటించాలి.

ఈ వాంంతభారకు చుట్టాలను చూదాం. దీని పాదం చివర వ-గణం చేరితే అది చరపదం. ఆ చరపదం పాదం ముందు న-గణం చేరితే అది చంద్రిక. గగ-గణం చేరితే అది నిర్మేధ. పాదం ముందు న-గణం చేరితే అది పరిమళలలితం. పాదం ముందు లఘువునూ చివర గురువునూ చేర్చితే అది సురాక్షి. ఆ సురాక్షికి పాదం చివర మరొక గురువును చేర్చితే అది వికసితపద్మావళి. ఇవి కాక మరొక ఇరవై దాకా చుట్టాలున్నాయి.


ఈ వాంతభారను పూర్వకవులు ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.

ఈ వాంతభార నడకను చూదాం. పద్యపాదంలో  ఉన్న వి ఎనిమిది అక్షరాలే. నడిమికి విరుపు కనిపిస్తోంది. ఐతే చివరి అక్షరం ముందు మరొక విరుపూ నడకలో వస్తోంది. ఇలా రావటం ద్వారా పాదం మూడుఖండాలైనది. మొదటి రెండు ఖండాలలోనూ ఐదేసి మాత్రలున్నాయి. చివరి గురువును మనక్కావలసింత లాగి ఐదు మాత్రలుగా ఉఛ్ఛరించా వచ్చును.

జయము భూ - పాలకేం - ద్రా
జయము కా - రుణ్యసాం - ద్రా
జయము త్రై - లోక్యవం - ద్యా
జయము శ్రీ - రామచం - ద్రా

అభయదం - రామనా - మం
విభవదం - రామనా - మం
శుభకరం - రామనా - మం
ఉభయదం - రామనా - మం


16, ఆగస్టు 2020, ఆదివారం

రథోధ్ధతము

రథోధ్ధతము.
పంతగించి కలి బాధపెట్టినన్
చింతయన్న దెటు చెంత జేరు నా
యంతరంగవిభు డైన రాముడే
సంతతంబు సుఖశాంతులీయగన్


ఈ రథోధ్ధత వృత్తానికి పాదానికి 11 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIUIU. అంటే గణవిభజన  ర-న-ర-వ యతిమైత్రి స్థానం 7వ అక్షరం. ప్రాసనియమం పాటించాలి.

ఈ‌రధోధ్ధత వృత్తపాదానికి ముందొక గురువును చేర్చితే అది లలితావృత్తం అవుతుంది. ఆ గురువు బదులు రెండు లఘువులను ఉంచితే అది మంజుభాషిణీవృత్తం. ఏకంగా నాలుగు గురువులను ఉంచితే అది ప్రభద్రకం. ఈ ప్రభద్రకం పాదం చివర ఒక గురువును ఉంచితే అది వాణినీ వృత్తం, ర-గణం ఉంచితే అది నందనం అనే వృత్తం.  రథోధ్ధత పాదం‌ ముందు హ-గణం ఉంచితే అది మంజుమాలతి.

విశ్వనాథవారి రామయణకల్పవృక్షం బాలకాండ ఇష్టిఖండము నుండి

    ఱేని సంతస మెఱింగి సూతుఁడున్
    దోన వాజులను దూఁకజేయఁగన్
    బూనికన్ ఖదను పోవఁగా రథా
    స్థాని రాజు మెయిసాగ నూగుచున్ 

ఆధునికులు శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆథ్యాత్మ రామాయణం నుండి ఒక రథోధ్ధతం.

     వారిజాతహితవంశవర్థనా
     వారిజాక్ష శ్రితపారిజాతమా
     వారిజాతభవవందితా నమ
     స్కారమో వరద సద్గుణాకరా

ఈ రథోధ్ధత వృత్తం‌ నడక గురించి ఆలోచిద్దాం. ఈ వృత్తం పాదంలో గురులఘుక్రమం UIUIIIUIUIU అంటే మొత్తం‌16 మాత్రలున్నాయి. పాదం అర్ధభాగంలో అంటే మొదటి అరు అక్షరాలలో 8 మాత్రలూ, ద్వితీయార్ధంలో  8 మాత్రలూ ఉన్నాయి.

ఒక విధంగా చూస్తే, ఈ‌ భాగాలు రెండూ‌ కూడా 3 + 5 మాత్రల ఖండాలుగా విరుగుతాయి. యతిమైత్రి స్థానం చక్కగా రెండవ భాగం మొదటి అక్షరం‌పైన పడింది.

ఱేని - సంతస మె - ఱింగి - సూతుఁడున్
దోన - వాజులను - దూఁక - జేయఁగన్
బూని - కన్ ఖదను - పోవఁ - గా రథా
స్థాని - రాజు మెయి - సాగ -నూగుచున్

మరొక విధంగా చూస్తే పూర్వార్థంలో హ-హ-లల  ఐతే ఉత్తరార్థంలో హ-హ-గ కదా కాబట్టి ఇలా చదువ వచ్చును.
ఱేని  సంత - స మె - ఱింగి - సూతుఁ - డున్
దోన వాజు  - లను - దూఁక - జేయఁ - గన్
బూని కన్ ఖ  - దను - పోవఁ - గా ర - థా
స్థాని  రాజు - మెయి - సాగ -నూగు - చున్

ఈ విధంగా ఉదాహరణకు ఇచ్చిన పద్యం
పంత గించి - కలి  - బాధ పెట్టి  -నన్
చింత యన్న - దెటు  - చెంత జేరు - నా
యంత రంగ - విభు  - డైన రాము  - డే
సంత తంబు - సుఖ  - శాంతు లీయ - గన్

భ్రమరవిలసితము

భ్రమరవిలసితము
ఏమయ్యా యెప్పు డినకులపతీ
నామోక్షం బన్న నగుదు విటులన్
రామా నీవాడ రయము నను నా
స్వామీ కాపాడ వలయును గదా


ఈ భ్రమరవిలసిత వృత్తానికి పాదంలో 11 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUUIIIIIIU. అంటే గణవిభజన   మ-భ-న-వ అని. యతిమైత్రి స్థానం 6వ స్థానం. ఐతే ఇక్కడ ఆ యతిమైత్రి స్థానం ఒక గణం చివరి అక్షరం అవుతున్న దని గమనించాలి మనం. విరామస్థానం అలా ఉంది కదా అని అలా క్తమం విడదిస్తే  UUU UI - III IIU అని పరికించవచ్చును. ఎందుకనో నాకు ఆరవ అక్షరం యతిమైత్రి స్థానంగా తగదేమో అనిపిస్తున్నది. ఆలోచించాలి.

ఈ‌ భ్రమరవిలసిత వృత్తపాదం చివర మరి రెండు గురువులను చేర్చితే అది ప్రజ్ఞామూలం అవుతుంది. రెండు బదులు మూడు గురువులను అంటే మ-గణం ఉంచితే అది చూడాపీడం అవుతుంది. ఆ ప్రజ్ఞామూలం పాదం ముందొక గురువును ఉంచితే అది అసంబాధ అవుతుంది. భ్రమరవిలసిత చివర రెండు ర-గణాలను ఉంచితే అది హరిణీవృత్తం అవుతుంది. ఆ హరిణికి మరొక గురువునూ చివర చేర్చితే అది చంద్రలేఖ అవుతుంది. మరి కొద్ది వృత్తాల్లో కూడా ఈ‌ భ్రరమరవిలసిత సంతకం కనిపిస్తుంది.

ఈ‌ భ్రమరవిలసితం నడక చతురస్రగతిలో ఉంటుంది. అద్యంతాల లోని గురువులను ఒక్కొక్క కాలఖంండగా చూడాలి. మధ్యభాగం సులువుగానే చతుర్మాత్రా ప్రమాణంగా విడిపోతుంది. కానీ‌ ఇలా చేస్తే 6వ అక్షరం యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరదు. అలా చూస్తే న్యాయంగా 8వ అక్షరం యతిమైత్రి స్థానంగా ఉండాలి.  

ఏ - మయ్యా - యెప్పు డి - నకులప - తీ
నా - మోక్షం - బన్న న - గుదు విటు - లన్
రా  - మా నీ - వాడ ర - యము నను - నా
స్వా - మీ కా - పాడ వ - లయును గ - దా


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండము లోని  భమరవిలసిత పద్యం.

మాకందోద్యత్సుమమధుఝురిణీ
సేకంబై త్రావి సివము లెసగన్
సాకూతం బొప్ప సరససరఘా
నీకంబుల్ ఝుమ్మని రొద లురలెన్

ఈ‌ పద్యాన్ని ఎలా చదవాలీ, పై విధంగా కుదురుతుందా అంటే, భేషుగ్గా కుదురుతుంది చూడండి.

మా - కందో -ద్యత్సుమ - మధుఝురి - ణీ
సే - కంబై - త్రావి సి - వము లెస - గన్
సా - కూతం - బొప్ప స - రససర - ఘా
నీ - కంబుల్ -ఝుమ్మని -రొద లుర - లెన్

ఈ‌భ్రమరవిలసితం లయను చతుర్మాత్రాత్మికంగా మరొక విధంగా కూడా చూడ వచ్చును. దీని గురులఘుక్రమం UUUUIIIIIIU. దీన్ని UUUUIIIIIIU అని విడదీయ వచ్చును.UU - UU - IIII - IIU అని ఇలా చతుర్మాత్రల క్రమం వస్తుంది. ఉదాహరణ పద్యాన్ని ఇలా చూడవచ్చును. కానీ‌ ఇలా చేసినా యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరక పోవటం అటుంచి సరైన లయ కనిపించటం లేదు.

ఏమ - య్యా యె - ప్పు డినకు - లపతీ
నామో - క్షం బ - న్న నగుదు - విటులన్
రామా - నీవా - డ రయము - నను నా
స్వామీ - కాపా - డ వలయు - ను గదా

భ్రమరవిలసితానికి గౌరీభట్ల బాలముకుందశర్మగారి పద్యం

గౌరీపుత్రాక్ష గజవదన సాం
బారుద్ధ్యుద్ధే నవ గుణ భసిత
ప్రారంభే పూజ్య లవకరుణయా
ధీరాధానంత్వతిశయ జయ భో

 

ఉపయుక్త విషయములు

గౌరీభట్ల బాలముకుందశర్మ గారి  శతఛందస్సుతో గణపతి శతకము అని ఒక లఘు కృతి ఉంది. పేరుసూచిస్తున్నట్ళే వంద పద్యాలూ వంద బిన్నమైన ఛందస్సుల్లో చెప్పబడ్డాయి.

15, ఆగస్టు 2020, శనివారం

హంసరుతము.

హంసరుతము.
శ్రీరామా యనుచు వేడన్
కారుణ్యం‌ బెసగ వాడే
ధారాళంబుగను కోర్కుల్
ధారాపాతముగ నీడా



ఈ‌హంసరుత వృత్తం పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUIIIUU. అంటే గణవిభజన  మ-న-గగ. ప్రాసనియమం పాటించాలి.

ఈ హంసరుతం పాదానికి చివర మరొక గురువును చేర్చితే అది అయనపతాక అవుతుంది. పాదం చివర మ-గణం చేరిస్తే అది భూరిఘటకం అవుతుంది. ఆ భూరిఘటకానికి ముందు మరొక రెండు గురువులను తగిలిస్తే అది ఉల్కాభాసం అవుతుంది. 


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండములోని

హంసరుతము.
శ్రీ సంపాదితములై య
భ్యాసం బొప్పఁగ సరోజా
వాసంబై మధురవంబై
కూసెన్ మత్తకలహంసల్


ఈ హంసరుతం‌ నడకను చూస్తే ఇది మ-న-గగ అని ప్రతి గణం దగ్గరా విరుపుతో‌ కనిపిస్తోంది.


శ్రీరామా - యనుచు - వేడన్
కారుణ్యం - బెసగ - వాడే
ధారాళం - బుగను - కోర్కుల్
ధారాపా - తముగ - నీడా


మాణవకము

మాణవకము.
లోకము లేలేవు గదా
శ్రీకర రామా కృపతో
నీ‌కృపయే లేనపు డీ
లోకములే లేవు గదా


మాణవకము.
రామ సదా ప్రేమమయా
కామిత వాంఛాఫలదా
భూమిని నీభక్తులకే
బాములు లేకుండు గదా


ఈ‌మాణవక వృత్తానికి గురులఘు క్రమం UIIUUIIU. అంటే గణవిభజన భ - త - లగ. అంటే పాదానికి కేవలం 8 అక్షరాలన్నమాట. అందుచేత యతిస్థానం ఏమీ‌లేదు. ప్రాసనియమం ఉంది వృత్తం‌ కావట్టి. దీని గురులఘుక్రమాన్ని మనం UIIU - UIIU అని కూడా అనుకోవచ్చును. ఈ విధానం‌గా విడదీసి చూడటం దీని నడకకు అనుగుణమైన విభజన అవునా అన్నది ఆలోచనీయం. కాని వృత్తపాదంలో మొదటి సగమూ తదుపరి సగమూ ఒకే గురులఘుక్రమంతో ఉన్నవన్నది మాత్రం స్పష్టం అవుతున్నది కదా. త్రికగణాలతో‌ అన్నింటికీ ఒకే కొలబద్దతో లక్షణాలు వ్రాసుకోవటం వలన ఇలాంటి చిన్న పెద్దా విషయాలు మరుగున పడిపోతున్నాయి.

మాణవకవృత్త పాదానికి అదనంగా ఒక గురువును చివర ఉంచితే అది శంబరధారీవృత్తం అవుతుంది. పాదం‌ మొదట ఒక స-గణం చేర్చితే హరికాంతావృత్తమూ, భ-గణం చేర్చితే కలస్వనవంశవృత్తమూ అవుతాయి. ఆ హరికాంత చివర మరొక గురువును చేర్చితే అది కరమాల. ఆ కలస్వనవంశకు ముందు మరొక భ-గణాన్ని చేర్చితే అది  కర్ణిశర వృత్తం. ఇంకా మరొక ఇరవై చిల్లర వృత్తాలో ఈ‌మాణవకం సంతకం కనిపిస్తుంది.

ఈ వృత్తానికి తెలుగులో పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

ఈ‌ మాణవకం‌ నడకను చూదాం. ఈ వృత్తంలో పాదానికి ఉన్నది పన్నెండు మాత్రలు. పాదం సమద్విఖండనగా విరుపుతో‌ నడుస్తుంది. ఐతే ఒక్కో ఖండంలోనూ ఆరేసి మాత్రలున్నా, అవి ఎనిమిదేసి మాత్రలుగ నడుస్తాయి! అంటే చతురస్ర గతి అన్నమాట. అదెలా అంటే పాదం అర్ధభాగాల చివర ఉన్న గురువును నాలుగు మాత్రలుగా పలకవలసి ఉంటుంది.

రామ స - దా - ప్రేమమ - యా
కామిత -వాం - ఛాఫల - దా
భూమిని - నీ - భక్తుల - కే
బాములు -లే - కుండు గ - దా


శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి కవి గారి మాణవక వృత్తం చూడండి.

