ఖేల.
శౌరీ దీనజనాధారా
ధీరా రావణసంహారా
కారుణ్యాలయ శ్రీరామా
రారా రాఘవ రాజేంద్రా
ఇది ఒక కొత్తవృత్తం. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం UUUIIUUU. ఇలా బదులు UUU-II-UUU అని చెప్తే బాగుంటుందేమో.
కాని దీని నడక చూస్తే ఇది UU - UII - UUU అని తోస్తున్నది.
ఉదాహరణలో ఇచ్చిన పద్యం నడక ఇలా మనోహరంగా ఉంది.
శౌరీ - దీనజ - నాధారా
ధీరా - రావణ - సంహారా
కారు - ణ్యాలయ - శ్రీరామా
రారా - రాఘవ - రాజేంద్రా
ఈ వృత్తానికి బంధుగణం బాగానే ఉంది చూడండి. ఈ క్రింది 19 వృత్తాలూ ఖేలావృత్తానికి తల్లులన్న మాట. ఎందుకంటే వీటిలోఈ ఖేలావృత్తం అంతర్భాగం కాబట్టి. ఇలా సరదాగా మన వృత్తాల్లో తల్లీపిల్లా వరసలు చూడవచ్చును. తమాషా ఏమిటంటే వాసకలీలా అనే వృత్తం పాదంలో ఈఖేలా పాదం రెండుసార్లు వస్తుంది!
1 | ధృతహాలా | 9 | U - UUUIIUUU |
2 | ఖేలాఢ్యమ్ | 9 | UUUIIUUU - U |
3 | ద్వారవహా | 10 | UI - UUUIIUUU |
4 | మధ్యాధారా | 10 | U - UUUIIUUU - U |
5 | వంశారోపీ | 10 | I - UUUIIUUU - U |
6 | విశదచ్ఛాయః | 10 | II - UUUIIUUU |
7 | అంతర్వనితా | 11 | UUUIIUUU - UUU |
8 | కందవినోదః | 11 | UII - UUUIIUUU |
9 | సంసృతశోభాసారః | 11 | II - UUUIIUUU - U |
10 | లీలారత్నమ్ | 12 | UUU - UUUIIUUU - U |
11 | మత్తాలీ | 12 | UU - UUUIIUUU - UU |
12 | విభా | 13 | IIIIU - UUUIIUUU |
13 | అలోలా | 14 | UUUIIUUU - UUIIUU |
14 | ధీరధ్వానమ్ | 14 | UUUUUU - UUUIIUUU |
15 | విధురవిరహితా | 17 | II - UUUIIUUU - IIIIIIU |
16 | మఞ్జీరా | 18 | UUUU - UUUIIUUU - IIUUUU |
17 | శంభుః | 19 | II - UUUIIUUU - IIUUUUUUU |
18 | నిష్కలకణ్ఠీ | 22 | UII - UUUIIUUU - IIUUIIUUIIU |
19 | వాసకలీలా | 22 | UII - UUUIIUUU - II - UUUIIUUU - U |
ఈ ఖేలా వృత్తంలోను అద్యంతాల గురువులను రెండింటినీ తొలగిస్తే అది తనుమధ్యా వృత్తం అవుతుంది. అంటే ఖేలావృత్తం తల్లి అతే తనుమధ్య దాని పిల్ల అన్నమాట. ఈ ఖేలావృత్తం నుండి ఆదిగురువును తీసివేస్తే ఒక నలభై వృత్తాలదాకానూ లేదా అంత్యగురువును తీసివేస్తే మరొక నలభై వృత్తాలదాకానూ ఆ గురులఘు క్రమాన్ని కలిగి ఉంటాయి - అంటే అవి దగ్గరి చుట్టాలన్న మాట ఖేలావృత్తానికి.