లఘువృత్తాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లఘువృత్తాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2020, మంగళవారం

చిత్రపదము

చిత్రపదము
రాముని నమ్మిన వాడా
నీమము దప్పని వాడా
స్వామియె తోడుగ లేడా
కామిత మీయగ రాడా


ఈ చిత్రపదం పాదానికి 8 అక్షరాలుండే చిన్న వృత్తం. గురులఘుక్రమం UIIUIIUU. అంటే దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని.  వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఈ చిత్రపద వృత్తం‌ పాదానికి ముందు ఒక లఘువునీ చివర్న ఒక గురువునీ తగిలిస్తే అది ఇంద్ర వృత్తం అవుతుంది. ఈ చిత్రపదం ముందు రెండు గురువులు తగిలిస్తే అది ప్రసర వృత్తం అవుతుంది. రెండు సరిపోవండీ అని నాలుగు గురువులు తగిలిస్తారా అది కాసారక్రాంత వృత్తం అవుతుంది. అబ్బే గురువు లెందుకండీ బరువులూ అంటారా? చిత్రపదం పాదం మొదట రెండు లఘువులు తగిలించండి. అది ఉదితం అనే వృత్తం అవుతుంది. ఆపైన పాదం చివర్న ఒక గురువునూ తగిలిస్తారా అప్పుడది విష్టంభం అనే వృత్తం అవుతుంది. చిత్రపదం పాదారంభంలో‌ ఒక భ-గణం తగిలిస్తారా? అప్పుడు అది దోధక వృత్తం అవుతుంది. పోనీ‌ స-గణం తగిలిస్తారా, అప్పుడది రోధక వృత్తం అవుతుంది.  మొదటేమీ వద్దండీ అని చిత్రపదం చివర్న ఒక స-గణం తగిలిస్తారా? అప్పుడు అది కలస్వనవంశం అనే వృత్తం అవుతుంది. ఇలా చాలానే చుట్టరికాలు చూడవచ్చును దీనికి.

ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.

     భక్త జనావన దక్షా
     ప్రాక్తన శాసన పక్షా
     యుక్త విచారణ దీక్షా
     సక్త మహేశ్వర రక్షా

ఈ చిత్రపదం నడకను చూస్తే చివరి రెండు గురువుల ముందు కొంచెం విరుపు కనిపిస్తోంది.
ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.

10, ఆగస్టు 2020, సోమవారం

మణిరంగం

మణిరంగం.      
శ్యామలాంగ వియచ్చరపూజ్యా
రామచంద్ర సురారివిరోధీ     
నామనంబున నమ్మితి నయ్యా
ప్రేమ నేలవె వేదసువేద్యా


ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం. పాదానికి 10 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం UIUIIUIIUU.  గణవిభజన ర - స - స - గ . యతిస్థానం 6వ అక్షరం. వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం ఉంది.

నడక ప్రకారం దీని  గురులఘుక్రమం UIUII - UIIUU అన్నట్లు ఉంటుంది.  సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో. పాదంలో ఉన్నవి 14 మాత్రలు. సరిగా 7 మాత్రల తరువాత పాదం విరుగుతుం దన్నమాట సమంగా.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.

    శ్యామ లాంగ వి - యచ్చర పూజ్యా
    రామ చంద్ర సు - రారివి రోధీ
    నామ నంబున - నమ్మితి నయ్యా
    ప్రేమ నేలవె - వేదసు వేద్యా
      
మణిరంగ వృత్తంలో నేమాని రామజోగి సన్యాసిరావు గారి శివస్తుతి పద్యం.
    పార్వతీపతి పాపవిదారా
    సర్వరక్షక సౌఖ్యవిధాతా
    శర్వ ధూర్జటి శంకర దేవా
    గర్వ నాశక కామిత మీవా      

ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.

భద్రకము / భద్రిక

భద్రకం.
రాముడా యతడు దేవుడే
ఏమి సందియము లేదులే
భూమిపై నిలుప ధర్మమున్
స్వామి తా నిలకు వచ్చెలే



ఈ‌ భద్రకం అనే చిట్టిపొట్టి వృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIU. గణవిభజన  ర - న -ర. అంటే‌పాదానికి 9 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిస్థానం ఉండదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంటుంది.  ఈ‌ పద్యం నడక గణాంతాల్లో విరుపుతో ఉంటుంది.