    మా యని శ్రీ యే నయమా
    మా యన లక్ష్మీశు యమా
    యా యశు శిక్షా శయమా
    మా యశ మౌగా నియమా

ఇదొక చిత్రకవిత్వ విన్యాసం కాబట్టి పద్యం మరీ సుభగంగా ఉండకపోవటంలో వింత లేదు. ఈ పద్యమే కొద్ది మార్పుతో‌ మరొక చోట కూడా కనిపిస్తోంది.

విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము. (Download)

 విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము మనకు అంతర్జాలంలో లభిస్తోంది. ఇక్కడ డౌన్‌లోడ్ సూచికలు ఇస్తున్నాను.


  1. బాల కాండము
  2. అయోధ్యా కాండము 
  3. అరణ్య కాండము
  4. కిష్కింధ కాండము
  5. సుందర కాండము
  6. యుధ్ధ కాండము

ఈ‌పై పుస్తకాల్లో అరణ్య కాండము సుందర కాండము తి.తి.దే వారి సైట్‌లోనూ మిగిలిన నాలుగు కాండములూ అర్కీవ్ సైట్‌లోనూ‌ లభిస్తున్నాయి.

అసక్తి కలవారు తప్పక దిగుమతి చేసుకోండి. అంతర్జాలంలో ఈనాడు లభిస్తున్నా అవి రేపోమాపో అక్కడ ఉండకపోవచ్చును. కాబట్టి బధ్ధకిస్తే మనకే ఇబ్బంది మరి.

ప్రమాణిక

ప్రమాణిక.
ధరాసుతామనోహరా
ధరాతలాధినాథుడా
సురారిలోక కాలుడా
బిరాన రామ బ్రోవరా

ప్రమాణిక.
ధరాత్మజామనోహరా
మొరాలకింప వేమిరా
పరాకు మాని ప్రోవరా
తరింపజేయరా ప్రభూ


ఈ ప్రమాణిక వృత్తంలో‌ పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  IUIUIUIU. అంటే గణవిభజన  జ-ర-లగ . యతి మైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. ఈ వృత్తాన్ని ప్రమాణి అని కూడా అంటారు.

రెండు ప్రమాణిక పాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది. ఆ పంచచామరాన్నే‌ నరాచ అనీ అంటారు. అదనంగా పాదం ముందొక లఘువును ఉంచితే అది భుజంగసంగత వృత్తం అవుతుంది, రెండు లఘువులను ఉంచితే అది  మనోరమా వృత్తం అవుతుంది. ఎడాపెడా చెరొక గురువునూ తగిలిస్తే అది మయూరసారిణీ వృత్తం అవుతుంది. పాదం చివర ఒక వ-గణం కలిపితే అది సరావికా వృత్తం అవుతుంది, రెండు వ-గణాలు కలిపితే లలామలలితాధరా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అమోఘమాలికావృత్తం అవుతుంది. పాదం చివర జ-ర గణాలు కలిపితే కుండలికావృత్తం అవుతుంది. ఇంకా ముఫ్ఫై చిల్లర వృత్తాల్లోనూ ఈ‌ప్రామాణిక గురులఘుక్రమం కనిపిస్తుంది.

జగత్ప్రసిధ్ధమైన  గణేశ పంచరత్న స్తోత్రం ఈ‌ పంచచామర వృత్తాల్లోనే ఉంది. ఒక సారి  ఇక్కడ చదువుకోండి. ఉదాహరణకు ఒక శ్లోకం.

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామితం వినాయకం

నడక చూస్తే ఈ‌ప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - హ - ర అన్నట్లుగా ఉంటుంది.  ఎదురు నడకతో‌ ప్రారంభం కావటమే ఈ‌ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.

ధరాసుతా - మనోహరా
ధరాతలా - ధినాథుడా
సురారి - లోక -కాలుడా
బిరాన - రామ - బ్రోవరా
 

తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు. అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది. గబ్బిట దుర్గా ప్రసాద్ గారి సరసభారతి బ్లాగులో ఆ ఆధ్యాత్మిక సర్వోపచార పూజను చదువుకొన వచ్చును.

ఇంకొకటి గుండు మధుసూదన్ గారి గణేశస్తుతి శ్లోకం చూడండి.

గజాననా! ఘనాకృతీ!
ప్రజావళీ ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్

ఈ‌ప్రమాణి వృత్తం నడక మహా రమణీయంగా ఉంటుంది. మీరూ‌ ప్రయత్నించండి.

లసదసు / మహి / కమల / వసన

లసదసు.
మన యెడల రాముడే
తన కృపను జూపగా
మన కభయ మీయగా
మన కిక జయంబులే


ఈ‌ లసదసు వృత్తానికి మహి, కమల, వసన అన్న పేర్లు కూడా ఉన్నాయి. దీని గురులఘుక్రమం  IIIIIUIU. అంటే గణవిభజన న-స-లగ.

ఈ‌ లసదసు బంధుగణాన్ని చూదాం. ఈ  వృత్తపాదం చివర మరొక గురువును చేర్చితే అది బింబ వృత్తం అవుతుంది. పాదం చివర ల-గ చేర్చితే అనుచాయిక, య-గణం చేర్చితే‌ పంచశాఖి, ర-గణం చేర్చితే ప్రసృమరకర అవుతుంది. ఇంకా మరొక నలభైపైన వృత్తాల్లో ఈ లసదసు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ లసదసు యొక్క నడకను చూదాం. ఈ‌వృత్తంలో మొత్తం పది మాత్రలున్నాయి. ఉన్న రెండు గురువులూ‌ పాదం చివరకు సద్దుకున్నాయి. కాబట్టి ఐదేసి మాత్రలు ఒక ఖండంగా నడక కనవస్తోంది.

మన యెడల - రాముడే
తన కృపను - జూపగా
మన కభయ - మీయగా
మన కిక జ - యంబులే

తుంగ

తుంగ.
పరమ సఖుడ రామా
పరమ హితుడ రామా
నిరుపముడవు నిన్నే
యరసి కొనెద నాలో

తుంగ.
హరి మన సఖుడైతే
హరి మన గురుడైతే
హరి మన హితుడైతే
మరి యిక సుఖమేగా


ఈ తుంగ అనే వృత్తానికి గురులఘుక్రమం IIIIIIUU. అంటే న-న-గగ అనేది గణవిభజన అన్నమాట. ప్రాసనియమం‌ పాటించాలి. యతిమైత్రి అవసరం లేదు.

ఈ తుంగకు బంధుగణాన్ని చూదాం. పాదం చివర ఒక గురువును చేర్చితే అది భుజగశిశుభృతం అవుతుంది. పాదం ముందు రెండు లఘువులను చేర్చితే అనిమావృత్తం అవుతుంది, రెండు గురువులను చేర్చితే ఉన్నాలం అవుతుంది, గ-ల చేర్చితే  ఉపధాయా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అది కలితకమలవిలాసం అవుతుంది, స-గణం చేర్చితే మదనయావృత్తం అవుతుంది, య-గణం చేర్చితే పరిమళలలితం అవుతుంది. పాదం చివరన కాక పాదం ముందు మ-గణం చేర్చితే అది మాత్రావృత్తం, స-గణం చేర్చితే సువృత్తి అవుతుంది. ఇవే కాక ఇంకా చాలా వృత్తాల్లో ఈ తుంగ తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ పద్యం నడక ఇలా ఉంది త్రిస్రగతిలో. ఇక్కడ చివర గురువులు రెండూ ఒక్కోటీ మూడేసి మాత్రలుగా పలుకుతున్నాయి.

పరమ - సఖుడ - రా - మా
పరమ - హితుడ - రా - మా
నిరుప - ముడవు - ని - న్నే
యరసి - కొనెద - నా - లో

వేరే విధంగా కూడా నడక ఉండవచ్చును. అదీ చూదాం. ఇక్కడ చతురస్ర గతిలో‌ పద్యం నడిచింది. చివరి గురువు మాత్రం అవసరార్ధం లాగి పలకాలి.

హరి మన - సఖుడై - తే
హరి మన - గురుడై -తే
హరి మన - హితుడై - తే
మరి - యిక - సుఖమే - గా

జెజ్జాల కృష్ణ మోహన రావు గారి పద్యం ఒకటి కనిపిస్తోంది ఇలా.

మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే


హరిపదము

హరిపదము.
పరమసుఖద మహో
హరినిగొలుచుటయే
నరుల కిదియె సదా
చరణమగును కదా

హరిపదము.
హరికథలు వినరే
హరికి జయ మనరే
హరికి మనసిడుటే
పరమసుఖ మనరే



ఈ హరిపదవృత్తంలో పాదానికి 8 అక్షరాలుంటాయి.  గురులఘుక్రమం IIIIIIIU. అంటే గణవిభజన  న-న-లగ అన్నమాట.  ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి స్థానం అవసరం లేదు.

ఈ‌ హరిపదం‌ పాదం‌ ముందొక మరో లఘువును చేర్చుదాం‌ అంటే అది మదనకం అవుతుంది. రెండు లఘువులను చేర్చితే అది మకరముఖి అవుతుంది. ఏకంగా మూడు లఘువులను చేర్చితే అది దమనకవృత్తం అవుతుంది. బాబో ఇంకా లఘువు లెందుకు లెండి అంటారా, హరిపదం  పదారంభంలో ఒక గురువును చేర్చితే అది ధౌనికం అనే వృత్తం అవుతుంది.  ఒకటి చాలదంటారా, ఎడాపెడా చెరొక గురువునూ చేర్చితే అది ఉపధాయా వృత్తం అవుతుంది. హరిపదం పాదంలో గురువును ర-గణం చేస్తే అది చితిభృత వృత్తం అవుతుంది. ఆ గురువును అలాగే ఉంచి మరొక ర-గణం చేర్చితే అది గల్లకవృత్తం అవుతుంది. ఇంకా చాలానే వృత్తాల్లో ఈ హరిపదం తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ హరిపదం నడకను పరిశీలిద్దాం. పాదానికి తొమ్మిది మాత్రలున్నాయి. మూడేసి మాత్రలుగా నడప వచ్చును.

పరమ - సుఖద - మహో
హరిని - గొలుచు - టయే
నరుల - కిదియె - సదా
చరణ - మగును - కదా

కాని మూడేసి మాత్రలుగా కాక ఇతరత్రా కూడా నడక రావచ్చును. హరిపదానికి మరొక మాత్రను చివరన జత  కలిస్తే పది  మాత్రలు అవుతాయి. ఈ‌పది మాత్రలూ ఐదేసి మాత్రల కాలఖండాలుగా రెండుగా విరగి ఈ‌పద్యం నడుస్తుంది. కాని పరిశీలించగా ఒక్కోటి ఆరు మాత్రల కాలఖండాలుగా నడుస్తున్నది! రెండవభాగానికి ఒకటికి బదులు రెండు మాత్రలు కలుస్తున్నాయి నడకలో!

హరికథలూ - వినరే
హరికి జయా - మనరే
హరికి మనా - సిడుటే
పరమసుఖా- మనరే

ఈ‌వృత్తాన్ని నడపటంలో‌ ఉన్న చిక్కల్లా వరసగా ఏడు లఘువులు వేయవలసి రావటమే కాదు మనకు కావలసిన పదాలు ఇందులో‌ ఇమడకపోవచ్చును. అన్నీ‌ దాదాపుగా లఘువులే‌ కదా. మాటవరసకి ఇక్కడ నేరుగా రామా అందా మంటే, వరసగా రెండు గురువులు వేసే అవకాశం లేదు. పోనీ‌ రామ అందా మంటే  మాటను రెండు పాదాలమధ్యన విరచి వ్రాయవలసి ఉంటుంది. పాదోల్లంఘనం‌ చేయకుండా అది వీలు కాదు. చిన్నచిన్న పద్యాల్లో పాదోల్లంఘనం అంత బాగుండదు.

శ్రద్ధరా / సమానిక

శ్రద్ధరా
రామ నీదు భక్తుడరా
స్వామి నీకె మ్రొక్కుదురా
ప్రేమ మీఱ బ్రోవవయా
కామితార్ధ మీయవయా
 

 

ఈ శ్రధ్ధరా వృత్తానికి సమానిక అని మరొక పేరు. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం UIUIUIIU. గణవిభజన ర-జ-లగ అని. పాదంలో మొత్తం 12 మాత్రలుంటాయి.

ఈ శ్రధ్ధరావృత్త పాదం ముందు రెండు లఘువులు చేర్చితే అది ప్రవాదపదవృత్తం అవుతుంది. అలాకాక పాదం చివర లగ చేర్చిటే అది వర్మితా వృత్తం అవుతుంది. ఆశ్చర్య మేమిటంటే ఇంత చిన్న గురులఘుక్రమం కేవలం ఆ రెండూ కాక ప్రపాతలికా, భస్త్రావిస్తరణం, విలాసవాసం, విరామవాటికా అనే మరొక నాలుగు వృత్తాల్లో‌ మాత్రమే‌ కనిపిస్తున్నది!

ఈ శ్రధ్దరా వృత్తం‌ నడక ప్రకారం చూస్తే UI - UI - UI - IU అన్నట్లు మూడేసి మాత్రల గణాలుగా విరుపుతో కనిపిస్తుంది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం నడక ఇలా త్రిస్రగతితో కనిపిస్తోంది.

రామ - నీదు - భక్తు - డరా
స్వామి - నీకె - మ్రొక్కు - దురా
ప్రేమ - మీఱ - బ్రోవ - వయా
కామి - తార్ధ - మీయ - వయా

చిన్నచిన్న పద్యాలను వ్రాసే టప్పుడు వీలైన విధంగా అంత్యప్రాసలను కూడా ప్రయోగిస్తే అవి మరింతగా అందగిస్తాయి.

ఈ శ్రధ్దరా పద్యం వ్రాయటం చాలా సులువు. ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.

