మణిరంగం.
శ్యామలాంగ వియచ్చరపూజ్యా
రామచంద్ర సురారివిరోధీ
నామనంబున నమ్మితి నయ్యా
ప్రేమ నేలవె వేదసువేద్యా
ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం. పాదానికి 10 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం UIUIIUIIUU. గణవిభజన ర - స - స - గ . యతిస్థానం 6వ అక్షరం. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంది.
నడక ప్రకారం దీని గురులఘుక్రమం UIUII - UIIUU అన్నట్లు ఉంటుంది. సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో. పాదంలో ఉన్నవి 14 మాత్రలు. సరిగా 7 మాత్రల తరువాత పాదం విరుగుతుం దన్నమాట సమంగా.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.
శ్యామ లాంగ వి - యచ్చర పూజ్యా
రామ చంద్ర సు - రారివి రోధీ
నామ నంబున - నమ్మితి నయ్యా
ప్రేమ నేలవె - వేదసు వేద్యా
మణిరంగ వృత్తంలో నేమాని రామజోగి సన్యాసిరావు గారి శివస్తుతి పద్యం.
పార్వతీపతి పాపవిదారా
సర్వరక్షక సౌఖ్యవిధాతా
శర్వ ధూర్జటి శంకర దేవా
గర్వ నాశక కామిత మీవా
ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.