చంద్రవర్త్మ.
రాము డల్పుడని రావణు డనియెన్
రామబాణమున ప్రాణము వదిలెన్
కాముకుండు నరకంబున కరిగెన్
భామతోడ రఘువల్లభు డరిగెన్
ఈ చంద్రవర్త్మ వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIIIIU .దీని గణవిభజన ర - న - భ - స. యతిమైత్రి స్థానం 7వ అక్షరం.అంటే యతిమైత్రి స్థానం వద్ద పాదం సమద్విఖండితం అవుతుం దన్నమాట. ప్రాసనియమం తప్పదు.
ఇది స్వాగతవృత్తానికి సోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట. స్వాగతంలోని న-గణాన్ని లగ అని మార్చితే అన్నే మాత్రలతో, అదే స్వాగతం నడకతో మాధురీవృత్తం అవుతుంది. అలాగే స్వాగతంలోని భ-గణాన్ని గగ అని మార్చితే ఇంచుమించిగా అదే స్వాగతం నడకతో శ్రేయావృత్తం అవుతుంది. స్వాగతంలో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే అదే స్వగతపు మాత్రలూ నడకలతో అది ద్రుతపదవృత్తం అవుతుంది. ఇవన్నీ ఒక చిన్న గుంపు అనుకోవచ్చును.
ఈ చంద్రవర్త్మ యొక్క గురులఘుక్రమం, విషగ్వితానం అనే వృత్తంలో అంతర్భాగంగా ఉంటుంది.
ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అంటే విశ్వనాథవారు వాడారు. వారి సాహిత్యం నుండి ఉదాహరణను సేకరించవలసి ఉంది.
ఈ చంద్రవర్త్మ నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.
రాము - డల్పు - డని - రావణు - డనియెన్
రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
కాము - కుండు - నర - కంబున కరిగెన్
భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్
11, ఆగస్టు 2020, మంగళవారం
చంద్రవర్త్మ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)