13, ఆగస్టు 2020, గురువారం

అనుష్టుప్ ఛందస్సులో వృత్తాలు

అనుష్టుప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 28 = 256 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 128 మాత్రమే. వీటిలో కొద్ది వృత్తాలనే లక్షణకారులు చెప్పారు.
  1. IIIIIIIU : హరిపదమ్
  2. IIIIIIUU : తుఙ్గా
  3. IIIIIUIU : లసదసు
  4. IIIIIUUU : రుద్రాలీ
  5. IIIIUIIU : అఖనిః
  6. IIIIUUUU : పాఞ్చాలాఙ్ఘ్రిః
  7. IIIUIIIU : గజగతిః
  8. IIIUIIUU : వృతుముఖీ
  9. IIIUIUIU : ఉపలినీ
  10. IIIUIUUU : కురరికా
  11. IIIUUIIU : మాణ్డవకమ్
  12. IIIUUIUU : వాంతభారః
  13. IIIUUUUU : గోపావేదీ
  14. IIUIIUIU : కరాలీ
  15. IIUIIUUU : పఞ్చశిఖా
  16. IIUIUIUU : దిగీశః
  17. IIUIUUUU : యుగధారి
  18. IIUUIIUU : అతిమోహా
  19. IIUUIUIU : శల్లకప్లుతమ్
  20. IIUUIUUU : పరిధారా
  21. IIUUUIIU : సరఘా
  22. IIUUUIUU : కౌచమారః
  23. IUIIIUUU : భార్ఙ్గీ
  24. IUIIUIIU : అరాలి
  25. IUIIUUUU : విరాజికరా
  26. IUIUIIUU : చతురీహా
  27. IUIUIUIU : ప్రమాణికా
  28. IUIUIUUU : యశస్కరీ
  29. IUIUUIUU : వారిశాలా విమాన
  30. IUIUUUUU: వితాన
  31. IUUIIUUU : మనోలా
  32. IUUIUUIU : విహావా
  33. IUUIUUUU : భూమధారీ
  34. IUUUIUUU : కులాధారీ
  35. IUUUUIUU : పారాంతచారీ
  36. IUUUUUUU : అనిర్భారః
  37. UIIIIIIU : అరి
  38. UIIIUIUU : కృష్ణగతికా
  39. UIIIUUUU : వాత్యా
  40. UIIUIIUU : చిత్రపదా
  41. UIIUUIIU : మాణవకమ్
  42. UIIUUUUU : ఇంద్రఫలా
  43. UIUIUIIU : శ్రద్ధరా సమానిక
  44. UIUIUIUU : సింహలేఖా సింహరేఖ
  45. UIUIUUUU : మౌలిమాలికా
  46. UIUUIIIU : కురుచరీ
  47. UIUUIUIU : హేమరూపమ్
  48. UUIIIIIU : ఈడా
  49. UUIIIIUU : సంధ్యా
  50. UUIIUIIU : విద్యా
  51. UUIIUIUU : సారావనదా
  52. UUIUIUIU : నారాచికా
  53. UUUIIIIU : శిఖిలిఖితా
  54. UUUIIIUU : హంసరుతమ్
  55. UUUIUIIU : హఠినీ
  56. UUUUIIUU : ప్రతిసీరా
  57. UUUUUUUU : విద్యున్మాలా
మనం వీటిని పరిశీలిద్దాం.

మధ్యా ఛందస్సులో వృత్తాలు

 మధ్యా ఛందస్సులో పాదానికి 3 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 23 = 8 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 4 మాత్రమే.

  1. IIU స: రమణ వినయము
  2. IUU య: బలకా
  3. UIU ర: మృగీ
  4. UUU మ:నారీ


మనం ఈ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

ప్రతిష్ఠా ఛందస్సులో వృత్తాలు

ప్రతిష్ఠా ఛందస్సులో పాదానికి 4 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 24 = 16 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 8 మాత్రమే.

  1. IIIU న-గ: సతీ
  2. IIUU స-గ: డోలా
  3. IUIU జ-గ: కళా సుకాంతి 
  4. IUUU య-గ: క్రీడా వ్రీళ 
  5. UIIU భ-గ: వలా బింబ 
  6. UIUU ర-గ: నంద 
  7. UUIU త-గ: ధరా
  8. UUUU మ-గ: కన్యా


మనం ఈ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

సుప్రతిష్ఠా ఛందస్సులో వృత్తాలు

 సుప్రతిష్ఠా ఛందస్సులో పాదానికి 5 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 25 = 32 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 16 మాత్రమే.

  1. IIIIU న-లగ: సులూ
  2. IIIUU న-గగ: కలలి
  3. IIUIU స-లగ: ప్రియా
  4. IIUUU స-గగ: ప్రగుణం
  5. IUIIU జ-లగ: శిలా
  6. IUIUU జ-గగ: కంఠీ
  7. IUUIU య-లగ: నరీ
  8. IUUUU య-గగ: నాళీ
  9. UIIIU భ-లగ: మండలం
  10. UIIUU భ-గగ: పంక్తి
  11. UIUIU ర-లగ: వినసం
  12. UIUUU ర-గగ: సూరిణి
  13. UUIIU త-లగ: కణిక
  14. UUIUU త-గగ: లోలం
  15. UUUIU మ-లగ: హాసిక
  16. UUUUU మ-గగ: ??


మనం ఈ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

గాయత్రీ ఛందస్సులో వృత్తాలు

గాయత్రీ ఛందస్సులో పాదానికి 6 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 26 = 64 వృత్తాలు ఏర్పడతాయి. కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 32 మాత్రమే.

  1. IIIIIU న-స: సరి
  2. IIIIUU న-య: శశివదన
  3. IIIUIU న-ర: నిరసిక
  4. IIIUUU న-మ: గుణవతి
  5. IIUIIU స-స: తిలక
  6. IIUIUU స-య: కమని
  7. IIUUIU స-ర: మృదుకీల
  8. IIUUUU స-మ: అభిఖ్య
  9. IUIIIU జ-స: కుహీ
  10. IUIIUU జ-య: అజరస్క
  11. IUIUIU జ-ర: వళీముఖి
  12. IUIUUU జ-మ: కంజ
  13. IUUIIU య-స: మశగ
  14. IUUIUU య-య: సోమరాజి
  15. IUUUIU య-ర: కఛ్ఛపి
  16. IUUUUU య-మ: పంథా
  17. UIIIIU భ-స: సౌరభి
  18. UIIIUU భ-య: ఈతి
  19. UIIUIU భ-ర: శునకం
  20. UIIUUU భ-మ: సింధురయ
  21. UIUIIU ర-స: కర్మద
  22. UIUIUU ర-య: పికాళి
  23. UIUUIU ర-ర: విజోహ
  24. UIUUUU ర-మ: కరేణు
  25. UUIIIU త-స: వసుమతి
  26. UUIIUU త-య: తనుమధ్య
  27. UUIUIU త-ర: స్థాలి
  28. UUIUUU త-మ: వభ్రూ
  29. UUUIIU మ-స: నిస్క
  30. UUUIUU మ-య: తంత్రి
  31. UUUUIU మ-ర: అవోఢ
  32. UUUUUU మ-మ: విద్యుల్లేఖ


మనం క్రమంగా ఈ‌ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

ఉష్ణిక్ ఛందస్సులో వృత్తాలు

ఉష్ణిక్ ఛందస్సులో పాదానికి 7 అక్షరాలు. కాబట్టి మొత్తం 27 = 128 వృత్తాలు యేర్పడతాయి. కాని తెలుగులో వృత్తం చివరి అక్షరం గురువు కావలసి ఉంది తప్పనిసరిగా. కాబట్టి  అలా గురువు చివర ఉండే 64 వృత్తాలే మనం పరిగణన లోనికి తీసుకుంటున్నాం.

  1. IIIIIIU న-న-గ: మధుమతి మదనవిలసిత సులభం
  2. IIIIIUU న-స-గ: ధృతి
  3. IIIIUIU న-జ-గ: పురటి
  4. IIIIUUU న-య-గ: సురి
  5. IIIUIIU న-భ-గ: స్వనకరి మధుమతి
  6. IIIUIUU న-ర-గ: ఖరకర
  7. IIIUUIU న-త-గ: పరభృతం
  8. IIIUUUU న-మ-గ: హోల
  9. IIUIIIU స-న-గ: యమనకం
  10. IIUIIUU స-స-గ: కరభిత్
  11. IIUIUIU స-జ-గ: కఠోద్గత
  12. IIUIUUU స-య-గ: రసధారి
  13. IIUUIIU స-భ-గ: అధికారీ
  14. IIUUIUU స-ర-గ: భూరిధామ హంసమాలి హంసమాల సరళ
  15. IIUUUIU స-త-గ: మాయావిని
  16. IIUUUUU స-మ-గ: శంబూక
  17. IUIIIIU జ-న-గ: స్విద కుమారవిలసిత కుమారలలిత
  18. IUIIIUU జ-స-గ: కుమారలలిత
  19. IUIIUIU జ-జ-గ: వహిర్వలి
  20. IUIIUUU జ-య-గ: ??
  21. IUIUIIU జ-భ-గ: మహోధిక
  22. IUIUIUU జ-ర-గ: పురోహిత
  23. IUIUUIU జ-త-గ: కుఠారిక
  24. IUIUUUU జ-మ-గ: పద్యా  /  సుమోహిత
  25. IUUIIIU య-న-గ: చిరరుచి
  26. IUUIIUU య-స-గ: మహనీయ
  27. IUUIUIU య-జ-గ: మహోధ్ధత
  28. IUUIUUU య-య-గ: అభీకం లోల
  29. IUUUIIU య-భ-గ: కేశవతి
  30. IUUUIUU య-ర-గ: వయస్య
  31. IUUUUIU య-త-గ: ఊపికం
  32. IUUUUUU య-మ-గ: ప్రహాణ
  33. UIIIIIU భ-న-గ: ఉలప
  34. UIIIIUU భ-స-గ: రుచిరం సురుచిర
  35. UIIIUIU భ-జ-గ: ఉందరి
  36. UIIIUUU భ-య-గ: కిణపా
  37. UIIUIIU భ-భ-గ: మౌరలికం
  38. UIIUIUU భ-ర-గ: హోడపద
  39. UIIUUIU భ-త-గ: కల్పముఖి
  40. UIIUUUU భ-మ-గ: అధీరా
  41. UIUIIIU ర-న-గ: బహులయా
  42. UIUIIUU ర-స-గ: శరగీతి
  43. UIUIUIU ర-జ-గ: చామరం  విభూతి సునామం
  44. UIUIUUU ర-య-గ: అహింసా
  45. UIUUIIU ర-భ-గ: సౌరకాంత
  46. UIUUIUU ర-ర-గ: హంసమాల
  47. UIUUUIU ర-త-గ: మృష్టపాద
  48. UIUUUUU ర-మ-గ: సిరవి
  49. UUIIIIU త-న-గ: హీరం
  50. UUIIIUU త-స-గ: స్థూల
  51. UUIIUIU త-జ-గ: పూర్ణ
  52. UUIIUUU త-య-గ: వేధా
  53. UUIUIIU త-భ-గ: నిర్వాధిక
  54. UUIUIUU త-ర-గ: భీమార్జనం
  55. UUIUUIU త-త-గ: రాజరాజీ
  56. UUIUUUU త-మ-గ: నిఘ్నాశయ
  57. UUUIIIU మ-న-గ: నవసర
  58. UUUIIUU మ-స-గ: మదలేఖ మదరేఖ
  59. UUUIUIU మ-జ-గ: మహోన్ముఖి
  60. UUUIUUU మ-య-గ: ఇభభ్రాంత
  61. UUUUIIU మ-భ-గ: వర్కరిత
  62. UUUUIUU మ-ర-గ: కిర్మీరం
  63. UUUUUIU మ-త-గ: హిందీరం
  64. UUUUUUU మ-మ-గ: శిప్ర

మనం ఈ‌ సందర్భంలో పైన ఇచ్చిన అన్ని వృత్తాలనూ పరిశీలించ బోతున్నాం.

అధికారి

అధికారి.
అతడే రాముడయా
అతడే కృష్ణుడయా
అతడే వెన్నుడయా
అతడే దేవుడయా


ఈ వృత్తంలో‌ పాదానికి 7 అక్షరాలే. గురులఘుక్రమం IIUUIIU. గణవిభజన స-భ-గ. ఈ అధికారీ వృత్తానికీ‌ హంసమాలికి చాలా దగ్గరి చుట్టరికం. హంసమాలిలో చివర UU వస్తే ఈ అధికారిలో చివరన IU అని వస్తుంది.

ఈ అధికారీవృత్తానికి హంసమాలి కాక వేరే చుట్టరికాలూ ఉన్నాయి. పాదం చివర ఒక గురువును చేర్చితే అతిమోహావృత్తం అవుతుంది. అ గురువునే పాదం ముందు చేర్చితే‌ మాణవకం అవుతుంది. పాదం ముందు లఘువును చేర్చితే మాండవకం అవుతుంది. పాదానికి ఎడాపెడా చెరొక గురువునీ తగిలిస్తే అది శంబరధారీవృత్తం అవుతుంది. పాదం చివర రెండు గురువులను కలిపితే అది కలహం అనే వృత్తం. పాదం‌ మొదట రెండు లఘువులను కలిపితే అది ముఖలా వృత్తం. పాదం‌ మొదట స-గణం చేర్చితే అది సురయానవతి. అలా కాక ఆ స-గణాన్ని పాదం చివర కలిపితే అది వారవతి. పొట్టి వృత్తం‌ కదా, దీని గురులఘుక్రమం ఇంకా చాలా వృత్తాల్లో కనిపిస్తుంది.

దీని నడకను చూస్తే చతురస్రగతిగా కనిపిస్తున్నది. ఉదాహరణ పద్యం నడక ప్రకారం విడదీస్తే ఇలా వస్తుంది.
 
అతడే - రాముడ - యా
అతడే - కృష్ణుడ - యా
అతడే  - వెన్నుడ - యా
అతడే  - దేవుడ - యా

ఈ అధికారీవృత్తానికి పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు. కాని చాలా అందమైన చిట్టి వృత్తం. తప్పక ప్రయత్నించండి.

హంసమాలి / హంసమాల / భూరిధామ / సరళ

హంసమాలి.
అతడే వెన్నుడయ్యా
యతడే రాముడయ్యా
అతడే కాక వేరే
గతియే లేదు సుమ్మీ

 

హంసమాలి అనేది మరొక చిన్నారి వృత్తం. దీనికి గణవిభజన స - ర - గ.  గురులఘుక్రమం IIUUIUU. అంటే పాదంలో 

ఉండేవి 7 అక్షరాలే అన్నమాట. కాబట్టి యతినియమం‌ లేదు. ప్రాసనియమం పాటించాలి.

ఈ వృత్తానికి హంసమాల, సరళ. భూరిధామ అని కూడ పేర్లున్నాయి.

హంసమాలికి ముందొక లఘువును చేర్చితే అది వాంతభారావృత్తం అవుతుంది. ముందొక లఘువుతో పాటు చివరన ఒక లగ చేర్చితే అది  చరపదవృత్తం అవుతుంది. హంసమాలి పాదానికి చివరన ఒక గురువును చేర్చితే పరిధారావృత్తం‌ అవుతుంది. చివరన మ-గణం చేరిస్తే అది నీరోహావృత్తం అవుతుంది. ఏకంగా నాలుగు గురువులు చేర్చితే అది అపయోధావృత్తం అవుతుంది.  ఆ నాలుగు గురువులనూ‌ పాదం మొదట్లో చేర్చితే అది వాతోర్మీ వృత్తం అవుతుంది. అబ్బో నాలుగు గురువులేమిటండీ బరువులూ‌ అంటారా, హంసమాలి పాదానికి ముందు పోనీ నాలుగు లఘువులనే  చేర్చండి పరిమళలలితం అనే వృత్తం అవుతుంది.

