8, ఆగస్టు 2020, శనివారం

స్వాగతం

స్వాగతం.
ధీవరుండు నిజ తేజ మెసంగన్     
దేవదుందుభుల దిక్కులు మ్రోయన్
దేవసంఘములు తీయగ పాడన్
రావణాసురుని రాము డడంచెన్

 
ఈ స్వాగతం అనే వృత్తానికి పాదానికి నాలుగే గణాలు. అవి ర - న - భ - గగ.  గురులఘుక్రమం UIUIIIUIIUU యత్తిస్థానం 7వ అక్షరం. పాదానికి కేవలం 11 అక్షరాలతో ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తం అన్నమాట.

ఈ స్వాగతవృత్తానికి ముందు మరొక గురువును చేర్చితే అది నీరాంతికం (U - UIUIIIUIIUU)  అవుతుంది. గురువుకు బదులుగా రెండు లఘువులను చేర్చితే అది కలహంస (II - UIUIIIUIIUU) అవుతుంది. సౌలభ్యం కోసం విడదీసి చూపాను.

రథోధ్దత వృత్తానికీ‌ ఈ‌ స్వాగతవృత్తానికి చాలా దగ్గరి చుట్టరికం. స్వాగతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIIUU ఐతే రథోధ్ధతవృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIUIU. చుట్టరికం చూడండి. స్వాగతంలో చివరన ఉన్న UU ను IU అని మార్చితే అది రథోధ్ధతం అవుతున్నది. 

ఈ వృత్తానికి పాదాంతంలో అనుప్రాసను కూర్చటం కూడా మనం చూడవచ్చును.

పింగళి సూరనగారి కళాపూర్ణోదయం ప్రబంధంలో తృతీయాశ్వాసం చివరన ఒక స్వాగతం ఇలా ఉంది:

      నిర్విరామ ధరణీ భర ణాంకా
      గర్వితారి జయకర్మ విశాంకా
      సర్వదిక్చర విశంకట కీర్తీ
      శర్వరీ రమణ సన్నిభ మూర్తీ

ఇక్కడి అంత్యానుప్రాసలను గమనించండి.

శ్రీ నేమాని సన్యాసిరావుగారి స్వాగత వృత్తం చూడండి:

     మౌనివర్య! జనమాన్య చరిత్రా!
     జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
     మాననీయ గుణ! మంగళదాతా!
     పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!

ఈ వృత్తంలో అంత్యానుప్రాసను పాటించలేదు నేమానివారు.

ఈ పద్యాన్ని ఉదాహరణగా స్వాగతవృత్తానికి ఇస్తూ‌ నేమాని వారు, ఇందులో మూడవపాదం చూడండి. ఇక్కడ మాననీయ గుణ! మంగళదాతా! అని ఉంది కదా దీనిని మాననీయ గుణ! మంగళాన్వితా అని మారిస్తే అది రథోధ్ధతం అవుతుంది అని అన్నారు.

ఇక ఈ‌స్వాగత వృత్తం‌ నడకను చూస్తే అది ఇలా ఉంటుంది.
 
ధీవ - రుండు - నిజ    -     తేజ మె - సంగన్    
దేవ - దుందు - భుల   -    దిక్కులు - మ్రోయన్
దేవ - సంఘ - ములు   -    తీయగ - పాడన్
రావ - ణాసు - రుని   -    రాము డ - డంచెన్

అంటే పద్యం‌ పూర్వార్ధ పరార్ధాలుగా యతిస్థానం దగ్గర సరిగ్గా మధ్యకు విరిగి, ఒక్కొక్కటీ ఎనిమిదేసి మాత్రల ప్రమాణంతో వస్తుం దన్నమాట. ఐతే పూర్వార్ధం 3+3+2 మాత్రలుగానూ 4 + 4 మాత్రలు గానూ నడకను చూపుతుంది. ఈ పద్యంలో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం ప్రారంభం కావటం‌ మంచిది. యతిస్థానం పదం‌ మధ్యలో పడితే అంత రక్తి కట్టక పోవచ్చును. కొంచెం‌ గమనికతో ఉండాలి.