కౌముది.
సురలకేమో సుఖావాప్తిగన్
సురగణారిన్ సొదం బెట్టగన్
వరలె రామావతారం బిలన్
పరమధర్మప్రకాశంబుగన్
(యతి 6వ స్థానం)
కౌముది.
దివిషదుల్ గోర శ్రీరాముడై
భువికినే తెంచె నా వెన్నుడే
భువనసమ్మోహనాకారుడై
భువనసంరక్షణోద్యోగియై
(యతి పాటించలేదు)
కౌముది.
అనితరం బైన దా రూపమే
అనితరం బైన దా శౌర్యమే
తనువునం దాల్చి తా వెన్నుడే
మనుజుడై పుట్టె మా రాముడై
(యతి 7వ స్థానం)
ఈ కౌముది ఒక పొట్టి వృత్తం. పాదం నిడివి 10 అక్షరాలు. దీనికి చరపదం అని మరొక పేరు. దీని గురులఘుక్రమం IIIUUIUUIU. అంటే దీనికి గణవిభజన న - త - త - గ . ఇంత చిన్న వృత్తానికి యతిస్థానం అవసరం లేదని నా అభిప్రాయం. కాని లక్షణకారులు 6వ అక్షరం యతిస్థానం అని చెప్పారు. ప్రాసనియమం తప్పదు. నడక విషయం చూదాం. మనం దీనిలోని గురులఘుక్రమాన్ని నల - ర - ర అని పంచమాత్రాగణాలుగా విభజన చేయవచ్చును. బహుశః ఇదే సహజమైన గణవిభజన అనుకోవచ్చును. నడక ననననా-నాననా-నాననా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉదాహరణలు చూదాం .
ఈ కౌమిదీవృత్త పాదానికి ముందు ఒక న-గణం తగిలిస్తే అది చంద్రికావృత్తం అవుతుంది. న-గణంతో పాటుగా పాదం చివరన ఒక గురువును కూడా జతపరిస్తే అది నాందీముఖీవృత్తం అవుతుంది. కౌముది పాదం చివరన మరొ ర-గణం తగిలిస్తే అది పరివృఢం అనే వృత్తం అవుతుంది. ఆ ర-గణంతో పాటు మరొక గురువును కూడా జోడిస్తే అది పరీవాహవృత్తం అవుతుంది. ఇవి కాక మరికొన్ని వృత్తాల్లో కూడా ఈ కౌముది ఇమిడి ఉంది.
మొదటగా 6వ అక్షరం యతిస్థానంగా ఒక కౌముదీ పద్యం.
సురలకేమో సుఖావాప్తిగన్
సురగణారిన్ సొదం బెట్టగన్
వరలె రామావతారం బిలన్
పరమధర్మప్రకాశంబుగన్
యతినియమం వదిలి పెట్టి ఒక పద్యం.
దివిషదుల్ గోర శ్రీరాముడై
భువికినే తెంచె నా వెన్నుడే
భువనసమ్మోహనాకారుడై
భువనసంరక్షణోద్యోగియై
ఈ పద్యం పంచమాత్రాగణాలతో కూడిన నడకతో ఉన్నది అనుకున్నాం కదా. ఆ ప్రకారం విడదీసి చూపితే ఈక్రింది విధంగా ఉంటుంది. ఐదు-ఐదు మాత్రలతో నడిచే తాళగతిని ఖండగతి అంటారు.
దివిషదుల్ - గోర శ్రీ - రాముడై
భువికి నే - తెంచె నా - వెన్నుడే
భువన స - మ్మోహనా - కారుడై
భువన సం - రక్షణో - ద్యోగియై
ఈ కౌముదీవృత్తానికి యతిస్థానంగా 7వ అక్షరాన్ని గ్రహించటం కూడా బాగుంటుంది. యతిస్థానం కూడా ఒక గురువు పైన వస్తుంది. ఇలా కూడా ఒక పద్యం చెప్పుకుందాం.
అనితరం బైన దా రూపమే
అనితరం బైన దా శౌర్యమే
తనువునందాల్చి తా వెన్నుడే
మనుజుడై పుట్టె మా రాముడై
యతిస్థానం 7వ అక్షరంగా విరచి చదివితే దీని నడక భిన్నంగా తమాషాగా ఉంటుంది
అనితరం - బైన - దా - రూపమే
అనితరం - బైన - దా - శౌర్యమే
తనువునం - దాల్చి - తా - వెన్నుడై
మనుజుడై - పుట్టె - మా - రాముడే
కొందరు యతిస్థానం 6వ అక్షరంగా నప్పుతుందనీ మరి కొందరు 7వ అక్షరంగా నప్పుతుందనీ అభిప్రాయ పడవచ్చును. అలాగే యతిస్థానం లేకపోవటమే ఉత్తమం అనీ కొందరు అనుకోవచ్చును. వాడంకం మీద కాని ఏ ఆలోచన సరైనది అని నిగ్గుతేలదు. 7వ స్థానంలో యతితో మంచి తూగు కనపడుతోంది - లాక్షణికం కాకపోయినా అని డా॥విష్ణునందన్ గారు అభిప్రాయం వెలిబుచ్చారు.
ఈ కౌముదీవృత్తానికి పూర్వకవుల ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అంటే విశ్వనాథ వారు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తున్నది. ఉదాహరణ సేకరించాలి.
12, ఆగస్టు 2020, బుధవారం
కౌముది / చరపదం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)