ఈ భద్రకవృత్తానికి భద్రిక అనే పేరు కూడా  ఉంది.

నాకు తెలిసి పూర్వకవి ప్రయోగాలు లేవు.

పై పద్యంలో నేను సరిపాదాలకు అంత్యప్రాసను కూర్చాను.  కాని నియతంగా అంత్యప్రాసాదులు వాడవలసిన పని లేదనే అనుకుంటాను.

ఈ‌భద్రకం నడకను చూస్తే ఇది UIUIII - UIU అన్నట్లుగా ఉంది అంటే పాదాంతం లోని ర-గణం ముందు చిన్న విరుపు ఉందన్నమాట. 

రాముడా యతడు  - దేవుడే
ఏమి సందియము  - లేదులే
భూమిపై నిలుప  - ధర్మమున్
స్వామి తా నిలకు  - వచ్చెలే

భద్రకాలు వ్రాయటం సులువు గానే కనిపిస్తోంది.

వీలైతే మీరూ‌ కొన్ని భద్రకాలు వ్రాయండి.

అర్ధకళ

అర్ధకళ.
నిరవద్యగుణాభరణా
సురసేవిత శ్రీచరణా
ధరణీతనయారమణా
విరతాఖిలదైత్యగణా



ఈ చిన్నారి వృత్తానికి పాదానికి 9 అక్షరాలు. గురులఘుక్రమం IIUIIUIIU. అంటే, పాదానికి గణాలు స - స - స. యతిమైత్రి స్థానం అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు. పై పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.

ఈ అర్ధకళ తోటకాన్నుండి పుట్టినట్టు చెప్పవచ్చును. తోటకం గణాలు స - స - స - స. వీటిలో నుండి ఒక స-గణం తగ్గిస్తే అది అర్ధకళ అవుతుంది. ఈ అర్ధకళకు ఎడాపెడా తలొక గురువునూ‌ తగిలిస్తే అది దోధక వృత్తం అవుతుంది.

ఒకటా రెండా, ఏకంగా డభై పైన వృత్తాల్లో ఈ‌అర్ధకళ ఇమిడిపోతుంది.

ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.

ఈ అర్ధకళ నడకను  చూస్తే 5 అక్షరాల తరువాత విరుపు కనిపిస్తోంది. అంటే  IIUII - UIIU అన్నట్లు. అంటే మాత్రాపరంగా పాదంలో సమద్విఖండనం‌ చూపుతున్నది.

నిరవద్యగు - ణాభరణా
సురసేవిత - శ్రీచరణా
ధరణీతన - యారమణా
విరతాఖిల - దైత్యగణా

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉదాహరణకు ఇచ్చిన ఈపద్యంలో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.

ఖేల

 ఖేల.
శౌరీ దీనజనాధారా
ధీరా రావణసంహారా
కారుణ్యాలయ శ్రీరామా
రారా రాఘవ రాజేంద్రా

ఇది ఒక కొత్తవృత్తం. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  UUUIIUUU. ఇలా బదులు UUU-II-UUU అని చెప్తే బాగుంటుందేమో.


కాని దీని నడక చూస్తే ఇది UU - UII - UUU అని తోస్తున్నది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం‌ నడక ఇలా మనోహరంగా ఉంది.

శౌరీ - దీనజ - నాధారా
ధీరా - రావణ - సంహారా
కారు - ణ్యాలయ - శ్రీరామా
రారా - రాఘవ - రాజేంద్రా

ఈ వృత్తానికి బంధుగణం బాగానే ఉంది చూడండి. ఈ క్రింది 19 వృత్తాలూ ఖేలావృత్తానికి తల్లులన్న మాట. ఎందుకంటే వీటిలో‌ఈ ఖేలావృత్తం‌ అంతర్భాగం కాబట్టి. ఇలా సరదాగా మన వృత్తాల్లో తల్లీపిల్లా వరసలు చూడవచ్చును. తమాషా ఏమిటంటే వాసకలీలా అనే వృత్తం పాదంలో ఈఖేలా పాదం రెండుసార్లు వస్తుంది!