ఈ‌వృత్తం‌ నడకను చూస్తే మొదట నున్న స-గణం తరువాత విరుపు కనిపిస్తుంది. అలాగే చివరి గురువు ముందూ విరుపు కనిపించటంతో‌ పాటు అ గురువు మరింత దీర్ఘంగా వినిపిస్తుంది.

అతడే - వెన్నుడ - య్యా   
యతడే - రాముడ - య్యా   
అతడే - కాక వే - రే
గతియే - లేదు సు - మ్మీ

ఈ వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు యేమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

కుమారవిలసితం / స్విదా

కుమారవిలసితం.
పురాకృతమున నే     
నరుండ నయితి నా     
కరంబు గొనుమయా     
బిరాన రఘుపతీ



ఈ కుమారవిలసిత వృత్తం‌ పాదానికి 7 అక్షరాలు. గురులఘుక్రమం IUIIIIU. అంటే గణవిభజన జ-న-గ. యతిస్థానం లేదు. ప్రాసనియమం ఉంది.

ఈ కుమారవిలసితానికి స్విదా అని మరొక పేరుంది.

ఈ కుమారవిలసిత పాదానికి ముందు ఒక గ-ల చేర్చితే అది ప్రియతిలకావృత్తం అవుతుంది. పాదానికి ముందొక లఘువునూ, చివరన ఒక గురువునూ చేర్చితే అది సుగంధి అనే వృత్తం అవుతుంది. పాదానికి ముందు న-గణం చేర్చితే‌ అమృతగతి వృత్తమూ, స-గణం చేర్చితే ధమనికా వృత్తమూ‌ అవుతుంది. ఇంకా మరొక ముఫ్ఫైచిల్లర వృత్తాల్లోనూ‌ ఈ‌కుమారవిలసిత యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది.

నడకను చూస్తే ఇది గణాంతాలలో విరుపుతో వస్తున్నట్లుగా అన్నట్లు కనిపిస్తోంది.

పై పద్యం నడక ఈ క్రింది విధంగా ఉన్నది:

పురా - కృతమున - నే
నరుం - డనయితి - నా
కరం - బుగొనుమ - యా
బిరా - నరఘుప - తీ

ఇందులో ప్రాసస్థానంపైన ఉన్న గురువును రెండు మాత్రల కాలం కన్నా మూడు మాత్రలుగా ఉఛ్ఛరించటం బాగుంటుంది. అలా చేసినప్పుడు మొదటి రెండు అక్షరాలతో ఒక చతుర్మాత్రాగణం గానూ పిదప నాలుగక్షరాలూ మరొక చతుర్మాత్రాగణంగానూ ఏర్పడతాయి.  పాదాంతగగురువును కూడా మరొకరెండు మాత్రలుగా ఆ అక్షరాన్నే ఒక చతుర్మాత్రాగణంగా ఉఛ్ఛరించటం పధ్ధతిగా ఉంటుంది. చివరి గురువుముందు విరుపుతో పైపద్యం నడిచింది. అలాగే తొలిగురువు తరువాత కూడా ఒక విరుపు ఉన్నది.  ఇలా ఈ వృత్తం ఒక చతురస్రగతిలో చక్కగా నడుస్తుంది. చతురస్రగతికి ఏకతాళం వాడుక చేయటం జరుగుతూ ఉంటుంది.

వేరే విధంగా కూడా ఈ చిట్టివృత్తాన్ని నడిపించటం కుదురుతుందా అంటే 5 మాత్రలచొప్పున నడిపించ వచ్చును. చివర గురువును కొంచెం‌ మరొక మాత్రాకాలం సాగదీయా లంతే.

పురాకృత - మున నే
నరుండన - యితి నా
కరంబుగొ - నుమ యా
బిరానర - ఘుప తీ

ఇలా నడక వైవిద్యంతో ఉండవచ్చును.

ఈ కుమారవిలసితానికి పూర్వకవి ప్రయోగాలున్నాయేమో తెలియదు.

మృష్టపాద

మృష్టపాద.
చక్కగా రామయ్యకే
మ్రొక్కవేలా చిత్తమా
నిక్కువం బాయొక్కడే
దిక్కు సందేహించకే


 
ఈ మృష్టపాద వృత్తానికి గురులఘుక్రమం UIUUUIU. అంటే గణవిభజన ర-త-గ. పాదానికి 7 అక్షరాలు. చిట్టిపద్యం. ప్రాస నియమం పాటించాలి.

ఈ మృష్టపాద వృత్తపాదానికి ఇరువైపులా చెరొక ల-గ తగిలిస్తే అది ప్రతాపావతరం అనే వృత్తం అవుతుంది.

ఈ మృష్టపాద నడక చూస్తే UI- UU - UIU అన్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణ పద్యం ఇలా నడుస్తున్నది చూడండి.

చక్క- గారా - మయ్యకే
మ్రొక్క- వేలా - చిత్తమా
నిక్కు - వంబా - యొక్కడే
దిక్కు- సందే - హించకే

ఈ వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు తెలియరాలేదు.

కలలి

కలలి.
వినుము రామా
కనులు నిన్నే
కనగ కాంక్షిం
చును మహాత్మా


 

భలే చిట్టిపొట్టి వృత్తం. పాదానికి 5 అక్షరాలే. గురులఘుక్రమం IIIUU. అంటే గణవిభజన న-గగ అన్నమాట.

ఈ కలలి వృత్తపాదానికి ముందొక లఘవును చేర్చితే అది శశివదనావృత్తం. ముందొక గురువును చేర్చితే అది ఈతివృత్తం.

ఈకలలి వృత్తం పాదానికి ముందు రెండు లఘువులను చేర్చితే అది ధృతి వృత్తం.

పాదం ముందు రెండు గురువులను చేర్చితే అది స్థూలవృత్తం.పాదం చివర రెండు గురువులను చేర్చితే అది హోలావృత్తం. పాదం చివర ఒక గురువునే చేర్చితే అది గుణవతీవృత్తం.

కలలి పాదానికి ఎడాపెడా చెరొక గురువును తగిలిస్తే అది కిణపావృత్తం.

కలలి పాదానికి ముందు ల-గ చేర్చితే అది కుమారలలితావృత్తం. ఆ ల-గ చివరన చేర్చితే అది పరభృతవృత్తం. పాదానికి ముందు గ-ల చేరిస్తే అది రుచిరవృత్తం.

ఈ కలలి గురులఘుక్రమం చిన్నది కాబట్టి సవాలక్ష వృత్తాల్లో అది ఇమిడిపోతుంది.

ఈ కలలి నడకను చూస్తే, చివరి గగ ముందు విరుపు కనిపిస్తున్నది. ఉదాహరణ ఇలా నడుస్తున్నది.

వినుము - రామా
కనులు - నిన్నే
కనగ - కాంక్షిం
చును మ - హాత్మా

12, ఆగస్టు 2020, బుధవారం

రామాయణకల్పవృక్షం - బాలకాండము - ఇష్టిఖండము

శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు గతశతాబ్దపు ప్రముఖ సంప్రదాయకవి. వారి విశిష్టరచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం.  వారి కల్పవృక్షం నిజంగా ఛందఃకల్పవృక్షం కూడా. అందుచేత ఆ కృతిలోని విశేష ఛందస్సులను సంపుటీకరించటం కవులకు ఉపయోగకారి యైన పరిశ్రమ అనుకుంటున్నాను. ఇది పెద్దపనే. అనేక వందల విశేషవృత్తాలను ఎత్తి వ్రాసుకోవలసి ఉంటుంది. అందుచేత ఒక్కొక్క ఖండిక లోని విశేషవృత్తాలనూ ఒక వ్యాసంగా సంపుటీకరిద్దాం. ఈ రామాయణకల్పవృక్షంలో ప్రతి కాండమునూ విశ్వనాథవారు ఐదేసి ఖండములుగా తీర్చిదిద్దారు. మొత్తం ఇతిహాసం అంతా ముఫ్ఫై ఖండములు అన్నమాట.

ఈ‌ వ్యాసంలో‌ మనం ఆ కల్పవృక్షం బాలకాండ లోని విశేషవృత్తాలను అనుశీలనం మొదలుపెడదాం. మనం ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేభ,కంద, సీసాదులతో పాటు మరీ అంత విశేషం కాని మత్తకోకిల, స్రగ్ధర వంటివి కూడా పరిగణించటం లేదు.

బాలకాండము. ఇష్టిఖండము.24. ద్రుతవిలంబితము.
మది సుమంత్రుడు మంత్రులమాట కొ
ప్పుదల పూనునొ పూనఁడొ యన్నటుల్
వదన మింతగ వంచి యనంతరం
బిదియ మీదగు నిష్టమ యైనచో

బాలకాండము. ఇష్టిఖండము.25.అశ్వగతి.
పోయెద నంచు వచించి విభుం గన నశ్వము పైఁ
బోయె సుమంత్రుడు మంత్రులు పొందిరి సంససమున్
శ్రీయుతవజ్రమహాశ్మగరిష్ఠసుసౌధముపై
క్ష్మాయువతీసుమనోహరు గాంచె సుమంత్రు డొగిన్ 

బాలకాండము. ఇష్టిఖండము..51.రథోధ్ధతము.
ఱేని సంతస మెఱింగి సూతుఁడున్
దోన వాజులను దూఁకజేయఁగన్
బూనికన్ ఖదను పోవఁగా రథా
స్థాని రాజు మెయిసాగ నూగుచున్ 

బాలకాండము. ఇష్టిఖండము.67. గజవిలసితము.
చీకటు లివ్వికావు జిలుఁగు తళుకు జిగి
దంతాకృతి గానరాద యసలు నలుపుటిరుల్
గాక నగాళికావు కదలవు మెదలవు
ముందీ‌ కరిరాజి లేద యిటు గునగున కదుపన్

బాలకాండము. ఇష్టిఖండము.71. అశ్వవిలసితము.
శరనిధిఫేనరమ్యములు కొన్ని చైత్రవనబాలపత్రరుచి భా
స్వరతనునైగనిగ్యములు కొన్ని  చాంద్రసమభాలరేఖఁగ ముఖా
గ్రరుచిరచిహ్నము ల్గలిగి కొన్ని కంధరలు పైకి నెత్తి పృథివీ
శ్వరగురుదర్ప మేఁచునవి కొన్ని జాతిహయరత్నము ల్గనఁబడన్

బాలకాండము. ఇష్టిఖండము.144.చంద్రకళ.
మున్ను విన్నది దేవరహస్యంబున్ దమకున్ వినిపింపఁగా
నెన్నొసార్లు తలంచితి గానీ యేను వచింపనె లేదు నేఁ
డెన్నఁ జెప్పక యున్న ఫలం బబొక్కింతయు లేదు ధరాధిపా
మున్ను దేవయుగంబున వింటిన్ భూప భవత్సుత హేతువున్

బాలకాండము. ఇష్టిఖండము.165.ప్రియంవద.
దివిషదీశ్వరుఁడు తేప మౌనులున్
గవురుగప్పుచు పొగల్ వెలార్పఁగా
నవు దపస్సుల మహాగ్ని రేఁగగా
నవుర యచ్చరల నంపునంటగా

బాలకాండము. ఇష్టిఖండము.166.పణవము.
క్ష్మానాథుల్ మఱి మముఁ బంపినన్
మౌనీంద్రున్ గొని మమతం దెత్తున్
తేనుంజాలక ధృతి నే రానే
రా  నీ‌ పట్టణరమ సిగ్గిల్లన్


బాలకాండము. ఇష్టిఖండము.206.చంద్రిక.
కువలయమణి చిట్టికోర్కులున్
దవిలి శిశిరమూర్తిఁ దాలెచ్ పె
ల్లివము చిలుక మింటికెక్క నన్
సవియుఁ‌ జెలగ నొప్పెఁ జంద్రికల్.

బాలకాండము. ఇష్టిఖండము.207.చంద్రరేఖ.
భూమీభృన్మౌళీకాంతుల్ భూషామణిశ్రేణి వెల్గన్
శ్రీమత్కాంతిప్రసారక్షీరోదరత్న ప్రవాళో
ద్గామాంశుల్ రాజసౌధద్రాహిష్ఠగాంగేయకుంభ
గ్రామంబుల్ వెల్గుప్రోవుల్ గాఁ జంద్రరేఖల్ చలించెన్

బాలకాండము. ఇష్టిఖండము.324.పంచచామరము.
మొదల్ దినంబు లేడు మూఁడు మూఁడు వైశ్వదేవముల్
పదంపడిన్ మహాగమంబు పల్కినట్టి హోమముల్
పదింపదిం బొనర్చి కల్పవాగ్వ్యతిక్రమంబు లే
క దాంతులై చరించి రెల్ల క్ష్మాతలేశుయాజకుల్

బాలకాండము. ఇష్టిఖండము.356.పద్మనాభము.
యూపంబు లొక్కక్కడ యిర్వదినాల్గ
 హో‌ యంగుళంబుల్ దలిర్పన్ దిధృక్షా
 శ్రీపొంగి యధ్వర్యుముఖ్యుల్ ముదంబంది
  చిత్తంబులన్ శాస్త్ర మారీతి దేగా
 నీ‌ పర్ణు లీయాఱు నీయాఱు బైల్వంబు
 లీ‌యాఱునున్ ఖాదిరంబుల్ మఱొండీ
 యూపంబు శ్లేష్మాతకంబౌ మఱీ రెండ
 హో దేవదారుల్ సరే లెక్కకున్ వచ్చెన్

బాలకాండము. ఇష్టిఖండము.367.తన్వి.
ఆపయి రాజాంగనలును మహిషుల్ హారితనూలతను విలసిల్లన్
యూపసమీపావని మృతపశులం దోపికతో గుమిగొని పరిచర్యం
జూపి శిరోజంబులు కుడిదెసలం దోపి ముడింగొన నడమను వ్రేలన్
దాపుచు హస్తంబులఁ గుడితొడలన్ దారిదియే మధువు మధువటంచున్
 

బాలకాండము. ఇష్టిఖండము.368.తన్వి.
ఈపగిదిన్ తొమ్మిది తడవలు వా రేగి మఱిన్ వెనుదిరిగిన నట్లే
యూపసమీపావని మృతపశులం దోపికతో గుమిగొని పరిచర్యం
జూపి శిరోజంబు లెడమదెసలం దోపి ముడింగొన వలపల వ్రేలన్
దాపుచు హస్తంబు లెడమతొడలన్ దారిదియే మధువు మధువటంచున్

బాలకాండము. ఇష్టిఖండము.372.భుజంగవిజృంబితము.
సాధ్వీచూడారత్నం బాకో
సలపతిసుతఁ బెఱజలజాతనేత్రల బ్రహ్మహో
త్రధ్వర్యూద్గాతల్ వేహస్తా
హరణమునఁ దెమలిచిరి యల్లభోగిని హోత తా
నధ్వర్యుండున్ బాలాకల్యన్
హసదు వనగను దగినయట్టి యాపరివృత్తిఁ ద
త్రధ్వానాబ్జాస్యన్ దా నుద్గా
తయును సతులఁ‌ బతులు కరంబు లూనిన యట్లుగా 

