అర్ధకళ.
నిరవద్యగుణాభరణా
సురసేవిత శ్రీచరణా
ధరణీతనయారమణా
విరతాఖిలదైత్యగణా
ఈ చిన్నారి వృత్తానికి పాదానికి 9 అక్షరాలు. గురులఘుక్రమం IIUIIUIIU. అంటే, పాదానికి గణాలు స - స - స. యతిమైత్రి స్థానం అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు. పై పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.
ఈ అర్ధకళ తోటకాన్నుండి పుట్టినట్టు చెప్పవచ్చును. తోటకం గణాలు స - స - స - స. వీటిలో నుండి ఒక స-గణం తగ్గిస్తే అది అర్ధకళ అవుతుంది. ఈ అర్ధకళకు ఎడాపెడా తలొక గురువునూ తగిలిస్తే అది దోధక వృత్తం అవుతుంది.
ఒకటా రెండా, ఏకంగా డభై పైన వృత్తాల్లో ఈఅర్ధకళ ఇమిడిపోతుంది.
ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.
ఈ అర్ధకళ నడకను చూస్తే 5 అక్షరాల తరువాత విరుపు కనిపిస్తోంది. అంటే IIUII - UIIU అన్నట్లు. అంటే మాత్రాపరంగా పాదంలో సమద్విఖండనం చూపుతున్నది.
నిరవద్యగు - ణాభరణా
సురసేవిత - శ్రీచరణా
ధరణీతన - యారమణా
విరతాఖిల - దైత్యగణా
జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉదాహరణకు ఇచ్చిన ఈపద్యంలో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.