1 ధృతహాలా 9 U - UUUIIUUU
2 ఖేలాఢ్యమ్ 9 UUUIIUUU - U
3 ద్వారవహా 10 UI - UUUIIUUU
4 మధ్యాధారా 10 U - UUUIIUUU - U
5 వంశారోపీ 10 I - UUUIIUUU - U
6 విశదచ్ఛాయః 10 II - UUUIIUUU
7 అంతర్వనితా 11 UUUIIUUU - UUU
8 కందవినోదః 11 UII - UUUIIUUU
9 సంసృతశోభాసారః 11 II - UUUIIUUU - U
10 లీలారత్నమ్ 12 UUU - UUUIIUUU - U
11 మత్తాలీ 12 UU - UUUIIUUU - UU
12 విభా 13 IIIIU - UUUIIUUU
13 అలోలా 14 UUUIIUUU - UUIIUU
14 ధీరధ్వానమ్ 14 UUUUUU - UUUIIUUU
15 విధురవిరహితా 17 II - UUUIIUUU - IIIIIIU
16 మఞ్జీరా 18 UUUU - UUUIIUUU - IIUUUU
17 శంభుః 19 II - UUUIIUUU - IIUUUUUUU
18 నిష్కలకణ్ఠీ 22 UII - UUUIIUUU - IIUUIIUUIIU
19 వాసకలీలా 22 UII - UUUIIUUU - II - UUUIIUUU - U

ఈ ఖేలా వృత్తంలోను అద్యంతాల గురువులను రెండింటినీ తొలగిస్తే అది తనుమధ్యా వృత్తం అవుతుంది. అంటే ఖేలావృత్తం‌ తల్లి అతే తనుమధ్య దాని పిల్ల అన్నమాట. ఈ ఖేలావృత్తం‌ నుండి ఆదిగురువును తీసివేస్తే ఒక నలభై వృత్తాలదాకానూ లేదా అంత్యగురువును తీసివేస్తే మరొక నలభై వృత్తాలదాకానూ ఆ గురులఘు క్రమాన్ని కలిగి ఉంటాయి - అంటే అవి దగ్గరి చుట్టాలన్న మాట ఖేలావృత్తానికి.

9, ఆగస్టు 2020, ఆదివారం

నారి

నారి.

ఏమయ్యా

రామయ్యా

నా మోక్షం

బేమాయే


నారి అంటే వింటినారి కాదండోయ్. నారీవృత్తం. నారి అంటే సంస్కృతంలో స్త్రీ అని. 

పాదానికి 3 అక్షరాలు. పొట్టి పద్యం. వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.

గురులఘుక్రమం UUU.  అంటే ఒక్క మ-గణం మాత్రం.

వినయము

వినయము.
శరణం
కరుణా
కర దా
శరథీ

కొనియా
డును రా
ముని నా
మనసే



ఈవినయ వృత్తానికి గురులఘుక్రమం IIU.  అంటే ఒక్క స-గణం ఒక పాదంగా సరిపోతుంది. పాదానికి మూడే ఆక్షరాలు. ప్రాస మాత్రం తప్పదు వృత్తం కాబట్టి.

ఈ వినయవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.

మృగి

మృగి.
ఏమైనా
నీమాటే
నామాటో
రామన్నా

దేవుడా
కావగా
రావె సీ
తావరా



మృగీ వృత్తానికి గురులఘుక్రమం UIU. అంటే పద్యపాదానికి మూడే అక్షరాలన్నమాట. భలే చిట్టివృత్తం. ఇంత చిన్న వృత్తానికీ ప్రాసగండం తప్పదు మరి. 

మృగము అన్న మాటకు జంతువు అని సాధారణార్ధం. లేడి అనేది విశేషించి చెప్పే‌ అర్ధం. అందుచేత మృగీ అంటే‌ ఏదైనా ఆడుజంతువు అని చెప్పటం‌ తప్పులేదు కాని ఆడులేడి అన్నది సరైన అర్ధం.

లేడు నడక ఎట్లా ఉంటుందో తెలుసుకదా. దుముకుతున్నట్లుగా ఉంటుదని వేరే చెప్పాలా. ఐతే అది అడులేడి ఐతే? ఆ దుముకుడు నడక కూడా కాస్త వయ్యారంగా ఉంటుందని ఊహించాలి. ఈ మృగీ వృత్తం నడక కూడా అలా నాలుగు దుముకులు వయ్యారంగా వేసినట్లు ఉంటుంది.

సింహరేఖ

సింహరేఖ.
రూపమా వినీలమేఘం    
చాపమా కృతాంతదండం
చూపులో కృపాప్రవాహం
తాపహారి రామతత్వం

       

ఇది భలే పొట్టివృత్తం. పాదానికి కేవలం 8 అక్షరాలే. దీనికి గణాలు ర - జ - గగ. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.

