చిత్రపదము
రాముని నమ్మిన వాడా
నీమము దప్పని వాడా
స్వామియె తోడుగ లేడా
కామిత మీయగ రాడా
ఈ చిత్రపదం పాదానికి 8 అక్షరాలుండే చిన్న వృత్తం. గురులఘుక్రమం UIIUIIUU. అంటే దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని. వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.
ఈ చిత్రపద వృత్తం పాదానికి ముందు ఒక లఘువునీ చివర్న ఒక గురువునీ తగిలిస్తే అది ఇంద్ర వృత్తం అవుతుంది. ఈ చిత్రపదం ముందు రెండు గురువులు తగిలిస్తే అది ప్రసర వృత్తం అవుతుంది. రెండు సరిపోవండీ అని నాలుగు గురువులు తగిలిస్తారా అది కాసారక్రాంత వృత్తం అవుతుంది. అబ్బే గురువు లెందుకండీ బరువులూ అంటారా? చిత్రపదం పాదం మొదట రెండు లఘువులు తగిలించండి. అది ఉదితం అనే వృత్తం అవుతుంది. ఆపైన పాదం చివర్న ఒక గురువునూ తగిలిస్తారా అప్పుడది విష్టంభం అనే వృత్తం అవుతుంది. చిత్రపదం పాదారంభంలో ఒక భ-గణం తగిలిస్తారా? అప్పుడు అది దోధక వృత్తం అవుతుంది. పోనీ స-గణం తగిలిస్తారా, అప్పుడది రోధక వృత్తం అవుతుంది. మొదటేమీ వద్దండీ అని చిత్రపదం చివర్న ఒక స-గణం తగిలిస్తారా? అప్పుడు అది కలస్వనవంశం అనే వృత్తం అవుతుంది. ఇలా చాలానే చుట్టరికాలు చూడవచ్చును దీనికి.
ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.
భక్త జనావన దక్షా
ప్రాక్తన శాసన పక్షా
యుక్త విచారణ దీక్షా
సక్త మహేశ్వర రక్షా
ఈ చిత్రపదం నడకను చూస్తే చివరి రెండు గురువుల ముందు కొంచెం విరుపు కనిపిస్తోంది.
ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.
11, ఆగస్టు 2020, మంగళవారం
చిత్రపదము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)