10, ఆగస్టు 2020, సోమవారం

మంజులయాన

మంజులయాన.
కనులార భవదీయ కమనీయ రూపమున్
కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
తనివార నిను జూడ తగనందువా ప్రభూ
మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా



ఈ మంజులయాన వృత్తంలో‌ పాదానికి 15 అక్షరాలుంటాయి. దీని  గురులఘుక్రమం IIUIIIUIIIUIUIU అని. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం. ఇది నడక ప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ 'మంజులయాన' వృత్తం  నేను సృష్టించినది. మొదట్లో  దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా. ఆ సందర్భంగా ముందుగా ఈపద్యం లక్షణాన్ని ఒకపాదంగా  ఇవ్వటం‌ జరిగింది. అదెలా అంటే

పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

అని!

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
    అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు, అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా
     
మోహన రావు గారు పరిశీలించి చెప్పినట్లుగా ఇది పూర్తిగా కొత్త గురులఘుక్రమం కలిగిన వృత్తం. తెలిసిన వృత్తాలు దేనిలోనూ ఇది అంతర్భాగం‌ కాదు.

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

యతిమైత్రి స్థానం వద్ద విరుపు ఇవ్వాలి. అంటే అక్కడ కొత్తపదం‌తో‌ మొదలవ్వాలి వీలైనంత వరకు. అప్పుడు వినటానికి చాలా బాగుంటుంది నడక. ముఖ్యంగా పంచమాత్రా విభజనతో నడుస్తున్నది కాబట్టి ఐదేసి మాత్రలకు కొత్తపదాలు పడటం‌ మరింత శోభిస్తుంది.