గురులఘుక్రమం ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే‌ మరొక రకంగా  చూస్తే    (U I) (U I) (U I) (U U ). అంటే  మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట.   ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే‌ త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!

శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం  బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.

      రామ రామా రామ రారా
      రామ రా మా రామ రారా
      రామ రా గారామ రారా
      రామ రా శ్రీ రామ రారా.

ఇందులో‌ పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం‌ ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం‌ మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం‌ ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో‌ ఒకసారి చూడవచ్చును.

ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం.  చిన్నపద్యంలో‌ రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ‌ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే‌ కావటం వలన ఈ‌ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.

ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ‌ ప్రయత్నించండి.

8, ఆగస్టు 2020, శనివారం

కరేణువు

కరేణువు.
ప్రేమ లేదా నాపై
రామచంద్రా నీవే
తామసించే వేలా
యేమి శోధించేవో

కరేణువు అన్న పదానికి ఆడుయేనుగు అని అర్ధం . అటజని కంచె భూమిసురుడు అన్న పద్యంలో మనుచరిత్రకారులు పెద్దన గారు కరేణుకరకంపితసాలము శీతశైలమున్ అంటారు. ఇంకా కొండగోగుకు కూడా కరేణువు అన్న పేరుందని నిఘంటువుల్లో ఉంది.

అదటుంచి ఈ‌ కరేణు వృత్తంలో పాదానికి 6 అక్షరాలు.  గురులఘుక్రమం UIUUUU. సంప్రదాయికమైన పధ్ధతిలో కరేణువృత్తానికి ర-మ అనేది గణవిభజన అని చెబుతారు

మరికొన్ని వృత్తాల్లో ఈ‌ కరేణువృత్తం యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది అంతర్భాగంగా. అవేవో‌ ఒకసారి చూదాం.   

  1
కరేణుః 6 UIUUUU
  2
నిమ్నాశయా 7 U -  UIUUUU
  3
పద్యా 7 I -  UIUUUU
  4
సిరవీ 7 UIUUUU  - U
  5
సుమోహితా 7 I -  UIUUUU
  6
భూమధారీ 8 IU -  UIUUUU
  7
మౌలిమాలికా 8 UI -  UIUUUU
  8
యుగధారి 8 II -  UIUUUU
  9
ధూమ్రాలీ 10 IU -  UIUUUU -  UU
10
నీరోహా 10 IIU -  UIUUUU -  U
11
నిర్మేధా 10 IIIU  -  UIUUUU
12
ఆరాధినీ 11 U -  UIUUUU -  UUUU
13
అమాలీనమ్ 11 IU -  UIUUUU -  UUU
14
అమోఘమాలికా 11 IUIUI -  UIUUUU
15
అపయోధా 11 IIU -  UIUUUU -  UU
16
జాలపాదః 11 U -  UIUUUU -  IUUU
17
కులచారిణీ 11 UIUI -  UIUUUU - U
18
లక్షణలీలా 11 UIIU -  UIUUUU -  U
19
లలితాగమనమ్ 11 IIUII -  UIUUUU
20
వల్లవీవిలాసః 11 UIUIU -  UIUUUU
21
వికసితపద్మావలీ 11 IIIIU -  UIUUUU
22
విలులితమఞ్జరీ 11 IIII -  UIUUUU -  U
23
దోర్లీలా 12 IIUII -  UIUUUU - U
24
కింశుకాస్తరణమ్ 12 UIUII -  UIUUUU -  U
25
వీణాదణ్డమ్ 12 IUIII -  UIUUUU  - U
26
విశాలాంభోజాలీ 12 UUIII -  UIUUUU - U
27
కలాధామమ్ 13 UIIUIII -  UIUUUU
28
లలితపతాకా 14 IIIIIUIU - UIUUUU
29
వింధ్యారూఢమ్ 14 UUU -  UIUUUU - UUIUU
30
జ్హిల్లీలీలా 19 IIIIUUUUUUUUI -  UIUUUU
31
అశోకలోకః 21 UUUUUUUUUUUUUUI -  UIUUUU
32
మందాక్షమందరమ్ 21 IIIIIIUUUUUUIUI -  UIUUUU
33
భీమాభోగః 22 UUUUUIU -  UIUUUU - UUUIUUIUU
34
వంశలోన్నతా 24 UIUIUI -  UIUUUU - UUUIUI -  UIUUUU
35
ఆభాసమానమ్ 26 IUUIUUIU -  UIUUUU -  IUUIUUIUUIUU
36
విశ్వవిశ్వాసః 26 UUUIUUIUUIUU -  UIUUUU - UUIUUIUU

చూసారా పెద్ద పట్టియే ఉంది. ఈ పట్టీ గురించి చిత్రకవిత్వం చెప్పేవాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది.