బాలకాండము. ఇష్టిఖండము. 413.అష్టమూర్తి.
అగ్నాయీ ప్రియతమున్ ని
న్మమిత భక్తిప్రపత్తిన్ హవణు పొల్చిన శ్రధ్ధా
మగ్నంబౌ హృదయచేతోఽ
మలినమార్గంబునన్ భూమహవిరర్పణకార్యం
బగ్నీధ్రాధులును గర్తల్
హదనునం జేసి బర్హీ యమృతబుక్తతిఁ బాడన్
భుగ్నజ్వాలల వియద్భూ
ము లొరయం బ్రాకి బర్హిర్ముఖుల కిత్తు హవిస్సుల్

బాలకాండము. ఇష్టిఖండము.414.అష్టమూర్తి.
ఋక్సామాకృతి హజుర్మూ
ర్తిని మహాథర్వవాసున్ గృతసుహవ్యతురంగున్
వాక్సమ్యక్చరదుదాత్త
స్వరితమార్గప్రవిష్టున్ బటుహవిఃపప్రియచిత్తున్
దిక్సీమాంతనిబిడజ్యో
తిని బృహద్భాను నిన్నుం దెలిసి స్తోత్ర మొనర్పన్
ద్రాక్సంపాదితములౌ ద్రై
దశజగత్సౌఖ్యముల్ నిర్ధళన మందు నఘంబుల్

బాలకాండము. ఇష్టిఖండము.415.పంచచామరము.
నమో నమో హవిప్రియాయ నాకవాసినాం ముఖా
య మామకీన భక్తితర్పితాత్మనే సురఃప్రభూ
త్తమాయ కర్మమూర్తయే విదారితాశ్రితార్తయే
నమః కృపీటయోనయే ధనంజయాయ బర్హిషే

బాలకాండము. ఇష్టిఖండము.434.మందాక్రాంత.
గౌరీపాదాంబురుహవినమత్కాంతలాక్షానురక్తా
పారావారోన్మథనజనితప్రౌఢకాకోలభక్తా
శారజ్యోత్సామృదుశశిశుశుస్వఛ్ఛచూడాగ్రముక్తా
సౌరప్రోద్యజ్జగదవననిష్ణాతగంగాభిషిక్తా

తదుపరి వ్యాసంలో బాల కాండము - అవతార ఖండము నుండి విశేషవృత్తాలను పరిశీలిద్దాం.

కౌముది / చరపదం

 కౌముది.
 సురలకేమో సుఖావాప్తిగన్
 సురగణారిన్ సొదం బెట్టగన్
 వరలె రామావతారం బిలన్
 పరమధర్మప్రకాశంబుగన్
           (యతి 6వ స్థానం)

 కౌముది.
 దివిషదుల్ గోర శ్రీరాముడై
 భువికినే తెంచె నా వెన్నుడే
 భువనసమ్మోహనాకారుడై
 భువనసంరక్షణోద్యోగియై
          (యతి పాటించలేదు)

 కౌముది.
 అనితరం బైన దా రూపమే
 అనితరం బైన దా శౌర్యమే
 తనువునం దాల్చి తా వెన్నుడే
 మనుజుడై పుట్టె మా రాముడై
           (యతి 7వ స్థానం)





ఈ కౌముది ఒక పొట్టి వృత్తం.  పాదం నిడివి 10 అక్షరాలు. దీనికి చరపదం అని మరొక పేరు. దీని గురులఘుక్రమం IIIUUIUUIU. అంటే దీనికి గణవిభజన   న - త - త - గ .  ఇంత చిన్న వృత్తానికి యతిస్థానం అవసరం లేదని నా అభిప్రాయం. కాని లక్షణకారులు 6వ అక్షరం యతిస్థానం అని చెప్పారు. ప్రాసనియమం తప్పదు. నడక విషయం చూదాం. మనం దీనిలోని గురులఘుక్రమాన్ని నల - ర - ర అని పంచమాత్రాగణాలుగా విభజన చేయవచ్చును. బహుశః ఇదే సహజమైన గణవిభజన అనుకోవచ్చును. నడక ననననా-నాననా-నాననా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉదాహరణలు చూదాం .

ఈ‌ కౌమిదీవృత్త పాదానికి ముందు ఒక న-గణం తగిలిస్తే అది  చంద్రికావృత్తం అవుతుంది. న-గణంతో‌ పాటుగా పాదం చివరన ఒక గురువును కూడా జతపరిస్తే అది నాందీముఖీవృత్తం అవుతుంది. కౌముది పాదం చివరన మరొ ర-గణం తగిలిస్తే అది పరివృఢం అనే వృత్తం అవుతుంది. ఆ ర-గణంతో‌ పాటు మరొక గురువును కూడా జోడిస్తే అది పరీవాహవృత్తం అవుతుంది. ఇవి కాక మరికొన్ని వృత్తాల్లో కూడా ఈ‌ కౌముది ఇమిడి ఉంది.

మొదటగా 6వ అక్షరం యతిస్థానంగా ఒక కౌముదీ పద్యం.

    సురలకేమో సుఖావాప్తిగన్
    సురగణారిన్ సొదం బెట్టగన్
    వరలె రామావతారం బిలన్
    పరమధర్మప్రకాశంబుగన్


యతినియమం వదిలి పెట్టి ఒక పద్యం.

     దివిషదుల్ గోర శ్రీరాముడై
     భువికినే తెంచె నా వెన్నుడే
     భువనసమ్మోహనాకారుడై
     భువనసంరక్షణోద్యోగియై


ఈ‌ పద్యం పంచమాత్రాగణాలతో‌ కూడిన నడకతో‌ ఉన్నది అనుకున్నాం‌ కదా. ఆ ప్రకారం విడదీసి చూపితే ఈ‌క్రింది విధంగా ఉంటుంది.  ఐదు-ఐదు మాత్రలతో‌  నడిచే తాళగతిని ఖండగతి అంటారు.

దివిషదుల్ - గోర శ్రీ - రాముడై
భువికి నే - తెంచె నా - వెన్నుడే
భువన స - మ్మోహనా - కారుడై
భువన సం - రక్షణో - ద్యోగియై

ఈ కౌముదీవృత్తానికి యతిస్థానంగా 7వ అక్షరాన్ని గ్రహించటం కూడా బాగుంటుంది. యతిస్థానం కూడా ఒక గురువు పైన వస్తుంది. ఇలా కూడా ఒక పద్యం చెప్పుకుందాం.

     అనితరం బైన దా రూపమే
     అనితరం బైన దా శౌర్యమే
     తనువునందాల్చి తా వెన్నుడే
     మనుజుడై పుట్టె మా రాముడై

యతిస్థానం 7వ అక్షరంగా విరచి చదివితే దీని నడక భిన్నంగా తమాషాగా ఉంటుంది

అనితరం - బైన - దా - రూపమే
అనితరం - బైన - దా - శౌర్యమే
తనువునం - దాల్చి - తా  - వెన్నుడై
మనుజుడై - పుట్టె  - మా - రాముడే

కొందరు  యతిస్థానం 6వ అక్షరంగా నప్పుతుందనీ మరి కొందరు 7వ అక్షరంగా నప్పుతుందనీ అభిప్రాయ పడవచ్చును. అలాగే యతిస్థానం లేకపోవటమే ఉత్తమం అనీ కొందరు అనుకోవచ్చును.  వాడంకం మీద కాని ఏ ఆలోచన సరైనది అని నిగ్గుతేలదు. 7వ స్థానంలో యతితో మంచి తూగు కనపడుతోంది - లాక్షణికం కాకపోయినా అని డా॥విష్ణునందన్ గారు అభిప్రాయం వెలిబుచ్చారు.

ఈ కౌముదీవృత్తానికి పూర్వకవుల ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అంటే విశ్వనాథ వారు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తున్నది. ఉదాహరణ సేకరించాలి.

పదమాలి

పదమాలి.
దయగల తండ్రి కృతాంతదండనా
భయమును ద్రోసి యనన్యభక్తిమై
జయజయరామ యటంచు జక్కగా
ప్రియముగ పాడు బుధాళి వేడుకన్


పదమాలి వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. పాదంలో గురులఘుక్రమం IIIIUIIUIUIU. అంటే దీనికి గణవిభజన న - జ - జ - ర అని. యతిస్థానం 10వ అక్షరం.
 

ఈ పదమాలికి మాలతి అని మరొక పేరుంది. ఈ‌ పదమాలి పాదం చివర మరొక గురువును జోడిస్తే అది మృగేంద్రముఖం అనే వృత్తం అవుతుంది.  కల్పలతాపతాకినీ వృత్తపాదంలో ఈ పదమాలి చివరి పన్నెండు స్థానాలుగా ఉంది. ఈ పదమాలి మొదటి రెండులఘువులనూ తొలగిస్తే అది సహజావృత్తం అవుతుంది. వా బదులు ఒక గురువును ఉంచితే అది ఉత్పలమాలలో అంతర్భాగంగా కనిపిస్తుంది.

దీని నడక మిశ్రగతిలో వస్తుంది. మిశ్రగతి అంటే 3-4 మాత్రల గణాలు వరుసగా వస్తూ ఉండటం.

ఈ మిశ్రగతిలో పై పద్యం నడక ఇలా ఉంటుంది.


దయగల - తండ్రి - కృతాంత - దండ - నా
భయమును - ద్రోసి - యనన్య - భక్తి - మై
జయజయ - రామ - యటంచు - చక్క - గా
ప్రియముగ - పాడు - బుధాళి - వేడు - కన్


ఇక్కడ నడక 4 - 3 - 4 - 3 - 2 మాత్రలుగా కనిపిస్తోంది కదా అంటే పాదాంతంలో గురువును మనకు కావలసి వస్తే మరో రెండు మాత్రల కాలానికి పొడిగించుకోవచ్చును. అప్పుడు 4 - 3 - 4 - 3 - 4 మాత్రలుగా అవుతున్నది.  ఇలా ఉంది కాబట్టి మిశ్రగతి అన్నమాట. మిశ్రగతికి నప్పే తాళం త్రిపుటతాళం. ఇక్కడ మనకు సానుకూలాంశం యతిస్థానం తాళం మధ్యలో రావటం లేదు.  అందుచేత ఈ నడక సహజంగానే నప్పుతుందని నా విశ్వాసం.

11, ఆగస్టు 2020, మంగళవారం

ఇంద్రవంశం / ఇందువంశం

ఇంద్రవంశం.
శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే  
యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే  
నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్



ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తంలో‌ పాదానికి 12 అక్షరాలు. దీని గురులఘుక్రమం UUIUUIIUIUIU. అంటే గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ ఇంద్రవంశానికి ఇందువంశం అని మరొక పేరు కూడా ఉంది.

ఇంద్రవంశపాదానికి ముందు ఒక లఘువును అదనంగా చేర్చితే  అది కరపల్లవోద్గత అనే వృత్తం అవుతుంది. ఇంద్రవంశం పాదారంభం లోని గురువును లఘువుగా మార్చితే అది వంశస్థవృత్తం అవుతుంది. ఆగురువునే రెండు లఘువులుగా మార్చితే అది అంబుదావళీవృత్తం. ఈ‌ ఇంద్రవంశం పాదారంభంలోని గురువును వ-గణం అంటే UI అని మార్చితే అది స్వార్ధపదావృత్తం అవుతుంది. ఇంద్రవంశం చివరి గణం ర-గణంలోని లఘువును తీసివేసి గగ అని మారిస్తే అది ఇంద్రవజ్రవృత్తం అవుతుంది.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగు టపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యం కూడా అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌ కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన మరొక పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి పారేసాం . పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే చచ్చినట్లుగా అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే లెండి అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయవచ్చును.

సింహగతి

సింహగతి.
రామునే తలపరాదా
ప్రేమతో పిలువరాదా 
నీ‌ మనోరథము నీయన్
స్వామి నీ కడకు రాడా
 
 సింహగతి.
 భామ  లందరును రారే
 ప్రేమ మీఱగను సీతా 
 రామచంద్రులకు వేడ్కన్
 క్షేమహారతుల నీరే



సింహగతి అనేది ఒక కొత్త వృత్తం. నా సృష్టియే. పాదానికి కేవలం 8 అక్షరాలు. దీనికి గణవిభజన ర-న-గగ. చిన్న వృత్తం‌కాబట్టి యతిస్థానం ఏమీ‌ ఉండదు. ప్రాసనియయం మాత్రం ఉంటుంది.

ఈ సింహగతి పాదం ముందు మరొక న-గణం చేర్చితే అది మదనమాలావృత్తం అవుతుంది. ఏకంగా నల-గణం అని నాలుగు లఘువులను చేర్చితే అది నయమాలినీవృత్తం అవుతుంది. పాదం ముందు న-గణమూ చివరన రెండుగురువులనూ చేర్చితే అది విపన్నకదనం అనే వృత్తం అవుతుంది. మత్తేభశార్దూలవిక్రీడీతవృత్తాల్లోనూ‌ మరికొన్నింటిలోనూ‌ ఈ సింహగతి అంతర్భాగంగా ఉంటుంది.

ఈ వృత్తానికీ‌ సింహరేఖకీ‌ చాలా దగ్గర చుట్టరికం. ఒకే ఒక అక్షరంలోనే తేడా. సింహరేఖలోని జ-గణాన్ని న-గణంగా మార్చటమే. చూడండి.

సింహరేఖ   U I U - I (U) I - U U
సింహగతి   U I U - I (I) I - U U

అంతే తేడా. కాని నడక వేరుగా వస్తుంది.  ఈ‌ సింహగతిలో సాధారణంగా  'న' గణం‌ దగ్గర విరుపు వస్తుంది. లేదా న-గణానికి పూర్వాక్షరం మీద విరుపు వస్తుంది. అలాగే చివరన ఉన్న 'గగ' పైన కూడా ఒక చిన్న విరుపు ఉందని గమనించండి.

      రామునే - తలప - రాదా
      ప్రేమతో - పిలువ - రాదా
      నీ‌ మనో - రథము - నీయన్
      స్వామి - నీ కడకు - రాడా

ఇందులో మొదటి మూడు పాదాల్లోనూ న-గణం దగ్గరా, చివరిపాదంలో తత్పూర్వాక్షరం పైనా విరుపు గమనించండి.  రెండవరకం విరుపు ప్రథానంగా ఉన్న పద్యం.

     భామ -లందరును - రారే
     ప్రేమ -మీఱగను - సీతా
     రామ - చంద్రులకు - వేడ్కన్
    క్షేమ - హారతుల - నీరే


ఈ సింహగతి వృత్తం వ్రాయట‌ం సులభం కాబట్టీ ఔత్సాహికులు తప్పకుండా ప్రయత్నించండి.

మధుమతి / స్వనకరి

మధుమతి.
పరమపూరుషు డా
హరియె రాముడుగా
ధరకు వచ్చెనయా
సురల కోరికపై

         
     
మధుమతి ఒక చిన్ని వృత్తం. పాదానికి 7 అక్షరాలు. దీని గురులఘుక్రమం IIIUIIU. పాదానికి గణాలు న-భ-గ అంతే. యతి స్థానం ఏమీ లేదు. ప్రాసనియమం మాత్రం‌ తప్పదు.

ఈ మధుమతీవృత్తానికి స్వనకరి అని మరొక పేరుంది.

ఈ‌మధుమతికి ముందొక లఘువును అదనంగా చేర్చితే అది అఖని అనే వృత్తం అవుతుంది. ముందొక లఘువుతో‌పాటు, మరొక గురువును కూడా పాదం చివర చేర్చితే అది శరలీఢావృత్తం అవుతుంది. మధుమతికి చివరన మరొక గురువును మాత్రం చేర్చితే అది మృత్యుముఖి అనే‌ వృత్తం అవుతుంది. మధుమతికి పాదం చివర లగ-గణం చేర్చితే అది కరశయావృత్తం అవుతుంది. అలా కాక మధుమతికి పాదారంభంలో హ-గణం చేర్చిటే అది రంజకవృత్తం అవుతుంది. మదుమతికి చివరన ఒక స-గణం చేరిస్తే అది శరత్ అనే వృత్తం అవుతుంది, ముందు భ-గణం చేర్చితే గహనావృత్తం అవుతుంది లేదా న-గణం చేర్చితే అది ఫలధరం అనే వృత్తం అవుతుంది.  ఈ మధుమతి నిడివి కేవలం 7 అక్షరాలే‌ కాబట్టి సవాలక్ష వృత్తాల్లో దీని గురులఘుక్రమం అంతర్భాగంగా ఉంటుంది.
 
విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం  బాలకాండ-అవతారఖండము లోని 184 పద్యం.
 
మధుమతి.
వగరు పిందెలతోఁ
జిగురుటాకులతోఁ
దొగరువన్నెలతో
మిగిలె మావిరుతుల్
 
ఈ మధుమతి నడకను చూస్తే దీని మూడేసి మాత్ర తరువాత విరుపుతో త్రిస్ర గతితో కనిపిస్తున్నది.
 
వగరు - పిందె - లతోఁ
జిగురు - టాకు - లతోఁ
దొగరు - వన్నె - లతో
మిగిలె - మావి - రుతుల్

ఇది అప్పకవి చెప్పిన మధుమతీ వృత్తం. అనంతాదులు చెప్పినది వేరే ఉంది. దానికి మదనవిలసిత అన్న పేరూ ఉంది. దాని గురులఘుక్రమం IIIIIIU. అనగా న-న-గ.
 
ఈ మధుమతీ వృత్తం మహామహా సులువు అనిపిస్తోంది కదా.  అందరూ ప్రయత్నించవచ్చును.

చంద్రవర్త్మ

చంద్రవర్త్మ.
రాము డల్పుడని రావణు డనియెన్
రామబాణమున ప్రాణము వదిలెన్
కాముకుండు నరకంబున కరిగెన్
భామతోడ రఘువల్లభు డరిగెన్



ఈ చంద్రవర్త్మ వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIIIIU .దీని గణవిభజన ర - న - భ - స.  యతిమైత్రి స్థానం 7వ అక్షరం.అంటే యతిమైత్రి స్థానం వద్ద పాదం సమద్విఖండితం అవుతుం దన్నమాట. ప్రాసనియమం తప్పదు.

ఇది స్వాగతవృత్తానికి సోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట. స్వాగతంలోని న-గణాన్ని లగ అని మార్చితే అన్నే మాత్రలతో, అదే‌ స్వాగతం నడకతో‌ మాధురీవృత్తం అవుతుంది. అలాగే స్వాగతంలోని భ-గణాన్ని గగ అని మార్చితే ఇంచుమించిగా అదే స్వాగతం నడకతో శ్రేయావృత్తం అవుతుంది. స్వాగతంలో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే అదే స్వగతపు మాత్రలూ‌ నడకలతో అది ద్రుతపదవృత్తం అవుతుంది. ఇవన్నీ ఒక చిన్న గుంపు అనుకోవచ్చును.

ఈ చంద్రవర్త్మ యొక్క గురులఘుక్రమం, విషగ్వితానం అనే వృత్తంలో అంతర్భాగంగా ఉంటుంది.

ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అంటే విశ్వనాథవారు వాడారు. వారి సాహిత్యం నుండి ఉదాహరణను సేకరించవలసి ఉంది.

ఈ చంద్రవర్త్మ నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.

    రాము  - డల్పు - డని  - రావణు - డనియెన్
    రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
    కాము - కుండు - నర - కంబున కరిగెన్
    భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్
   

ద్రుతవిలంబితం

ద్రుతవిలంబితం.
ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
నచటి భోగము లెప్పుడు గోరినా
నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
నచట నుండెద నంతియ జాలదే

ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గురులఘుక్రమం  IIIUIIUIIUIU. అంటే గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఉత్పలమాలా, చంపకమాలలకు ద్రుతవిలంబితం చాలా దగ్గరి చుట్టమేను  ఉత్పలమాలకు భ-ర-న-భ-భ-ర-వ అని కదా గణవిభజన. ఇందులో ద్రుతవిలంబితం తాలూకు గణక్రమం  న-భ-భ-ర నేరుగా కనిపిస్తూనే ఉందిగా. ఉత్పలమాలా చంపకమాలల చుట్టరికం వేరే చెప్పాలా? ఇవి కాక, ఇంకా వ్యాకోశకోశలం, సూరసూచకం అనే వృత్తాల్లో ఈ ద్రితవిలంబితం ఇమిడి కనిపిస్తూ ఉంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తపాదానికి ముందు ఒక ర-గణం చేర్చితే అది నూతనం అనే వృత్తం అవుతుంది. రెండు ద్రుతవిలంబితపాదాలను ఒక జతచేస్తే అది శంబరం‌ అనే వృత్తం అవుతుంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.
కాబట్టి రెండు స్థలాలలోనూ యతిమైత్రి పాటించి వ్రాయవలసి ఉంటుంది చిత్రకవిత్వం ఇలా వ్రాసే‌ పక్షంలో.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU         న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                    

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.   ఇలా తేటగీతిలో ద్రుతవిలంబితం గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం‌ బాలకాండము ఇష్టిఖండములోని ద్రుతవిలంబితం

    మది సుమంత్రుడు మంత్రులమాట కొ
    ప్పుదల పూనునొ పూనఁడొ యన్నటుల్
    వదన మింతగ వంచి యనంతరం
    బిదియ మీదగు నిష్టమ యైనచో

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.

చిత్రపదము

చిత్రపదము
రాముని నమ్మిన వాడా
నీమము దప్పని వాడా
స్వామియె తోడుగ లేడా
కామిత మీయగ రాడా


ఈ చిత్రపదం పాదానికి 8 అక్షరాలుండే చిన్న వృత్తం. గురులఘుక్రమం UIIUIIUU. అంటే దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని.  వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఈ చిత్రపద వృత్తం‌ పాదానికి ముందు ఒక లఘువునీ చివర్న ఒక గురువునీ తగిలిస్తే అది ఇంద్ర వృత్తం అవుతుంది. ఈ చిత్రపదం ముందు రెండు గురువులు తగిలిస్తే అది ప్రసర వృత్తం అవుతుంది. రెండు సరిపోవండీ అని నాలుగు గురువులు తగిలిస్తారా అది కాసారక్రాంత వృత్తం అవుతుంది. అబ్బే గురువు లెందుకండీ బరువులూ అంటారా? చిత్రపదం పాదం మొదట రెండు లఘువులు తగిలించండి. అది ఉదితం అనే వృత్తం అవుతుంది. ఆపైన పాదం చివర్న ఒక గురువునూ తగిలిస్తారా అప్పుడది విష్టంభం అనే వృత్తం అవుతుంది. చిత్రపదం పాదారంభంలో‌ ఒక భ-గణం తగిలిస్తారా? అప్పుడు అది దోధక వృత్తం అవుతుంది. పోనీ‌ స-గణం తగిలిస్తారా, అప్పుడది రోధక వృత్తం అవుతుంది.  మొదటేమీ వద్దండీ అని చిత్రపదం చివర్న ఒక స-గణం తగిలిస్తారా? అప్పుడు అది కలస్వనవంశం అనే వృత్తం అవుతుంది. ఇలా చాలానే చుట్టరికాలు చూడవచ్చును దీనికి.

ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.

     భక్త జనావన దక్షా
     ప్రాక్తన శాసన పక్షా
     యుక్త విచారణ దీక్షా
     సక్త మహేశ్వర రక్షా

ఈ చిత్రపదం నడకను చూస్తే చివరి రెండు గురువుల ముందు కొంచెం విరుపు కనిపిస్తోంది.
ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.

నవమాలిని / నయమాలిని

నవమాలిని.
ఇనకుల నాయకా యితరు లేలా
నను నిను కన్నుగానకను తిట్టన్
దనుజుల పైన నాదరము ధర్మం
బన నగు నట్టి వీ రసురు లేమో

     

ఈ నవమాలినీ వృత్తానికి పాదానికి 12 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం IIIIUIUIIIUU.  గణవిభజన న - జ - భ - య.  యతిస్థానం 8వ అక్షరం. వృత్తం‌ కదా, ప్రాసనియమం ఉంటుంది తప్పదు.

ఈ నవమాలినీ వృత్తానికి నయమాలినీ అన్న మరొక పేరు కూడా ఉంది.

ఈ నవమాలినీ‌ వృత్తపాదానికి ముందు ఒక గురువును చేర్చితే అది మయూఖసరణి అనే మరొక వృత్తంగా మారుతుంది. అలాగే ఈ నవమాలినీ వృత్తపాదం నుండి ఆదిలఘువును తొలగిస్తే అది మదనమాల అనే మరొక వృత్తంగా మారుతుంది. ఈ నవమాలిని తొలిలఘువును IU గా మార్చితే అది రుచివర్ణ అనే వృత్తం అవుతుంది.

ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.

పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

దీని నడక చూస్తే ఇల్లా ఉంది:

      ఇనకుల - నాయకా - యితరు - లేలా
      నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
      దనుజుల - పైన నా - దరము - ధర్మం
      బన నగు - నట్టి వీ - రసురు -లేమో

 వేరే‌ నడకలతో ఈ వృత్తంలో‌ పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.

10, ఆగస్టు 2020, సోమవారం

జలదము / లవలీలత

జలదం.
పుట్టువు లేని వాడొకడు పుట్టెనయా
పుట్టెడు నెల్లవారలకు పుట్టువులే
పుట్టని మంచిదారి రఘుపుంగవుడై
యిట్టి దటంచు జూపె నటు లేగుదమా
   
రామచరిత్రముం జదువ రక్కట శ్రీ
రాముడు చెడ్డవాడనుచు రావణుపై
ప్రేమను చిల్కరించి చెలరేగెద రీ
భూమిని కొంతమంది కలి బోధితులై



ఈ జలద వృత్తానికి పాదానికి 13 అక్షరాలు.  పాదంలో గురులఘుక్రమం  UIIUIUIIIUIIU.

గణ విభజన భ - ర - న - భ - గ.  యతిస్థానం 10వ అక్షరం.

ఈ‌ జలద వృత్తం  ఉత్పలమాలకు బాగా దగ్గరి చుట్టం. ఉత్పలమాల గణాలు భ - ర - న - భ - భ - ర - వ. అంటే ఉత్పలమాలలో మొదటి 13అక్షరాలకుకుదిస్తే అది జలదం అన్నమాట.

ఈ‌జలద వృత్తానికి లవలీలత అని మరొక పేరు కూడా ఉంది.

జలదవృత్తం‌ పాదానికి ముందొక లఘువును చేర్చితే‌ అది కాకిణికా వృత్తం‌ అవుతుంది. శంబరం, సూరసూచిక అనే వృత్తాల్లో జలదవృత్త గురులఘుక్రమం అంతర్భాగంగా ఉంది ఉత్పలమాలకే‌ కాకుండా.

ఈ‌ జలదవృత్తానికి  కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి ప్రయోగం.

    వేసవి నెండ నుక్కఁ గడు వెక్కసమై
    వేసరిజేసినన్ దపము విశ్వజనుల్
    వాసిగ వారి నేల హరి వచ్చెనొ నా
    భాసిలె నింగినిన్ జలదవార మహా

ఈ‌జలదం‌ నడక చూస్తే యతిస్థానం దగ్గర విరుపు కనిపిస్తోంది. అంతవరకూ ఉత్పలమల లాగా సాగుతుంది. ఆపైన రెండు త్రిమాత్రాగణాలుగా ముక్తాయింపు ఉంటుంది పాదానికి.

పుట్టువు లేని వాడొకడు - పుట్టె - నయా
పుట్టెడు నెల్లవారలకు - పుట్టు - వులే
పుట్టని మంచిదారి రఘు - పుంగ - వుడై
యిట్టి దటంచు జూపె నటు - లేగు - దమా

ఇక్కడ నేను రెండు పద్యాలను చూపాను.  రెండింటికి నడకలోనూ కొద్దిగా బేధం ఉండటం గమనించండి.  రెండు పద్యాల్లోనూ ప్రవాహగుణం చూడవచ్చును. ప్రవాహగుణం అంటే పాదంచివరి మాట తరువాతి పాదంలోనికి చొచ్చుకొని పోవటం అన్నమాట. ఇది పద్యానికి కొంత గాంభీర్యత తెస్తుందన్న అభిప్రాయం కొంత కవిలోకంలో తరచు వినబడుతుంది.  పూర్తిగా కాదు కాని అది కొంతవరకు నిజం. కాని సంస్కృతంలో మాత్రం ఏ పాదానికి ఆపాదం పూర్తికావాలి.  పాదం చివరి మాట తరువాతి పాదంలో కొనసాగటం నిషిధ్ధం. అందువల్ల సంస్కృత కవిత్వంలో గాంభీర్యానికి లోపం ఏమీ రాలేదు కదా.  తెలుగులో దీర్ఘాంతంగా ముగిసే పదాలు తక్కువ.  అందుచేత సంసృతవృత్తాలను తెలుగు భాషలో పద్యాలుగా వ్రాసేటప్పుడు పాదోల్లంఘనాన్ని అనుమతించక తప్పదు.  లేకపోతే విడివిడిగా పద్యాలు కుదురుతాయేమో కాని కథాకథనానికి పద్యాలు సహకరించక ఇబ్బంది కావచ్చును.

మణిరంగం

మణిరంగం.      
శ్యామలాంగ వియచ్చరపూజ్యా
రామచంద్ర సురారివిరోధీ     
నామనంబున నమ్మితి నయ్యా
ప్రేమ నేలవె వేదసువేద్యా


ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం. పాదానికి 10 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం UIUIIUIIUU.  గణవిభజన ర - స - స - గ . యతిస్థానం 6వ అక్షరం. వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం ఉంది.

