కుమారవిలసితం.
పురాకృతమున నే
నరుండ నయితి నా
కరంబు గొనుమయా
బిరాన రఘుపతీ
ఈ కుమారవిలసిత వృత్తం పాదానికి 7 అక్షరాలు. గురులఘుక్రమం IUIIIIU. అంటే గణవిభజన జ-న-గ. యతిస్థానం లేదు. ప్రాసనియమం ఉంది.
ఈ కుమారవిలసితానికి స్విదా అని మరొక పేరుంది.
ఈ కుమారవిలసిత పాదానికి ముందు ఒక గ-ల చేర్చితే అది ప్రియతిలకావృత్తం అవుతుంది. పాదానికి ముందొక లఘువునూ, చివరన ఒక గురువునూ చేర్చితే అది సుగంధి అనే వృత్తం అవుతుంది. పాదానికి ముందు న-గణం చేర్చితే అమృతగతి వృత్తమూ, స-గణం చేర్చితే ధమనికా వృత్తమూ అవుతుంది. ఇంకా మరొక ముఫ్ఫైచిల్లర వృత్తాల్లోనూ ఈకుమారవిలసిత యొక్క గురులఘుక్రమం కనిపిస్తుంది.
నడకను చూస్తే ఇది గణాంతాలలో విరుపుతో వస్తున్నట్లుగా అన్నట్లు కనిపిస్తోంది.
పై పద్యం నడక ఈ క్రింది విధంగా ఉన్నది:
పురా - కృతమున - నే
నరుం - డనయితి - నా
కరం - బుగొనుమ - యా
బిరా - నరఘుప - తీ
ఇందులో ప్రాసస్థానంపైన ఉన్న గురువును రెండు మాత్రల కాలం కన్నా మూడు మాత్రలుగా ఉఛ్ఛరించటం బాగుంటుంది. అలా చేసినప్పుడు మొదటి రెండు అక్షరాలతో ఒక చతుర్మాత్రాగణం గానూ పిదప నాలుగక్షరాలూ మరొక చతుర్మాత్రాగణంగానూ ఏర్పడతాయి. పాదాంతగగురువును కూడా మరొకరెండు మాత్రలుగా ఆ అక్షరాన్నే ఒక చతుర్మాత్రాగణంగా ఉఛ్ఛరించటం పధ్ధతిగా ఉంటుంది. చివరి గురువుముందు విరుపుతో పైపద్యం నడిచింది. అలాగే తొలిగురువు తరువాత కూడా ఒక విరుపు ఉన్నది. ఇలా ఈ వృత్తం ఒక చతురస్రగతిలో చక్కగా నడుస్తుంది. చతురస్రగతికి ఏకతాళం వాడుక చేయటం జరుగుతూ ఉంటుంది.
వేరే విధంగా కూడా ఈ చిట్టివృత్తాన్ని నడిపించటం కుదురుతుందా అంటే 5 మాత్రలచొప్పున నడిపించ వచ్చును. చివర గురువును కొంచెం మరొక మాత్రాకాలం సాగదీయా లంతే.
పురాకృత - మున నే
నరుండన - యితి నా
కరంబుగొ - నుమ యా
బిరానర - ఘుప తీ
ఇలా నడక వైవిద్యంతో ఉండవచ్చును.
ఈ కుమారవిలసితానికి పూర్వకవి ప్రయోగాలున్నాయేమో తెలియదు.