 ఈ‌ పద్యం‌ నడక గురించి. పాదంలో ఉండేవి ఆరు అక్షరాలే. ఇవి మూడు ఖండాలుగా విరుగుతున్నాయి. రెండేసి అక్షరాల కొక ఖండంగా.  పాదంలో‌ ఉన్న పదకొండు మాత్రలూ 3 + 4 + 4 అన్నట్లు వస్తున్నాయి. పై ఉదాహరణను పరిశీలించండి.

ప్రేమ - లేదా - నాపై
రామ - చంద్రా - నీవే
తామ - సించే - వేలా
యేమి - శోధిం - చేవో

ఇలా ఈ‌ కరేణువు నడక పేరుకు తగ్గట్టుగా కొంచెం‌ ఠీవిగానే ఉంది.  ఐతే ఈ‌నడక తిన్నగా రావాలీ అంటే ప్రతి ఖండం వద్దనూ‌ పదం విరగాలి. అది ప్రతిసారీ అంత సులభం‌ కాక పోవచ్చును. కాని వీలైనంత వరకూ అలా వస్తే ఈపద్యం అందగిస్తుంది.

ఈ‌పద్యం నడక మరొక విధంగా ఉండవచ్చునా అన్న ప్రశ్న వస్తుంది. పాదాన్ని సమద్విఖండనం చేస్తూ కూడా నడక బాగానే ఉండవచ్చును.

ప్రేమ లే  -  దా నాపై
రామచం  -  ద్రా నీవే
తామసిం  -  చే వేలా
యేమి శో  -  ధించేవో

ఏ సందర్భానికి పద్యానికి ఏనడక నప్పుతుందో గమనించి కవి అలా వ్రాయవచ్చును. కాని కవి ఏ లయనూ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం లఘుగురుక్రమం ఒప్పుకొనేలా అక్షరాలను పేర్చుతూ‌ పోయి, ఆమ్మయ్య పద్యం వచ్చింది అనుకుంటే మాత్రం ఆ పద్యం కళ కట్టే అవకాశం బాగా తక్కువే. ఈ సంగతి పద్య ఛందస్సు ఏదైనా సరే వర్తిస్తుంది.


బింబ

 బింబ.
 భూమిసుతా
 కాముని శ్రీ
 నామము చా
 లీ మహిలో

భామరొ నా
రామునకే
నా మదిలో
ప్రేమ సుమా



ఈ బింబ వృత్తానికి గణాలు భ-గ. ఎంత పొట్టి వృత్తం! పాదానికి నాలుగే అక్షరాలు. ఉన్న నియమం ప్రాసనియమం ఒక్కటే!.

సుందరీ వృత్తానికి గణాలు భ-గగ ఐతే ఈ బింబానికి భ-గ. కాబట్టి బింబం సుందరిలో అణగి ఉంటుందన్నమాట. ఇది చిత్రకవిత్వం వ్రాసేవాళ్ళకి పనికి వచ్చే సంగతి.

ఈ బింబవృత్తానికి పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

హాసిక

హాసిక.
రారే మ్రొక్కరే
యీ రామయ్యకున్
కారుణ్యాబ్ధికిన్
మీ రుప్పొంగుచున్



ఈ‌ హాసిక ఒక 5 అక్షరాల చిట్టి వృత్తం. యతిమైత్రిస్థానం  అవసరం లేదు కాని వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం ఉంది.
హాసికకు గురులఘుక్రమం UUUIU అంటే మ-లగ అన్నమాట.

నడక చూస్తే ఇది UU - UIU అన్నట్లుగా సాగుతోంది. పాదంలో ఉన్నవి తొమ్మిది మాత్రలు కదా. అందుచేత ఇది 4 + 5 మాత్రలుగా లయను చూపటం సహజంగానే కనిపిస్తోంది.  పైన ఉదహరించిన పద్యం

రారే - మ్రొక్కరే
యీ రా - మయ్యకున్
కారు - ణ్యాబ్ధికిన్
మీ రు - ప్పొంగుచున్

అన్న లయతో‌ కనబడుతోంది.

ఈ వృత్తాన్ని పూర్వకవులు ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.

కేశవతి

కేశవతి.
ధరాకన్యాపతివై
నరాధీశుండవుగా
ధరన్ జన్మించితివో
హరీ రాముండవుగా

మహాకోదండధరా
మహీకన్యాసహితా
మహాదేవాదినుతా
మహాత్మా రామ విభో

పరాకేలా కృపతో
మొరాలింపం దగురా
సురాధీశాదినుతా
హరీ శ్రీరామ విభో

 

ఈవృత్తం పాదానికి 7 అక్షరాలు.

గురులఘుక్రమం IUU UII U. అంటే య-భ-గ. 

ఈ పద్యం‌ నడకను చూదాం. ఇది IUU - UIIU అన్నట్లు నడుస్తున్నది. పాదానికి ఉన్నవి మొత్తం 11 మాత్రలు. ఇవి సమద్విభాగం చేదామంటే 5 మాత్రలు పూర్వార్ధంగానూ 6 మాత్రలు ఉత్తరార్ధంగాను వస్తాయి. లేద తద్విపర్యయంగా వస్తాయి.  ఉత్తరార్ధం 6 మాత్రలూ‌ మరలా సమద్విఖండితం‌కావటం‌ కూడా బాగుంటుది. ఉదహరణకు ఒక పద్యం చూదాం.

మహాకో - దండ - ధరా
మహీక - న్యాస - హితా
మహాదే - వాది - నుతా
మహాత్మా - రామ - విభో

ఇదీ‌ కొద్ది పద్యాలు ప్రయత్నించి చూసిన తరువాత నాకు కనిపించిన నడక.

పద్యపాదం పొట్టిదే కాని మూడు గురువులు వరుసగా వేయటమే ఇక్కడ ఒక సవాలు.


7, ఆగస్టు 2020, శుక్రవారం

ధర

ధర.
కారుణ్యమే
నీరూపమా
ధీరాగ్రణీ
శ్రీరాముడా


ఈధరా వృత్తం‌ ఒక చిట్టి వృత్తం. పాదానికి నాలుగంటే నాలుగే అక్షరాలు.

గురులఘుక్రమం UUIU. అంటే త-గ అని సంప్రదాయిక గణవిభజన అన్నమాట.

పాదం నిడివి పదక్షరాలలోపు కాబట్టి యతిమైత్రి స్థానం అవసరం లేదు. కాని వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఇంత చిన్న వృత్తంలోనూ‌ నడక అన్నది విశేషంగా ఉంది.  నడక ఒక రకంగా, పంచమాత్రాత్మికంగా ఉందనిపిస్తోంది. అదెలా అంటే UU(I)-IU(U) అన్నట్లు. అంటే పాదం రెండు ఖండాలుగా ఉండి, ఒక్కొక్క ఖండమూ‌ ఐదేసి మాత్రల ప్రమాణంగా నడుస్తున్నదన్న మాట. మరొక రకంగా UU-IU(I) అన్నట్లు చతుర్మాత్రాత్మికంగా అనిపిస్తోంది.

పూర్వకవులు ఎవరన్నా ఈ ధరా వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.
 

బలాక

బలాక.
వరాంగా
నరేశా
ధరాధీ
శ రామా


ఈ బలాక వృత్తం చాలాచాలా పొట్టిది. పాదానికి కేవలం మూడు అక్షరాలే ఉంటాయి. తమాషా ఏమిటంటే, యతిమైత్రి అంటూ అవసరం లేకపోయినా, వృత్తం  కాబట్టి  ప్రాసను పాటించవలసి రావటం.

ఈవృత్తానికి గురులగుక్రమం IUU. అంటే పాదానికి ఒక య గణం మాత్రమే అన్నమాట.

ఇతః పూర్వం ఈ‌బలాకవృత్తాన్ని ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.

తనుమధ్య

తనుమధ్య.
రామా కొన వయ్యా
ప్రేమామృతసారా
సామాన్యుడ నయ్యా
నా మానస మిత్తున్

 

తనుమధ్య వృత్తానికి గణవిభజన త-య. గురులఘుక్రమం UUI IUU. అంటే 6 అక్షరాల పాదం. దానిలో రెండు లఘువులకు అటునిటు రెండేసి గురువులు.  పాదం పదక్షరాల లోపు పొడవు కాబట్టి యతిమైత్రి అవసరం‌ లేదు. ప్రాసనియమం ఉంది వృత్తం‌ కాబట్టి. ఈ వృత్తానికి గణాలు త-య అని చెప్పటం కన్నా, ఈవృత్త నడక UU - II - UU అని చెప్పుకుంటే బాగుంటుంది.లలితా అమ్మవారి నామాల్లో తనుమధ్యా అనే నామం కూడా ఉంది. చూడండి.


తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా (79వ శ్లోకం)

మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం గారి తనుమధ్య పద్యం ఒకటి ఒక ఈమాట వ్యాసం నుండి

     శ్రీవాక్తనుమధ్యల్
     నీవల్లను గల్గన్
     శ్రీ వాద్యవు గావే
     దేవీ తనుమధ్యా 

అసలు ఈ వృత్తానికి తనుమధ్యా అని పేరు పెట్టటంలో ఒక గడుసుదనం ఉంది చూడండి. పద్యంలో రెండు లఘువు లున్నాయి. రెండే ఉన్నాయి. ఆ రెండూ ఎలా ఉన్నాయి? కుడి ఎడమల రెండేసి గురువు ఘనంగా కోటల్లా ఉండగా మధ్యలో ఉన్నాయి. అమ్మాయి నడుము సన్నం అని చెప్పటానికి అమ్మాయి అన్న మాటకు తనుమధ్యా అని చెప్పట కవులకు రివాజు. అంటే స్త్రీకి ఉన్న సవాలక్ష పర్యాయపదాల్లో తనుమధ్యా అనేదీ ఒకటి. ఒక కవి ఐతే ఉధ్ధతుల మధ్య పేదల కుండ తరమె అని స్త్రీ నడుము సన్మగా ఉండటాన్ని గురించి అన్నాడు. ఆ సంకుసాల నృసింహకవి పద్యం ఇదిగో

    ఒత్తుకొనివచ్చు కటితటోద్వృత్తి చూచి
    తరుణి తను మధ్య మెచటికో తొలగిపోయె,
    ఉండెనేనియు కనబడకున్నె? అహహ!
    ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె?

ఈ తనుమధ్యావృత్తానికి క ఇతర పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

6, ఆగస్టు 2020, గురువారం

నంద / కణికా

నంద.
ఓ మానసమా
రాముం డొకనిన్
ప్రేమించినచో
సేమం బగునే

వీరేంద్ర సురేం
ద్రారాధ్య పదా
శ్రీరామ మహా
కారుణ్య నిధీ

 

 
నంద వృత్తానికి పాదానికి 5 అక్షరాలు.

అందుచేత యతి మైత్రి స్థానం అవసరం లేదు

కాని వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.

ఈవృత్తానికి భ-లగ అని గణవిభజన.

అంతకన్నా గగ-స అని చెప్పటం సముచితంగా, ఉంటుంది.

అలా ఎందుకంటే ఈనందవృత్తం పాదంలో 8 మాత్రలు ఉంటాయి. కాబట్టి చతురస్ర గతి నప్పుతుంది సహజంగా. గగ-స అని పాదాన్ని రెండు ముక్కలుగా చూడటం వలన మంచి నడక సాధించవచ్చును.

మరొక విధంగా ఆలోచించరాదా అంటే భేషుగ్గా అలా చేయవచ్చును. అసమఖండాలుగా 5-3 మాత్రలతో నడక కూడా అందంగిస్తుంది.  ఇలా రెండు విధాలైన నడకలను ఈపొట్టి వృత్తంలో సాధించవచ్చును. ఆయా నడకలను చూపుతూ రెండు ఉదాహరణలను ఇచ్చాను. 

5, ఆగస్టు 2020, బుధవారం

మదనవిలసిత / మధుమతి

మదనవిలసిత.
సురరిపుగణ సం
భరమును చిదుమన్
హరి రఘుపతియై
ధర పొడమెనయా  
   

 

ఇది ఇంకొక చిట్టిపొట్టి వృత్తం.

దీనికి గణాలు  - న - గ అనేవి. అంటే పాదానికి 7 అక్షరాలే. ఆరులఘువుల మీద ఒక గురువు.
 కేవలం 28 అక్షరాల్లో పద్యం సమాప్తం అవుతుంది.
వృత్తం‌ కాబట్టి ప్రాస నియమం ఉంది. చిట్టిపాదాలు కాబట్టి యతిస్థానం ఏమీ లేదు.
పూర్వకవులు ఎవరన్నా ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక ప్రకారం చూస్తే ప్రతిపాదమూ  కిటకిట - తకిటా అన్నట్లు వస్తుంది. పైన ఇచ్చిన పద్యాన్ని ఇలా విరుపుతో చూపవచ్చును.

      సురరిపు  - గణ సం
      భరమును - చిదుమన్
      హరిరఘు - పతియై
      ధరపొడ  - మెనయా

ఇలా మదనవిలసితం నడచతురస్రగతిలో నడుస్తున్నది అన్నమాట.  అంటే నాలుగు మాత్రల తరువాత విరుపు. కాబట్టి ఈవృత్తాన్ని న-న-గ అని మూడక్షరాల గణాలుగా చెప్పటం‌ కన్నా

            I I I I - I I U

అని గురులఘు క్రమంగా చెప్పటం బాగుంటుంది. లేదా

           I I - I I - I I - U

అని చెప్పటం‌ బాగుంటుంది.

ఆసక్తి కలవారు కొన్ని  మదనవిలసితాలు వ్రాయటానికి పూనుకోండి.    

అన్నట్లు ఈ‌ విలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు. 
  

4, ఆగస్టు 2020, మంగళవారం

శ్రీ వృత్తం


శ్రీ వృత్తం


శ్రీ.
రా
మున్
గొ
ల్తున్


వృత్తాలన్నింటిలో అతి చిన్న వృత్తం ఏదీ అని ఎవరన్నా ఏదైనా పోటీపరీక్షలో అడుగుతారో లేదో తెలియదు.

టివీషోల్లో వినిపించే తెలుగే అదొకరకం షోకుగా కాస్త తెలుగు వచ్చినవాళ్ళకి వింతగా ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్నని టివీలవాళ్ళు అడిగే అవకాశం లేదు. ఒకవేళ ఎవడికీ తెలియని ప్రశ్న కావాలికదా అని ఏ కోటి రూపాయల ప్రశ్న కోసమో అలా అడగ వచ్చును.

ఒకవేళ ఎవరైనా అడిగితే సమాధానం ఒకటే, వృత్తాలన్నింటిలో అతి చిన్న వృత్తం 'శ్రీ' వృత్తం!

శ్రీ వృత్తానికి గణ విభజన 'గ'. అంటే ఒకే ఒక గురువు.

పాదం నిడివి ఒకే ఒక అక్షరం.

వృత్తం అయ్యేది కాకపోయేది ఒక అక్షరం‌కన్నా చిన్న పాదం కల పద్యం అంటూ, అందులోనూ గురువు చివరన ఉండే పద్యం, ఒక్కటంటే ఒకటే తప్ప రెండవది ఉండే అవకాశం ఐతే‌ లేనేలేదు కదా!

వృత్తం అన్నాక ప్రాసనియమం తప్పదు కదా, ఈ‌ శ్రీవృత్తానికి ఆ అవకాశం లేదు! ప్రాస అంటే పాదంలో రెండవ అక్షరం. ఉన్నది శ్రీ వృత్తానికి పాదానికి ఒకే అక్షరం‌ కాబట్టి ప్రాసనియమం ప్రశ్నే లేదు.

అన్నట్లు మరొక విశేషం కూడా ఉంది ఈ‌ శ్రీ వృత్తం విషయంలో. అందరు లక్షణ కారులూ ఈ‌వృత్తానికి ఈ‌పేరే చెప్పారు. ప్రతి వృత్తానికి సాధారణంగా వీళ్ళలో ఒకరైనా వేరే పేరు పెట్టటం సాధారణం. ఇక్కడ ఆ చిక్కును చూడం అన్నమాట.

వరసగా నాలుగు గురువులు వ్రాయగలరా? ఐతే అది పద్యం అవుతుంది. శ్రీవృత్తం అవుతుంది. మీరు కవి ఐపోతారు. ఎంత సులువైన దారో‌ చూసారా మరి!

స్వస్తి.