8, ఆగస్టు 2020, శనివారం

కరేణువు

కరేణువు.
ప్రేమ లేదా నాపై
రామచంద్రా నీవే
తామసించే వేలా
యేమి శోధించేవో

కరేణువు అన్న పదానికి ఆడుయేనుగు అని అర్ధం . అటజని కంచె భూమిసురుడు అన్న పద్యంలో మనుచరిత్రకారులు పెద్దన గారు కరేణుకరకంపితసాలము శీతశైలమున్ అంటారు. ఇంకా కొండగోగుకు కూడా కరేణువు అన్న పేరుందని నిఘంటువుల్లో ఉంది.

అదటుంచి ఈ‌ కరేణు వృత్తంలో పాదానికి 6 అక్షరాలు.  గురులఘుక్రమం UIUUUU. సంప్రదాయికమైన పధ్ధతిలో కరేణువృత్తానికి ర-మ అనేది గణవిభజన అని చెబుతారు

మరికొన్ని వృత్తాల్లో ఈ‌ కరేణువృత్తం యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది అంతర్భాగంగా. అవేవో‌ ఒకసారి చూదాం.   

  1
కరేణుః 6 UIUUUU
  2
నిమ్నాశయా 7 U -  UIUUUU
  3
పద్యా 7 I -  UIUUUU
  4
సిరవీ 7 UIUUUU  - U
  5
సుమోహితా 7 I -  UIUUUU
  6
భూమధారీ 8 IU -  UIUUUU
  7
మౌలిమాలికా 8 UI -  UIUUUU
  8
యుగధారి 8 II -  UIUUUU
  9
ధూమ్రాలీ 10 IU -  UIUUUU -  UU
10
నీరోహా 10 IIU -  UIUUUU -  U
11
నిర్మేధా 10 IIIU  -  UIUUUU
12
ఆరాధినీ 11 U -  UIUUUU -  UUUU
13
అమాలీనమ్ 11 IU -  UIUUUU -  UUU
14
అమోఘమాలికా 11 IUIUI -  UIUUUU
15
అపయోధా 11 IIU -  UIUUUU -  UU
16
జాలపాదః 11 U -  UIUUUU -  IUUU
17
కులచారిణీ 11 UIUI -  UIUUUU - U
18
లక్షణలీలా 11 UIIU -  UIUUUU -  U
19
లలితాగమనమ్ 11 IIUII -  UIUUUU
20
వల్లవీవిలాసః 11 UIUIU -  UIUUUU
21
వికసితపద్మావలీ 11 IIIIU -  UIUUUU
22
విలులితమఞ్జరీ 11 IIII -  UIUUUU -  U
23
దోర్లీలా 12 IIUII -  UIUUUU - U
24
కింశుకాస్తరణమ్ 12 UIUII -  UIUUUU -  U
25
వీణాదణ్డమ్ 12 IUIII -  UIUUUU  - U
26
విశాలాంభోజాలీ 12 UUIII -  UIUUUU - U
27
కలాధామమ్ 13 UIIUIII -  UIUUUU
28
లలితపతాకా 14 IIIIIUIU - UIUUUU
29
వింధ్యారూఢమ్ 14 UUU -  UIUUUU - UUIUU
30
జ్హిల్లీలీలా 19 IIIIUUUUUUUUI -  UIUUUU
31
అశోకలోకః 21 UUUUUUUUUUUUUUI -  UIUUUU
32
మందాక్షమందరమ్ 21 IIIIIIUUUUUUIUI -  UIUUUU
33
భీమాభోగః 22 UUUUUIU -  UIUUUU - UUUIUUIUU
34
వంశలోన్నతా 24 UIUIUI -  UIUUUU - UUUIUI -  UIUUUU
35
ఆభాసమానమ్ 26 IUUIUUIU -  UIUUUU -  IUUIUUIUUIUU
36
విశ్వవిశ్వాసః 26 UUUIUUIUUIUU -  UIUUUU - UUIUUIUU

చూసారా పెద్ద పట్టియే ఉంది. ఈ పట్టీ గురించి చిత్రకవిత్వం చెప్పేవాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది.

 ఈ‌ పద్యం‌ నడక గురించి. పాదంలో ఉండేవి ఆరు అక్షరాలే. ఇవి మూడు ఖండాలుగా విరుగుతున్నాయి. రెండేసి అక్షరాల కొక ఖండంగా.  పాదంలో‌ ఉన్న పదకొండు మాత్రలూ 3 + 4 + 4 అన్నట్లు వస్తున్నాయి. పై ఉదాహరణను పరిశీలించండి.

ప్రేమ - లేదా - నాపై
రామ - చంద్రా - నీవే
తామ - సించే - వేలా
యేమి - శోధిం - చేవో

ఇలా ఈ‌ కరేణువు నడక పేరుకు తగ్గట్టుగా కొంచెం‌ ఠీవిగానే ఉంది.  ఐతే ఈ‌నడక తిన్నగా రావాలీ అంటే ప్రతి ఖండం వద్దనూ‌ పదం విరగాలి. అది ప్రతిసారీ అంత సులభం‌ కాక పోవచ్చును. కాని వీలైనంత వరకూ అలా వస్తే ఈపద్యం అందగిస్తుంది.

ఈ‌పద్యం నడక మరొక విధంగా ఉండవచ్చునా అన్న ప్రశ్న వస్తుంది. పాదాన్ని సమద్విఖండనం చేస్తూ కూడా నడక బాగానే ఉండవచ్చును.

ప్రేమ లే  -  దా నాపై
రామచం  -  ద్రా నీవే
తామసిం  -  చే వేలా
యేమి శో  -  ధించేవో

ఏ సందర్భానికి పద్యానికి ఏనడక నప్పుతుందో గమనించి కవి అలా వ్రాయవచ్చును. కాని కవి ఏ లయనూ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం లఘుగురుక్రమం ఒప్పుకొనేలా అక్షరాలను పేర్చుతూ‌ పోయి, ఆమ్మయ్య పద్యం వచ్చింది అనుకుంటే మాత్రం ఆ పద్యం కళ కట్టే అవకాశం బాగా తక్కువే. ఈ సంగతి పద్య ఛందస్సు ఏదైనా సరే వర్తిస్తుంది.


3 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఈ వ్యాసాన్ని సంస్కరించవలసి ఉందండీ. ఇవన్నీ చాలావరకు ఇంతవరకు ఎవరూ పట్టించుకోని వృత్తాలు. వీటి నడకలు తెలియదు. తెలుసుకోవాలి. అంటే ప్రతి దాని గురించీ తపస్సు చేయాలి. అప్పుడు కాని వీటి నడకలు బోధఫడవు. దీని నడక ఏమిటీ ఇలా ఉందీ అని మథనపడగా మెల్లగా అది గోచరించింది. వ్యాసంలో మార్పులు చేస్తాను తొందరలోనే.

      తొలగించండి
    2. వ్యాసాన్ని సంస్కరించాను. చదువరులు మార్పులను గమనించగలరు. నడకను గుర్తించితే పద్యం ఎంతగా శోభిస్తుందో కూడా గమనించగలరు.

      తొలగించండి