నడక ప్రకారం దీని  గురులఘుక్రమం UIUII - UIIUU అన్నట్లు ఉంటుంది.  సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో. పాదంలో ఉన్నవి 14 మాత్రలు. సరిగా 7 మాత్రల తరువాత పాదం విరుగుతుం దన్నమాట సమంగా.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.

    శ్యామ లాంగ వి - యచ్చర పూజ్యా
    రామ చంద్ర సు - రారివి రోధీ
    నామ నంబున - నమ్మితి నయ్యా
    ప్రేమ నేలవె - వేదసు వేద్యా
      
మణిరంగ వృత్తంలో నేమాని రామజోగి సన్యాసిరావు గారి శివస్తుతి పద్యం.
    పార్వతీపతి పాపవిదారా
    సర్వరక్షక సౌఖ్యవిధాతా
    శర్వ ధూర్జటి శంకర దేవా
    గర్వ నాశక కామిత మీవా      

ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.

మంజులయాన

మంజులయాన.
కనులార భవదీయ కమనీయ రూపమున్
కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
తనివార నిను జూడ తగనందువా ప్రభూ
మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా



ఈ మంజులయాన వృత్తంలో‌ పాదానికి 15 అక్షరాలుంటాయి. దీని  గురులఘుక్రమం IIUIIIUIIIUIUIU అని. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం. ఇది నడక ప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ 'మంజులయాన' వృత్తం  నేను సృష్టించినది. మొదట్లో  దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా. ఆ సందర్భంగా ముందుగా ఈపద్యం లక్షణాన్ని ఒకపాదంగా  ఇవ్వటం‌ జరిగింది. అదెలా అంటే

పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

అని!

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
    అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు, అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా
     
మోహన రావు గారు పరిశీలించి చెప్పినట్లుగా ఇది పూర్తిగా కొత్త గురులఘుక్రమం కలిగిన వృత్తం. తెలిసిన వృత్తాలు దేనిలోనూ ఇది అంతర్భాగం‌ కాదు.

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

యతిమైత్రి స్థానం వద్ద విరుపు ఇవ్వాలి. అంటే అక్కడ కొత్తపదం‌తో‌ మొదలవ్వాలి వీలైనంత వరకు. అప్పుడు వినటానికి చాలా బాగుంటుంది నడక. ముఖ్యంగా పంచమాత్రా విభజనతో నడుస్తున్నది కాబట్టి ఐదేసి మాత్రలకు కొత్తపదాలు పడటం‌ మరింత శోభిస్తుంది. 

భద్రకము / భద్రిక

భద్రకం.
రాముడా యతడు దేవుడే
ఏమి సందియము లేదులే
భూమిపై నిలుప ధర్మమున్
స్వామి తా నిలకు వచ్చెలే



ఈ‌ భద్రకం అనే చిట్టిపొట్టి వృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIU. గణవిభజన  ర - న -ర. అంటే‌పాదానికి 9 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిస్థానం ఉండదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంటుంది.  ఈ‌ పద్యం నడక గణాంతాల్లో విరుపుతో ఉంటుంది.

ఈ భద్రకవృత్తానికి భద్రిక అనే పేరు కూడా  ఉంది.

నాకు తెలిసి పూర్వకవి ప్రయోగాలు లేవు.

పై పద్యంలో నేను సరిపాదాలకు అంత్యప్రాసను కూర్చాను.  కాని నియతంగా అంత్యప్రాసాదులు వాడవలసిన పని లేదనే అనుకుంటాను.

ఈ‌భద్రకం నడకను చూస్తే ఇది UIUIII - UIU అన్నట్లుగా ఉంది అంటే పాదాంతం లోని ర-గణం ముందు చిన్న విరుపు ఉందన్నమాట. 

రాముడా యతడు  - దేవుడే
ఏమి సందియము  - లేదులే
భూమిపై నిలుప  - ధర్మమున్
స్వామి తా నిలకు  - వచ్చెలే

భద్రకాలు వ్రాయటం సులువు గానే కనిపిస్తోంది.

వీలైతే మీరూ‌ కొన్ని భద్రకాలు వ్రాయండి.

అర్ధకళ

అర్ధకళ.
నిరవద్యగుణాభరణా
సురసేవిత శ్రీచరణా
ధరణీతనయారమణా
విరతాఖిలదైత్యగణా



ఈ చిన్నారి వృత్తానికి పాదానికి 9 అక్షరాలు. గురులఘుక్రమం IIUIIUIIU. అంటే, పాదానికి గణాలు స - స - స. యతిమైత్రి స్థానం అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు. పై పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.

ఈ అర్ధకళ తోటకాన్నుండి పుట్టినట్టు చెప్పవచ్చును. తోటకం గణాలు స - స - స - స. వీటిలో నుండి ఒక స-గణం తగ్గిస్తే అది అర్ధకళ అవుతుంది. ఈ అర్ధకళకు ఎడాపెడా తలొక గురువునూ‌ తగిలిస్తే అది దోధక వృత్తం అవుతుంది.

ఒకటా రెండా, ఏకంగా డభై పైన వృత్తాల్లో ఈ‌అర్ధకళ ఇమిడిపోతుంది.

ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.

ఈ అర్ధకళ నడకను  చూస్తే 5 అక్షరాల తరువాత విరుపు కనిపిస్తోంది. అంటే  IIUII - UIIU అన్నట్లు. అంటే మాత్రాపరంగా పాదంలో సమద్విఖండనం‌ చూపుతున్నది.

నిరవద్యగు - ణాభరణా
సురసేవిత - శ్రీచరణా
ధరణీతన - యారమణా
విరతాఖిల - దైత్యగణా

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉదాహరణకు ఇచ్చిన ఈపద్యంలో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.

ఖేల

 ఖేల.
శౌరీ దీనజనాధారా
ధీరా రావణసంహారా
కారుణ్యాలయ శ్రీరామా
రారా రాఘవ రాజేంద్రా

ఇది ఒక కొత్తవృత్తం. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  UUUIIUUU. ఇలా బదులు UUU-II-UUU అని చెప్తే బాగుంటుందేమో.


కాని దీని నడక చూస్తే ఇది UU - UII - UUU అని తోస్తున్నది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం‌ నడక ఇలా మనోహరంగా ఉంది.

శౌరీ - దీనజ - నాధారా
ధీరా - రావణ - సంహారా
కారు - ణ్యాలయ - శ్రీరామా
రారా - రాఘవ - రాజేంద్రా

ఈ వృత్తానికి బంధుగణం బాగానే ఉంది చూడండి. ఈ క్రింది 19 వృత్తాలూ ఖేలావృత్తానికి తల్లులన్న మాట. ఎందుకంటే వీటిలో‌ఈ ఖేలావృత్తం‌ అంతర్భాగం కాబట్టి. ఇలా సరదాగా మన వృత్తాల్లో తల్లీపిల్లా వరసలు చూడవచ్చును. తమాషా ఏమిటంటే వాసకలీలా అనే వృత్తం పాదంలో ఈఖేలా పాదం రెండుసార్లు వస్తుంది!

1 ధృతహాలా 9 U - UUUIIUUU
2 ఖేలాఢ్యమ్ 9 UUUIIUUU - U
3 ద్వారవహా 10 UI - UUUIIUUU
4 మధ్యాధారా 10 U - UUUIIUUU - U
5 వంశారోపీ 10 I - UUUIIUUU - U
6 విశదచ్ఛాయః 10 II - UUUIIUUU
7 అంతర్వనితా 11 UUUIIUUU - UUU
8 కందవినోదః 11 UII - UUUIIUUU
9 సంసృతశోభాసారః 11 II - UUUIIUUU - U
10 లీలారత్నమ్ 12 UUU - UUUIIUUU - U
11 మత్తాలీ 12 UU - UUUIIUUU - UU
12 విభా 13 IIIIU - UUUIIUUU
13 అలోలా 14 UUUIIUUU - UUIIUU
14 ధీరధ్వానమ్ 14 UUUUUU - UUUIIUUU
15 విధురవిరహితా 17 II - UUUIIUUU - IIIIIIU
16 మఞ్జీరా 18 UUUU - UUUIIUUU - IIUUUU
17 శంభుః 19 II - UUUIIUUU - IIUUUUUUU
18 నిష్కలకణ్ఠీ 22 UII - UUUIIUUU - IIUUIIUUIIU
19 వాసకలీలా 22 UII - UUUIIUUU - II - UUUIIUUU - U

ఈ ఖేలా వృత్తంలోను అద్యంతాల గురువులను రెండింటినీ తొలగిస్తే అది తనుమధ్యా వృత్తం అవుతుంది. అంటే ఖేలావృత్తం‌ తల్లి అతే తనుమధ్య దాని పిల్ల అన్నమాట. ఈ ఖేలావృత్తం‌ నుండి ఆదిగురువును తీసివేస్తే ఒక నలభై వృత్తాలదాకానూ లేదా అంత్యగురువును తీసివేస్తే మరొక నలభై వృత్తాలదాకానూ ఆ గురులఘు క్రమాన్ని కలిగి ఉంటాయి - అంటే అవి దగ్గరి చుట్టాలన్న మాట ఖేలావృత్తానికి.

9, ఆగస్టు 2020, ఆదివారం

నారి

నారి.

ఏమయ్యా

రామయ్యా

నా మోక్షం

బేమాయే


నారి అంటే వింటినారి కాదండోయ్. నారీవృత్తం. నారి అంటే సంస్కృతంలో స్త్రీ అని. 

పాదానికి 3 అక్షరాలు. పొట్టి పద్యం. వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.

గురులఘుక్రమం UUU.  అంటే ఒక్క మ-గణం మాత్రం.

వినయము

వినయము.
శరణం
కరుణా
కర దా
శరథీ

కొనియా
డును రా
ముని నా
మనసే



ఈవినయ వృత్తానికి గురులఘుక్రమం IIU.  అంటే ఒక్క స-గణం ఒక పాదంగా సరిపోతుంది. పాదానికి మూడే ఆక్షరాలు. ప్రాస మాత్రం తప్పదు వృత్తం కాబట్టి.

ఈ వినయవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.

మృగి

మృగి.
ఏమైనా
నీమాటే
నామాటో
రామన్నా

దేవుడా
కావగా
రావె సీ
తావరా



మృగీ వృత్తానికి గురులఘుక్రమం UIU. అంటే పద్యపాదానికి మూడే అక్షరాలన్నమాట. భలే చిట్టివృత్తం. ఇంత చిన్న వృత్తానికీ ప్రాసగండం తప్పదు మరి. 

మృగము అన్న మాటకు జంతువు అని సాధారణార్ధం. లేడి అనేది విశేషించి చెప్పే‌ అర్ధం. అందుచేత మృగీ అంటే‌ ఏదైనా ఆడుజంతువు అని చెప్పటం‌ తప్పులేదు కాని ఆడులేడి అన్నది సరైన అర్ధం.

లేడు నడక ఎట్లా ఉంటుందో తెలుసుకదా. దుముకుతున్నట్లుగా ఉంటుదని వేరే చెప్పాలా. ఐతే అది అడులేడి ఐతే? ఆ దుముకుడు నడక కూడా కాస్త వయ్యారంగా ఉంటుందని ఊహించాలి. ఈ మృగీ వృత్తం నడక కూడా అలా నాలుగు దుముకులు వయ్యారంగా వేసినట్లు ఉంటుంది.

సింహరేఖ

సింహరేఖ.
రూపమా వినీలమేఘం    
చాపమా కృతాంతదండం
చూపులో కృపాప్రవాహం
తాపహారి రామతత్వం

       

ఇది భలే పొట్టివృత్తం. పాదానికి కేవలం 8 అక్షరాలే. దీనికి గణాలు ర - జ - గగ. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.

గురులఘుక్రమం ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే‌ మరొక రకంగా  చూస్తే    (U I) (U I) (U I) (U U ). అంటే  మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట.   ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే‌ త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!

శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం  బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.

      రామ రామా రామ రారా
      రామ రా మా రామ రారా
      రామ రా గారామ రారా
      రామ రా శ్రీ రామ రారా.

ఇందులో‌ పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం‌ ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం‌ మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం‌ ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో‌ ఒకసారి చూడవచ్చును.

ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం.  చిన్నపద్యంలో‌ రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ‌ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే‌ కావటం వలన ఈ‌ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.

ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ‌ ప్రయత్నించండి.

పాదపము

పాదపము.
వారినిధిల్ పొడిబారెడు దాకన్
తారలు నింగికి తప్పెడు దాకన్
వారిజమిత్రుని పంచత దాకన్
ధారుణి రామకథామృత ముండున్


ఈ పాదపం అనేది మరొక పొట్టి వృత్తం. పాదానికి 11 అక్షరాలు. దీనికి గణాలు భ - భ - భ - గగ అనేవి. యతిస్థానం 7వ అక్షరం.
ప్రబంధసాహిత్యంలో పింగళిసూరనగారి కళాపూర్ణోదయం నాలుగవ ఆశ్వాసం చివరి ఆశ్వాసాంత పద్యం చూడండి.

      మాన సుయోధన మంగళ నిత్యా
      నూన యశోధన యుజ్వల కృత్యా
      దాన సుబోధన ధర్మద కృత్యా
      దీన మహాధన దీపిత సత్యా

ఎమెస్కోవారిప్రతిలో పై పద్యాన్ని పొరపాటున తోటకము అని పేర్కొనటం జరిగింది. కాని పాదపవృత్తానికీ తోటకమనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

ఈ‌ పాదపవృత్తానికి  దోదక, తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక అనే నామాలు కూడా ఉన్నాయట! ఒక్క వృత్తానికి ఎన్ని పేర్లో, అందులోనూ తోటక వంటి వేరే లక్షణాలు కల వృత్తాలపేర్లూ కలుపుకోవటం. అంతా నానా కంగాళీగా ఉంది వృత్త నామాల పరిస్థితి చూస్తే.

ఆధునికులు శ్రీ నేమాని సన్యాసి రావు గారి పాదపవృత్తం శంకరాభరణం బ్లాగు ప్రత్యేకవృత్తాలు-3  టపా నుండి క్రింద చూపుతున్నాను.

      శ్రీరఘునందన! చిన్మయ! రామా!
      మారుతి సేవిత! మంగళధామా!
      వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
      క్ష్మారమణా! పర గర్వ విరామా!

ఈ పాదపవృత్తంలో వ్రాసిన పై పద్యాలలో అంత్యానుప్రాసను కూర్చటం గమనించండి.

నేను ఇక్కడ వ్రాసిన పద్యాన్ని పోలిన పద్యం ప్రాచీనమైనది ఒకటి ఉంది.

     యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
     యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
     యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
     తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో

కొంచెం పలుగురాళ్ళ పాకంలో ఉన్న ఈ పద్యం హనుమంతులవారు వ్రాసారని ప్రతీతి కల హనుమద్రామాయణం లోనిదట. ఆసక్తి కలవారు అర్థతాత్పర్యాలతో సహా ఈ పద్యం గురించి  శంకరాభరణం - చమత్కార పద్యాలు - 144 టపా ద్వారా తెలుసుకోవచ్చును.

