10, ఆగస్టు 2020, సోమవారం

జలదము / లవలీలత

జలదం.
పుట్టువు లేని వాడొకడు పుట్టెనయా
పుట్టెడు నెల్లవారలకు పుట్టువులే
పుట్టని మంచిదారి రఘుపుంగవుడై
యిట్టి దటంచు జూపె నటు లేగుదమా
   
రామచరిత్రముం జదువ రక్కట శ్రీ
రాముడు చెడ్డవాడనుచు రావణుపై
ప్రేమను చిల్కరించి చెలరేగెద రీ
భూమిని కొంతమంది కలి బోధితులై



ఈ జలద వృత్తానికి పాదానికి 13 అక్షరాలు.  పాదంలో గురులఘుక్రమం  UIIUIUIIIUIIU.

గణ విభజన భ - ర - న - భ - గ.  యతిస్థానం 10వ అక్షరం.

ఈ‌ జలద వృత్తం  ఉత్పలమాలకు బాగా దగ్గరి చుట్టం. ఉత్పలమాల గణాలు భ - ర - న - భ - భ - ర - వ. అంటే ఉత్పలమాలలో మొదటి 13అక్షరాలకుకుదిస్తే అది జలదం అన్నమాట.

ఈ‌జలద వృత్తానికి లవలీలత అని మరొక పేరు కూడా ఉంది.

జలదవృత్తం‌ పాదానికి ముందొక లఘువును చేర్చితే‌ అది కాకిణికా వృత్తం‌ అవుతుంది. శంబరం, సూరసూచిక అనే వృత్తాల్లో జలదవృత్త గురులఘుక్రమం అంతర్భాగంగా ఉంది ఉత్పలమాలకే‌ కాకుండా.

ఈ‌ జలదవృత్తానికి  కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి ప్రయోగం.

    వేసవి నెండ నుక్కఁ గడు వెక్కసమై
    వేసరిజేసినన్ దపము విశ్వజనుల్
    వాసిగ వారి నేల హరి వచ్చెనొ నా
    భాసిలె నింగినిన్ జలదవార మహా

ఈ‌జలదం‌ నడక చూస్తే యతిస్థానం దగ్గర విరుపు కనిపిస్తోంది. అంతవరకూ ఉత్పలమల లాగా సాగుతుంది. ఆపైన రెండు త్రిమాత్రాగణాలుగా ముక్తాయింపు ఉంటుంది పాదానికి.

పుట్టువు లేని వాడొకడు - పుట్టె - నయా
పుట్టెడు నెల్లవారలకు - పుట్టు - వులే
పుట్టని మంచిదారి రఘు - పుంగ - వుడై
యిట్టి దటంచు జూపె నటు - లేగు - దమా

ఇక్కడ నేను రెండు పద్యాలను చూపాను.  రెండింటికి నడకలోనూ కొద్దిగా బేధం ఉండటం గమనించండి.  రెండు పద్యాల్లోనూ ప్రవాహగుణం చూడవచ్చును. ప్రవాహగుణం అంటే పాదంచివరి మాట తరువాతి పాదంలోనికి చొచ్చుకొని పోవటం అన్నమాట. ఇది పద్యానికి కొంత గాంభీర్యత తెస్తుందన్న అభిప్రాయం కొంత కవిలోకంలో తరచు వినబడుతుంది.  పూర్తిగా కాదు కాని అది కొంతవరకు నిజం. కాని సంస్కృతంలో మాత్రం ఏ పాదానికి ఆపాదం పూర్తికావాలి.  పాదం చివరి మాట తరువాతి పాదంలో కొనసాగటం నిషిధ్ధం. అందువల్ల సంస్కృత కవిత్వంలో గాంభీర్యానికి లోపం ఏమీ రాలేదు కదా.  తెలుగులో దీర్ఘాంతంగా ముగిసే పదాలు తక్కువ.  అందుచేత సంసృతవృత్తాలను తెలుగు భాషలో పద్యాలుగా వ్రాసేటప్పుడు పాదోల్లంఘనాన్ని అనుమతించక తప్పదు.  లేకపోతే విడివిడిగా పద్యాలు కుదురుతాయేమో కాని కథాకథనానికి పద్యాలు సహకరించక ఇబ్బంది కావచ్చును.