ఉత్కృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉత్కృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఆగస్టు 2020, శుక్రవారం

మంగళమహాశ్రీ

మంగళమహాశ్రీ
లోకమున నెల్లపుడు లోకులకు సాజములు లోపములు పాపములు నీవే
మా కలిమి మా బలిమి మా తెలివి మా బ్రతుకు మా జయము మా యపజయంబుల్
మా కలలు నీ యెడల మాకు గల ప్రేమలును మా భయము లన్నిటిని రామా
నీ కరుణతో నరసి నిర్భయత మాకొసగి నీ దరికి చేర్చుకొన వయ్యా

ఈ మంగళమాహాశ్రీ వృత్తం చాలా పొడుగైన పాదాలున్న వృత్తం. పాదానికి ఏకంగా 26 అక్షరాలుంటాయి.

సంప్రదాయికమైన గణవిభజన ప్రకారం ఐతే దీని గణాలు  భ - జ - స - న - భ - జ - స - న - గగ .  కాని ఇలా గణవిభజన చూపటం వలన ఈ మంగళమహాశ్రీ వృత్తం నడక అస్సలు సులభగ్రాహ్యంగా ఉండదు. ఇది ముఖ్యంగా ఒక లయ  ప్రథానమైన వృత్తం. దీని నడకను అనుసరించి గణవిభజన ఇలా ఉంటుంది:

   భల - భల - భల - భల - భల - భల - గగ

ఇక్కడ 'భల' అంటే భగణం పైన ఒక లఘువు (U I I I) గా ఒక నాలుగక్షరాల గణం. 6 సార్లు 'భల' గణమూ ఆపైన ఒక గగ (U U) ఉంటాయి మంగళమహాశ్రీ ప్రతి పాదం లోనూ.

వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉందని మళ్ళా వేరుగా ఎంచి చెప్ప నక్కర లేదు.  ఈ  మంగళమహాశ్రీ వృత్తానికి 9వ అక్షరమూ,  17వ అక్షరమూ దగ్గర అంటే మొత్తం మీద రెండు యతిస్థానా లున్నాయి.   రెండు స్థానాల్లోనూ యతిమైత్రి పాటించాలి. ఏదో ఒకచోట అని ఐఛ్చికం ఏమీ లేదు. అది విశేషంగా గుర్తుపెట్టుకోవాలి.  యతి స్థానాలను చూపుతూ దీని విభజన  (భల - భల)  (భల - భల)   (భల - భల)  (గగ) అని నాలుగు  ఖండాలుగా చెప్పుకోవాలి.

ఈ వృత్తాన్ని పొడుగుపొడుగు పాదాల్లో చదవటం‌ కన్నా పఠన సౌలభ్యం కోసం విరచి వ్రాయటం‌ బాగుంటుంది.
ఒకపధ్ధతిలో

  భల - భల - భల
  భల - భల - భల - గగ

అని పాదాన్ని రెండు ఖండాలుగా వ్రాయటం ఉంది.  రెండు ఖండాలుగా పాదాన్ని విరచితే పద్యం ఎనిమిది లైనులలో వస్తుంది. అలాకాక మరింత సొంపుగా అధునాతనంగా వ్రాయవచ్చును

  భల - భల
  భల - భల
  భల - భల - గగ

ఇలా ప్రతి యతిస్థానం దగ్గరా విరచి వ్రాయటంతో ఒక సొగసు వస్తుంది. చదవటానికీ‌ చాలా బాగుంటుంది. కాని పద్యం దీర్ఘంగా  పన్నెండు లైనుల్లో వస్తుంది. కాని చదవటానికి బాగుంటుంది కదా.

స్వర్గీయ పండిత నేమాని సన్యాసి రావుగారు  వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం చూడండి.

      మంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా!
      మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా!
      మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా!
      మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!

ఈ మనోహరమైన పద్యాన్ని వారు  శంకరాభరణం బ్లాగులో ఒకటపాలో  వ్రాసారు.  ఇది పద్యం లక్షణాన్నీ నడకనూ చక్కగా పట్టి చూపుతూ ఉండటం కారణంగా దీన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే అన్ని పాదాల్లోనూ ప్రథమాక్షరం 'మం' అలాగే అన్ని యతిస్థానాల్లోనూ దానికి మైత్రికి నిలిపిన అక్షరం కూడా 'మం'  అందుచేత యతిమైత్రి మహబాగా కుదురుతుంది. నిజానికి ఆ అన్నిచోట్లా ఉన్నది 'మంగళము' అన్న పదమే. ఎవరికైనా న్యాయంగా ఒక సందేహం రావాలి. అదేమిటండీ పద్యంలో ఒకేమాటను మళ్ళా రెండోసారి వాడితే 'పునరుక్తి' (మళ్ళా చెప్పటం) అనే పెద్దదోషం కదా నేమాని వారు అలా ఎలా అంత పునరుక్తిని ఎలా చేసారూ అని.  సమాధానం ఏమిటంటే భక్తి కవిత్వంలో మాత్రం పునరుక్తి దోషం లేదు అని.  ఈ మాట మరెవరికైనా ఉపయోగించ వచ్చునేమో అన్న అభిప్రాయంతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మాట వరసకు  మధురాష్తకం  చూడండి.  ఆ మధురం అన్న మాట భలేగా తేపతేపకూ వస్తూనే ఉంటుంది. అది సాభిప్రాయమూ - ఆస్తోత్రానికి అందమూ కూడా. అలాగే ఈ పద్యానికి 'మంగళము' అన్న మాట సాభిప్రాయమూ అన్నది కూడా అందరమూ గ్రహించాలి.

అందమైన ప్రబంధం పారిజాతాపహరణంలో ఆఖరి పద్యం ఒక మంగళమహాశ్రీ. దాన్ని చూడండి.

     చిత్తజభి దంఘ్రియుగ చింతన కళాధిగత జిష్ణుసమ వైభవ విశేషా
     విత్తరమ ణామరగవీ తరణిభూ జలద విశ్రుత కరాంబురుహ గోష్ఠీ
     నృత్త మణిరంగతల నీతిమనురాజనిభ నిర్భరదయారస పయోధీ
     మత్తగజయూథ మదమగ్నసుఖితాళిరవ మాన్యగృహ మంగళమహాశ్రీ

చివరగా మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులు గారు వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం ఒకటి.

     పాడి రటఁ దుంబురుఁడు పావనియు శ్యామలయు వాణియును రాణ దనరంగా
     నాడి రొగి నుర్వశియు నాదటను రంభ శివుఁ డంతటను భృంగియు నెసంగన్
     గూడి రమరుల్ మునులు గుంపులుగ మానవుల కోటులన నెంత పువువానల్
     పోఁడిగను బెండ్లి యది భూదివులు మెచ్చఁగను బొల్పెసఁగె మంగళమహాశ్రీ

ఆశ్వాసాంతంలో వ్రాసే మంగళమహాశ్రీల చివరన మంగళమహాశ్రీ అని మంగళానుశాసనం చేయంటం బ్రహ్మాండంగా ఉంటుంది కదా.

ఇక నేను పైన వ్రాసిన పద్యాన్ని ఆధునిక ధోరణిలో పాదవిభన చేసి వ్రాస్తే ఎలా వస్తుందో చూదాం.

          లోకమున నెల్లపుడు
          లోకులకు సాజములు
          లోపములు పాపములు నీవే
      
          మా కలిమి మా బలిమి
          మా తెలివి మా బ్రతుకు
          మా  జయము మా యపజయంబుల్
      
          మా కలలు నీ యెడల
          మాకు గల ప్రేమలును
          మా భయము లన్నిటిని రామా
      
          నీ కరుణతో నరసి
          నిర్భయత మాకొసగి
          నీ దరికి చేర్చుకొన వయ్యా

 ఇలాచూస్తే ఈ మంగళమహాశ్రీ అస్సలు భయపెట్టటం లేదు కదూ. ఇదంతా ఒక ఆధునిక కవిత లాగే‌ కనిపిస్తోంది కదూ. ఒక పద్యమే ఒక చిన్న కవిత ఐపోయింది. చదవటానికి కూడా చాలా బాగుంది. ఇలా కంటికింపుగా ఉంటుంది. చెవికి కూడా చాలా ఇంపైన పద్యం ఇది.  మీరూ‌ కొన్ని మంగళమహాశ్రీ వృత్తాలను వ్రాయటానికి ప్రయత్నించండి.