4, ఆగస్టు 2020, మంగళవారం

వృత్త ఛందస్సుల పేర్లు


వృత్త ఛందస్సులు మొత్తం  26.
  1. ఉక్త
  2. అత్యుక్త
  3. మధ్య
  4. ప్రతిష్ఠ
  5. సుప్రతిష్ఠ
  6. గాయత్రి
  7. ఉష్ణిక్కు
  8. అనుష్టుప్పు
  9. బృహతి
  10. పంక్తి
  11. త్రిష్టుప్పు
  12. జగతి
  13. అతిజగతి
  14. శక్వరి
  15. అతిశక్వరి
  16. అష్టి
  17. అత్యష్టి
  18. ధృతి
  19. అతిధృతి
  20. కృతి
  21. ప్రకృతి
  22. అకృతి
  23. నికృతి
  24. సంకృతి
  25. అతికృతి
  26. ఉత్కృతి
వీటి పేర్లు చూసారుగా.

ఎన్నవ సంఖ్య కల ఛందస్సులో అన్నేసి అక్షరాలుంటాయి పాదానికి.

 9వ దైన బృహతీ ఛందస్సులో  29 = 512 వృత్తాలుంటాయి.
10వ దైన పంక్తి ఛందస్సులో  210 = 1024 వృత్తాలుంటాయి.
11వ దైన త్రిష్టుప్ ఛందస్సులో  211 = 2048 వృత్తాలుంటాయి.
12వ దైన జగతీ ఛందస్సులో  212 = 4096 వృత్తాలుంటాయి.
13వ దైన అతిజగతీ ఛందస్సులో  213 = 8192 వృత్తాలుంటాయి.

ఒకటవ దైన ఉక్త ఛందస్సులో  2 వృత్తాలు ఏర్పడతాయి.
రెండవ దైన  అత్యుక్తఛందస్సులో 4 వృత్తాలు ఏర్పడతాయి.
మూడవ దైన మధ్య ఛందస్సులో 8 వృత్తాలు ఏర్పడతాయి.

మొదటి రెండు అనగా ఉక్త అత్యుక్తలలో ఏర్పడే మొత్త వృత్తాల సంఖ్య 2 + 4 = 6. ఇది 23 కన్నా 2 తక్కువ.
మొదటి మూడు అనగా ఉక్త, అత్యుక్త, మధ్య ఛందస్సులలో ఏర్పడే మొత్తం వృత్తాల సంఖ్య 2 +4 + 8 = 14. ఇది 24 కన్నా 2 తక్కువ.

ఈ విధంగా లెక్కిస్తూ‌పోతే, మొత్తం ఈ‌ 26 ఛందస్సుల్లోనూ‌ అన్నీ‌ కలిపి 227 - 2 = 13,42,17,726  వృత్తాలు ఏర్పడతాయి.

సంస్కృతవృత్తాలలో ఐతే ఆ వృత్తాల పాదాలు లఘువుతో‌ ఐనా గురువుతో‌ ఐనా సరే పూర్తి కావచ్చును. కాని తెలుగులో వృత్తాల పాదాలు కచ్చితంగా గురువుతోనే పూర్తి కావలసి ఉంటుంది. అందుచేత తెలుగు భాషలో వినియోగానికి పనికి వచ్చే వృత్తాల సంఖ్య ఎంతవుతుందీ, అన్ని ఛందస్సులలోనూ‌ కలిపి మొత్తం మీద అంటే ఆ సంఖ్య 13,42,17,726 / 2 = 67108863  అవుతుంది.

లక్షణగ్రంథాల్లో వృత్తాలను గురించి వివరించేటప్పుడు అది ఎన్నవ ఛందస్సులో ఎన్నవ వృత్తమో అన్నది చెప్తూ ఉంటారు. ఉదాహరణకు కృతి ఛందమునకు చెందిన 355799 వ వృత్తము అని చెప్తారు. ఇక్కడ ఛందస్సు కృతి అంటే పాదానికి 20 అక్షరాలుంటాయన్న మాట. ఆ కృతి ఛందస్సులో 355799వ వృత్తం అని చెప్పారు కదా. ఆ సంఖ్యను బట్టి ఉత్పలమాల యొక్క గురువుల లఘువుల అమరిక అదే గురులఘుక్రమం విస్పష్టంగా తెలుసుకో వచ్చును.

