తుంగ.
పరమ సఖుడ రామా
పరమ హితుడ రామా
నిరుపముడవు నిన్నే
యరసి కొనెద నాలో
తుంగ.
హరి మన సఖుడైతే
హరి మన గురుడైతే
హరి మన హితుడైతే
మరి యిక సుఖమేగా
ఈ తుంగ అనే వృత్తానికి గురులఘుక్రమం IIIIIIUU. అంటే న-న-గగ అనేది గణవిభజన అన్నమాట. ప్రాసనియమం పాటించాలి. యతిమైత్రి అవసరం లేదు.
ఈ తుంగకు బంధుగణాన్ని చూదాం. పాదం చివర ఒక గురువును చేర్చితే అది భుజగశిశుభృతం అవుతుంది. పాదం ముందు రెండు లఘువులను చేర్చితే అనిమావృత్తం అవుతుంది, రెండు గురువులను చేర్చితే ఉన్నాలం అవుతుంది, గ-ల చేర్చితే ఉపధాయా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అది కలితకమలవిలాసం అవుతుంది, స-గణం చేర్చితే మదనయావృత్తం అవుతుంది, య-గణం చేర్చితే పరిమళలలితం అవుతుంది. పాదం చివరన కాక పాదం ముందు మ-గణం చేర్చితే అది మాత్రావృత్తం, స-గణం చేర్చితే సువృత్తి అవుతుంది. ఇవే కాక ఇంకా చాలా వృత్తాల్లో ఈ తుంగ తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.
ఈ పద్యం నడక ఇలా ఉంది త్రిస్రగతిలో. ఇక్కడ చివర గురువులు రెండూ ఒక్కోటీ మూడేసి మాత్రలుగా పలుకుతున్నాయి.
పరమ - సఖుడ - రా - మా
పరమ - హితుడ - రా - మా
నిరుప - ముడవు - ని - న్నే
యరసి - కొనెద - నా - లో
వేరే విధంగా కూడా నడక ఉండవచ్చును. అదీ చూదాం. ఇక్కడ చతురస్ర గతిలో పద్యం నడిచింది. చివరి గురువు మాత్రం అవసరార్ధం లాగి పలకాలి.
హరి మన - సఖుడై - తే
హరి మన - గురుడై -తే
హరి మన - హితుడై - తే
మరి - యిక - సుఖమే - గా
జెజ్జాల కృష్ణ మోహన రావు గారి పద్యం ఒకటి కనిపిస్తోంది ఇలా.
మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే