శ్రద్ధరా
రామ నీదు భక్తుడరా
స్వామి నీకె మ్రొక్కుదురా
ప్రేమ మీఱ బ్రోవవయా
కామితార్ధ మీయవయా
ఈ శ్రధ్ధరా వృత్తానికి సమానిక అని మరొక పేరు. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం UIUIUIIU. గణవిభజన ర-జ-లగ అని. పాదంలో మొత్తం 12 మాత్రలుంటాయి.
ఈ శ్రధ్ధరావృత్త పాదం ముందు రెండు లఘువులు చేర్చితే అది ప్రవాదపదవృత్తం అవుతుంది. అలాకాక పాదం చివర లగ చేర్చిటే అది వర్మితా వృత్తం అవుతుంది. ఆశ్చర్య మేమిటంటే ఇంత చిన్న గురులఘుక్రమం కేవలం ఆ రెండూ కాక ప్రపాతలికా, భస్త్రావిస్తరణం, విలాసవాసం, విరామవాటికా అనే మరొక నాలుగు వృత్తాల్లో మాత్రమే కనిపిస్తున్నది!
ఈ శ్రధ్దరా వృత్తం నడక ప్రకారం చూస్తే UI - UI - UI - IU అన్నట్లు మూడేసి మాత్రల గణాలుగా విరుపుతో కనిపిస్తుంది.
ఉదాహరణలో ఇచ్చిన పద్యం నడక ఇలా త్రిస్రగతితో కనిపిస్తోంది.
రామ - నీదు - భక్తు - డరా
స్వామి - నీకె - మ్రొక్కు - దురా
ప్రేమ - మీఱ - బ్రోవ - వయా
కామి - తార్ధ - మీయ - వయా
చిన్నచిన్న పద్యాలను వ్రాసే టప్పుడు వీలైన విధంగా అంత్యప్రాసలను కూడా ప్రయోగిస్తే అవి మరింతగా అందగిస్తాయి.
ఈ శ్రధ్దరా పద్యం వ్రాయటం చాలా సులువు. ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.