ఇలా ఈ‌ అనేక ఛందస్సుల్లో మొత్తం‌ మీద కోట్ల కొలదీ  వృత్తాలు ఏర్పడుతూ ఉన్నా నిజానికి వాడుకలో ఉన్నవి చాలా స్వల్పసంఖ్యలో ఉన్నాయి.

ఏ గురులఘువుల అమరిక ఐనా సరే ఏదో ఒక ఛందస్సులో ఏదో ఒక వృత్తం కావచ్చును. అంతమాత్రం చేత విశేషం ఏమీ ఉండదు. ఆ గురులఘుక్రమంలో పద్యం చెప్తే దానిలో ఒక లయ ఒక తూగు వచ్చేలా ఉంటేనే‌ అది కవులు వాడుక చేస్తారు. అలా ఎక్కువ మంది వాడుక చేసినవే అందరి మన్ననా పొంది ఉత్తరోత్తరా వచ్చే కవులూ వాడుక చేస్తారు. అందుకనే వాడుకలో ఉండేవి స్వల్పసంఖ్యలో ఉన్నాయి వృత్తాలు.

కొందరు కవులు అప్పుడప్పుడు అప్పటి వరకూ ప్రచారంలో లేని గురులఘుక్రమంతో కొత్త వృత్తాలను ముందుకు తీసుకొని వస్తారు. వారి కారణాలు వారి కుంటాయి. ఒక్కోసారి వారి ఉత్సాహం కూడా కారణం కావచ్చును!

ఐనా అలా కొత్తగా పుట్టుకొని వచ్చే వృత్తాలు కవిజనామోదం పొందాలనీ తరువాతి తరాల కవులు వాడతారనీ నమ్మకం లేదు. ఎవర్ గ్రీన్‌గా వెలిగేవి కేవలం కొన్నే!

ఒక చిన్న ముఖ్య గమనిక. ఇంతవరకూ మనం వృత్తాలూ వృత్తాలూ అంటున్నవి సాంకేతికంగా సమవృత్తాలు. అంటే మరేమీ లేదు. ఈ వృత్తాలన్నింటికీ నాలుగుపాదాలకూ లక్షణం సమానంగా ఉంటుంది. అన్ని పాదాల్లోనూ‌ గురులఘువుల క్రమం ఒక్కటే. అందుకే వీటిని సమవృత్తాలు అంటారు.

ఇంకొక రకం వృత్తాలున్నాయి అవి అసమవృత్తాలు అనవచ్చును. కాని వాటికి ప్రచారంలో ఉన్న పేరు విషమవృత్తాలు. అంటే విషమవృత్తాల్లో బేసి (అంటే ఒకటవ, మూడవ) పాదాల్లో ఒకరకం గురులఘువుల క్రమం ఉంటుంది. సరి (అంటే రెండవ, నాల్గవ) పాదాల్లో మరొక రకంగా గురులఘువుల క్రమం‌ ఉంటుంది.

ఉదాహరణకు అజిత ప్రతాపము అని ఒక వృత్తం ఉంది. దానిలో స, జ, స, స అని బేసి పాదాలకూ, న, భ, జ, భ అని సరిపాదాలకూ గణవిభజన. విషమంగా ఉండటం తెలుగు కవులు చూడనిది కాదు. మన ఆటవెలదికి కూడా సరిపాదాలకూ బేసిపాదాలకు లక్షణం వేరువేరుగా ఉంది కదా.

సమవృత్తాల గురించి ఎంతో చెప్పుకున్నాం. అన్ని ఛందస్సులలోనూ‌మొత్తం మీద మహా ఐతే ఇన్ని వృత్తాలు ఏర్పరచవచ్చును అని కూడా చెప్పుకున్నాం.

కాని అసమవృత్తాలు అదేనండీ విషమవృత్తాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటే‌ పరిస్థితి అంతా మారి పోతుంది. సాంకేతికంగా లెక్కవేసి చెప్పటం సాధ్యమే‌ కావచ్చును కాని మనం ఆ సంఖ్యను సరదాగా అనంతం అని చెప్పుకోవచ్చును అన్నమాట.

వేద వాంగ్మయం విషయంలో, అనంతా వై వేదాః అని అన్నట్లే ఛందస్సుల విషయం తీసుకొని అనంతా వై వృత్తాః అని చెప్పవచ్చును. అన్నట్లు ఛందం అంటే వేదం అన్న అర్ధం కూడా ఉందండోయ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి