కరేణువు.
ప్రేమ లేదా నాపై
రామచంద్రా నీవే
తామసించే వేలా
యేమి శోధించేవో
కరేణువు అన్న పదానికి ఆడుయేనుగు అని అర్ధం . అటజని కంచె భూమిసురుడు అన్న పద్యంలో మనుచరిత్రకారులు పెద్దన గారు కరేణుకరకంపితసాలము శీతశైలమున్ అంటారు. ఇంకా కొండగోగుకు కూడా కరేణువు అన్న పేరుందని నిఘంటువుల్లో ఉంది.
అదటుంచి ఈ కరేణు వృత్తంలో పాదానికి 6 అక్షరాలు. గురులఘుక్రమం UIUUUU. సంప్రదాయికమైన పధ్ధతిలో కరేణువృత్తానికి ర-మ అనేది గణవిభజన అని చెబుతారు
మరికొన్ని వృత్తాల్లో ఈ కరేణువృత్తం యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది అంతర్భాగంగా. అవేవో ఒకసారి చూదాం.
1 |
కరేణుః | 6 | UIUUUU |
2 |
నిమ్నాశయా | 7 | U - UIUUUU |
3 |
పద్యా | 7 | I - UIUUUU |
4 |
సిరవీ | 7 | UIUUUU - U |
5 |
సుమోహితా | 7 | I - UIUUUU |
6 |
భూమధారీ | 8 | IU - UIUUUU |
7 |
మౌలిమాలికా | 8 | UI - UIUUUU |
8 |
యుగధారి | 8 | II - UIUUUU |
9 |
ధూమ్రాలీ | 10 | IU - UIUUUU - UU |
10 |
నీరోహా | 10 | IIU - UIUUUU - U |
11 |
నిర్మేధా | 10 | IIIU - UIUUUU |
12 |
ఆరాధినీ | 11 | U - UIUUUU - UUUU |
13 |
అమాలీనమ్ | 11 | IU - UIUUUU - UUU |
14 |
అమోఘమాలికా | 11 | IUIUI - UIUUUU |
15 |
అపయోధా | 11 | IIU - UIUUUU - UU |
16 |
జాలపాదః | 11 | U - UIUUUU - IUUU |
17 |
కులచారిణీ | 11 | UIUI - UIUUUU - U |
18 |
లక్షణలీలా | 11 | UIIU - UIUUUU - U |
19 |
లలితాగమనమ్ | 11 | IIUII - UIUUUU |
20 |
వల్లవీవిలాసః | 11 | UIUIU - UIUUUU |
21 |
వికసితపద్మావలీ | 11 | IIIIU - UIUUUU |
22 |
విలులితమఞ్జరీ | 11 | IIII - UIUUUU - U |
23 |
దోర్లీలా | 12 | IIUII - UIUUUU - U |
24 |
కింశుకాస్తరణమ్ | 12 | UIUII - UIUUUU - U |
25 |
వీణాదణ్డమ్ | 12 | IUIII - UIUUUU - U |
26 |
విశాలాంభోజాలీ | 12 | UUIII - UIUUUU - U |
27 |
కలాధామమ్ | 13 | UIIUIII - UIUUUU |
28 |
లలితపతాకా | 14 | IIIIIUIU - UIUUUU |
29 |
వింధ్యారూఢమ్ | 14 | UUU - UIUUUU - UUIUU |
30 |
జ్హిల్లీలీలా | 19 | IIIIUUUUUUUUI - UIUUUU |
31 |
అశోకలోకః | 21 | UUUUUUUUUUUUUUI - UIUUUU |
32 |
మందాక్షమందరమ్ | 21 | IIIIIIUUUUUUIUI - UIUUUU |
33 |
భీమాభోగః | 22 | UUUUUIU - UIUUUU - UUUIUUIUU |
34 |
వంశలోన్నతా | 24 | UIUIUI - UIUUUU - UUUIUI - UIUUUU |
35 |
ఆభాసమానమ్ | 26 | IUUIUUIU - UIUUUU - IUUIUUIUUIUU |
36 |
విశ్వవిశ్వాసః | 26 | UUUIUUIUUIUU - UIUUUU - UUIUUIUU |
చూసారా పెద్ద పట్టియే ఉంది. ఈ పట్టీ గురించి చిత్రకవిత్వం చెప్పేవాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది.
ఈ పద్యం నడక గురించి. పాదంలో ఉండేవి ఆరు అక్షరాలే. ఇవి మూడు ఖండాలుగా విరుగుతున్నాయి. రెండేసి అక్షరాల కొక ఖండంగా. పాదంలో ఉన్న పదకొండు మాత్రలూ 3 + 4 + 4 అన్నట్లు వస్తున్నాయి. పై ఉదాహరణను పరిశీలించండి.
ప్రేమ - లేదా - నాపై
రామ - చంద్రా - నీవే
తామ - సించే - వేలా
యేమి - శోధిం - చేవో
ఇలా ఈ కరేణువు నడక పేరుకు తగ్గట్టుగా కొంచెం ఠీవిగానే ఉంది. ఐతే ఈనడక తిన్నగా రావాలీ అంటే ప్రతి ఖండం వద్దనూ పదం విరగాలి. అది ప్రతిసారీ అంత సులభం కాక పోవచ్చును. కాని వీలైనంత వరకూ అలా వస్తే ఈపద్యం అందగిస్తుంది.
ఈపద్యం నడక మరొక విధంగా ఉండవచ్చునా అన్న ప్రశ్న వస్తుంది. పాదాన్ని సమద్విఖండనం చేస్తూ కూడా నడక బాగానే ఉండవచ్చును.
ప్రేమ లే - దా నాపై
రామచం - ద్రా నీవే
తామసిం - చే వేలా
యేమి శో - ధించేవో
ఏ సందర్భానికి పద్యానికి ఏనడక నప్పుతుందో గమనించి కవి అలా వ్రాయవచ్చును. కాని కవి ఏ లయనూ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం లఘుగురుక్రమం ఒప్పుకొనేలా అక్షరాలను పేర్చుతూ పోయి, ఆమ్మయ్య పద్యం వచ్చింది అనుకుంటే మాత్రం ఆ పద్యం కళ కట్టే అవకాశం బాగా తక్కువే. ఈ సంగతి పద్య ఛందస్సు ఏదైనా సరే వర్తిస్తుంది.