సరే ప్రస్తుతం‌ ఈ‌ పాదపం‌ నడక దగ్గరకు వద్దాం. దీని నడక గణానువర్తిగా కనిపిస్తోంది. యతిస్థానం దగ్గర విరామం. ఇతరత్రా గణాంతాల్లో కించిల్లఘువిరామంగా చతురస్రగతిలో దీని నడక పొడచూపుతున్నది.

        వారిని - ధుల్పొడి - బారెడు - దాకన్
        తారలు -  నింగికి - తప్పెడు - దాకన్
        వారిజ - మిత్రుని - పంచత - దాకన్
        ధారుణి - రామక - థామృత - ముండున్

ఆసక్తి కలవారు ఈ‌ పాదపాలను కూడ సులభంగా సాధించవచ్చును. వీలైతే ప్రయత్నించండి.

శిఖరిణి

శిఖరిణి.
ధనాశన్ భూలోకంబున శుభదమౌ ధర్మము నెడన్
మనుష్యు ల్నిత్యంబున్ విముఖులగుచున్ మానక సదా
ఘనంబుల్పాపంబుల్ సలుపుదురయా కావగదవే
మనశ్చాంచల్యంబుల్ రఘుపతి వెసన్ మాన్పి కృపతో 



ఈ శిఖరిణవృత్తం కొంచెం‌గడ్డు పద్యమే అని చెప్పాలి. దీనిలో  గురువులూ లఘువులూ గుంపులుగా వచ్చేస్తాయి మరి. ఈ వృత్తం‌గణవిభజన  య - మ - న - స - భ - వ  అని. అంటే మొత్తం 17 అక్షరాలు.  యతిస్థానం 13వ అక్షరం. ఈ శిఖరిణీవృత్తంలో పాదానికి గురులఘువుల అమరిక ఇలా ఉంటుంది:

    I U U   U U U   I I I   I I U   U I I   I U
     
చూసారా? ఈ వృత్తంలో మొదట్లోనే ఐదుగురువులు వరసగా వస్తాయి. ఆ కష్టం చాల దన్నట్లు అ వెంటనే వరసపెట్టి ఐదు లఘువులు వస్తాయి.

సంస్కృతంలో ఐతే ఈ వృత్తంలో బండి లాగించెయ్యవచ్చునూ అనటానికి శంకరాచార్యులవారే సాక్షి. వారి అమోఘమూ అద్వితీయమూ ఐన సౌందర్యలహరీస్తోత్రం పూర్తిగా శిఖరిణీవృత్తాల్లోనే‌ ఉంది.

తెలుగులో‌ మాత్రం శిఖరిణీ స్తోత్రం వ్రాయటం కత్తిమీదసాము అనే చెప్పాలి.

అందుకనే తెలుగు కవులుశిఖరిణీ‌వృత్తాన్ని ఆదరించినట్లు కనిపించటం లేదు.

పండిత నేమాని సన్యాసిరావుగారి అధ్యాత్మ రామాయణము గ్రంథంలో నుండి ఒక శిఖరిణి

నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః

ఐతే తెలుగు గ్రంథంలోని ఒక సంస్కృతవృత్తమే‌ కాని ఇది తెలుగుపద్యం కాదు.  యతిప్రాసలను పాటించి తెలుగుపద్యం అనిపించుకోవటమే ఇక్కడ జరిగింది.

మన ప్రబంధకవులెవరైనా శిఖరిణీవృత్తాన్ని వాడారా అన్నది అనుమానమే.

ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ విశేష వృత్తము - 25 (శిఖరిణి) అన్న టపాలో చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:

     పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
     స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
     సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
     పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా! 

ఈ ప్రయత్నంలో శంకరయ్యగారు సఫలీకృతులనే చెప్పాలి.  సంబోధనాప్రథమా విభక్తి ద్వారా వచ్చిన దీర్ఘాక్షరాలు బాగానే సహాయ పడటాన్ని మనం గమనించవచ్చును. ఇంకెవరన్నా శిఖరిణీ వృత్తాలుప్రయత్నించారేమో తెలియదు.

8, ఆగస్టు 2020, శనివారం

పింగళ ఛందస్సు (అగ్నిమహాపురాణము నుండి)

 అగ్నిమహాపురాణం పుస్తకం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అనువాదం మనకు కామకోటి వారి సైట్లో‌ లభిస్తోంది. 

పుస్తకం ఛాప్టర్స్ పేజీని తెరచి మీరు  116వ చాప్టర్ నుండి 123వ ఛాప్టర్ వరకూ వివిధ ఛందస్సులను గురించి చర్చించబడింది.

అసక్తి కల వారు తప్పక చదవండి. ఆ పుస్తకంలో‌ సంస్కృతమూలమూ పుల్లెలవారి సరళమైన తెలుగు అనువాదమూ రెండూ ఉంటాయి.

స్వాగతం

స్వాగతం.
ధీవరుండు నిజ తేజ మెసంగన్     
దేవదుందుభుల దిక్కులు మ్రోయన్
దేవసంఘములు తీయగ పాడన్
రావణాసురుని రాము డడంచెన్

 
ఈ స్వాగతం అనే వృత్తానికి పాదానికి నాలుగే గణాలు. అవి ర - న - భ - గగ.  గురులఘుక్రమం UIUIIIUIIUU యత్తిస్థానం 7వ అక్షరం. పాదానికి కేవలం 11 అక్షరాలతో ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తం అన్నమాట.

ఈ స్వాగతవృత్తానికి ముందు మరొక గురువును చేర్చితే అది నీరాంతికం (U - UIUIIIUIIUU)  అవుతుంది. గురువుకు బదులుగా రెండు లఘువులను చేర్చితే అది కలహంస (II - UIUIIIUIIUU) అవుతుంది. సౌలభ్యం కోసం విడదీసి చూపాను.

రథోధ్దత వృత్తానికీ‌ ఈ‌ స్వాగతవృత్తానికి చాలా దగ్గరి చుట్టరికం. స్వాగతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIIUU ఐతే రథోధ్ధతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIUIU. చుట్టరికం చూడండి. స్వాగతంలో చివరన ఉన్న UU ను IU అని మార్చితే అది రథోధ్ధతం అవుతున్నది. 

ఈ వృత్తానికి పాదాంతంలో అనుప్రాసను కూర్చటం కూడా మనం చూడవచ్చును.

పింగళి సూరనగారి కళాపూర్ణోదయం ప్రబంధంలో తృతీయాశ్వాసం చివరన ఒక స్వాగతం ఇలా ఉంది:

      నిర్విరామ ధరణీ భర ణాంకా
      గర్వితారి జయకర్మ విశాంకా
      సర్వదిక్చర విశంకట కీర్తీ
      శర్వరీ రమణ సన్నిభ మూర్తీ

ఇక్కడి అంత్యానుప్రాసలను గమనించండి.

శ్రీ నేమాని సన్యాసిరావుగారి స్వాగత వృత్తం చూడండి:

     మౌనివర్య! జనమాన్య చరిత్రా!
     జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
     మాననీయ గుణ! మంగళదాతా!
     పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!

ఈ వృత్తంలో అంత్యానుప్రాసను పాటించలేదు నేమానివారు.

ఈ పద్యాన్ని ఉదాహరణగా స్వాగతవృత్తానికి ఇస్తూ‌ నేమాని వారు, ఇందులో మూడవపాదం చూడండి. ఇక్కడ మాననీయ గుణ! మంగళదాతా! అని ఉంది కదా దీనిని మాననీయ గుణ! మంగళాన్వితా అని మారిస్తే అది రథోధ్ధతం అవుతుంది అని అన్నారు.

ఇక ఈ‌స్వాగత వృత్తం‌ నడకను చూస్తే అది ఇలా ఉంటుంది.
 
ధీవ - రుండు - నిజ    -     తేజ మె - సంగన్    
దేవ - దుందు - భుల   -    దిక్కులు - మ్రోయన్
దేవ - సంఘ - ములు   -    తీయగ - పాడన్
రావ - ణాసు - రుని   -    రాము డ - డంచెన్

అంటే పద్యం‌ పూర్వార్ధ పరార్ధాలుగా యతిస్థానం దగ్గర సరిగ్గా మధ్యకు విరిగి, ఒక్కొక్కటీ ఎనిమిదేసి మాత్రల ప్రమాణంతో వస్తుం దన్నమాట. ఐతే పూర్వార్ధం 3+3+2 మాత్రలుగానూ 4 + 4 మాత్రలు గానూ నడకను చూపుతుంది. ఈ పద్యంలో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం ప్రారంభం కావటం‌ మంచిది. యతిస్థానం పదం‌ మధ్యలో పడితే అంత రక్తి కట్టక పోవచ్చును. కొంచెం‌ గమనికతో ఉండాలి.

కరేణువు

కరేణువు.
ప్రేమ లేదా నాపై
రామచంద్రా నీవే
తామసించే వేలా
యేమి శోధించేవో

కరేణువు అన్న పదానికి ఆడుయేనుగు అని అర్ధం . అటజని కంచె భూమిసురుడు అన్న పద్యంలో మనుచరిత్రకారులు పెద్దన గారు కరేణుకరకంపితసాలము శీతశైలమున్ అంటారు. ఇంకా కొండగోగుకు కూడా కరేణువు అన్న పేరుందని నిఘంటువుల్లో ఉంది.

అదటుంచి ఈ‌ కరేణు వృత్తంలో పాదానికి 6 అక్షరాలు.  గురులఘుక్రమం UIUUUU. సంప్రదాయికమైన పధ్ధతిలో కరేణువృత్తానికి ర-మ అనేది గణవిభజన అని చెబుతారు

మరికొన్ని వృత్తాల్లో ఈ‌ కరేణువృత్తం యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది అంతర్భాగంగా. అవేవో‌ ఒకసారి చూదాం.   

  1
కరేణుః 6 UIUUUU
  2
నిమ్నాశయా 7 U -  UIUUUU
  3
పద్యా 7 I -  UIUUUU
  4
సిరవీ 7 UIUUUU  - U
  5
సుమోహితా 7 I -  UIUUUU
  6
భూమధారీ 8 IU -  UIUUUU
  7
మౌలిమాలికా 8 UI -  UIUUUU
  8
యుగధారి 8 II -  UIUUUU
  9
ధూమ్రాలీ 10 IU -  UIUUUU -  UU
10
నీరోహా 10 IIU -  UIUUUU -  U
11
నిర్మేధా 10 IIIU  -  UIUUUU
12
ఆరాధినీ 11 U -  UIUUUU -  UUUU
13
అమాలీనమ్ 11 IU -  UIUUUU -  UUU
14
అమోఘమాలికా 11 IUIUI -  UIUUUU
15
అపయోధా 11 IIU -  UIUUUU -  UU
16
జాలపాదః 11 U -  UIUUUU -  IUUU
17
కులచారిణీ 11 UIUI -  UIUUUU - U
18
లక్షణలీలా 11 UIIU -  UIUUUU -  U
19
లలితాగమనమ్ 11 IIUII -  UIUUUU
20
వల్లవీవిలాసః 11 UIUIU -  UIUUUU
21
వికసితపద్మావలీ 11 IIIIU -  UIUUUU
22
విలులితమఞ్జరీ 11 IIII -  UIUUUU -  U
23
దోర్లీలా 12 IIUII -  UIUUUU - U
24
కింశుకాస్తరణమ్ 12 UIUII -  UIUUUU -  U
25
వీణాదణ్డమ్ 12 IUIII -  UIUUUU  - U
26
విశాలాంభోజాలీ 12 UUIII -  UIUUUU - U
27
కలాధామమ్ 13 UIIUIII -  UIUUUU
28
లలితపతాకా 14 IIIIIUIU - UIUUUU
29
వింధ్యారూఢమ్ 14 UUU -  UIUUUU - UUIUU
30
జ్హిల్లీలీలా 19 IIIIUUUUUUUUI -  UIUUUU
31
అశోకలోకః 21 UUUUUUUUUUUUUUI -  UIUUUU
32
మందాక్షమందరమ్ 21 IIIIIIUUUUUUIUI -  UIUUUU
33
భీమాభోగః 22 UUUUUIU -  UIUUUU - UUUIUUIUU
34
వంశలోన్నతా 24 UIUIUI -  UIUUUU - UUUIUI -  UIUUUU
35
ఆభాసమానమ్ 26 IUUIUUIU -  UIUUUU -  IUUIUUIUUIUU
36
విశ్వవిశ్వాసః 26 UUUIUUIUUIUU -  UIUUUU - UUIUUIUU

చూసారా పెద్ద పట్టియే ఉంది. ఈ పట్టీ గురించి చిత్రకవిత్వం చెప్పేవాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది.

 ఈ‌ పద్యం‌ నడక గురించి. పాదంలో ఉండేవి ఆరు అక్షరాలే. ఇవి మూడు ఖండాలుగా విరుగుతున్నాయి. రెండేసి అక్షరాల కొక ఖండంగా.  పాదంలో‌ ఉన్న పదకొండు మాత్రలూ 3 + 4 + 4 అన్నట్లు వస్తున్నాయి. పై ఉదాహరణను పరిశీలించండి.

ప్రేమ - లేదా - నాపై
రామ - చంద్రా - నీవే
తామ - సించే - వేలా
యేమి - శోధిం - చేవో

ఇలా ఈ‌ కరేణువు నడక పేరుకు తగ్గట్టుగా కొంచెం‌ ఠీవిగానే ఉంది.  ఐతే ఈ‌నడక తిన్నగా రావాలీ అంటే ప్రతి ఖండం వద్దనూ‌ పదం విరగాలి. అది ప్రతిసారీ అంత సులభం‌ కాక పోవచ్చును. కాని వీలైనంత వరకూ అలా వస్తే ఈపద్యం అందగిస్తుంది.

ఈ‌పద్యం నడక మరొక విధంగా ఉండవచ్చునా అన్న ప్రశ్న వస్తుంది. పాదాన్ని సమద్విఖండనం చేస్తూ కూడా నడక బాగానే ఉండవచ్చును.

ప్రేమ లే  -  దా నాపై
రామచం  -  ద్రా నీవే
తామసిం  -  చే వేలా
యేమి శో  -  ధించేవో

ఏ సందర్భానికి పద్యానికి ఏనడక నప్పుతుందో గమనించి కవి అలా వ్రాయవచ్చును. కాని కవి ఏ లయనూ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం లఘుగురుక్రమం ఒప్పుకొనేలా అక్షరాలను పేర్చుతూ‌ పోయి, ఆమ్మయ్య పద్యం వచ్చింది అనుకుంటే మాత్రం ఆ పద్యం కళ కట్టే అవకాశం బాగా తక్కువే. ఈ సంగతి పద్య ఛందస్సు ఏదైనా సరే వర్తిస్తుంది.